హైదరాబాద్ (వి.వి) : ఎపిపిఎస్‌సి గ్రూప్-1 ప్రిలిమి నరీ పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగు తూనే ఉంది. ప్రకటించిన విధంగానే యథావిధిగా సెప్టెంబర్ 5వ తేదీనే పరీక్షను నిర్వహిస్తామని ఎపిపిఎస్‌సి పాలకమండలి ఒక వైపు స్పష్టం చేస్తూనే మరోవైపు ప్రభుత్వమే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటోంది. అయితే శుక్రవారం సాయంత్రం వరకు ప్రభుత్వం ఈ విష యంపై మిన్నకుండిపోయింది. పరీక్షలు యథావి ధిగా జరుగుతాయా లేక వాయిదా పడతాయా అన్నది తేలలేదు. దీంతో అభ్యర్థుల్లో నరాలు తెగే ఉత్కంఠత నెలకొంది. పరీక్షలను వాయిదా వేయాల్సిందేనంటూ తెలంగాణ జెఎసి, ఉస్మానియా విద్యార్థి సంఘాల జెఎసి పట్టుపడుతుండగా యథావిధిగా పరీక్షను నిర్వహించాలని సీమాంధ్ర విద్యార్థి జెఎసి డిమాండ్ చేస్తోంది. ఈ పూర్వరంగంలో గురు, శుక్రవారాల్లో ఎపిపిఎస్‌సి పాలకమండలి అత్యవసరంగా సమావేశమై యథావిధిగానే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం విస్తృత ఏర్పాట్లను ఇప్పటికే చేస్తోంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించారు. అడ్డుకుంటే చర్యలు తప్పవని ఆయా జిల్లా పోలీసు యంత్రాంగం హెచ్చరిస్తోంది. పరీక్షలను వాయిదా వేయాల్సిందేనంటూ ఎబివిపి కార్యక ర్తలు నేడు సచివాలయ ముట్టడికి విఫలయత్నం చేశారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వారిని బలవంతంగా అరెస్టు చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఎపిపిఎస్‌సి కార్యాలయం వద్ద కూడా తెలంగాణ జెఎసి ఆధ్వర్యాన ధర్నా, అరెస్టులు జరిగాయి. తెలంగాణ ప్రాంతంలో నాలుగవ తేదీన తరగతుల బహిష్కరణకు విద్యార్థి జెఎసి పిలుపునివ్వగా అదే సమయంలో సీమాంధ్ర విశ్వవిద్యాలయాల బంద్‌కు అక్కడి జెఎసి పిలుపునిచ్చింది. 5వ తేదీన తెలంగాణ బంద్‌ను జెఎసి నిర్వహించనుంది. దామాషా ప్రకారం 42 శాతం తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలని, అవినీతిపరుడైన ఎపిపిఎస్‌సి ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని తొలగించాలని తెలంగాణ జెఎసి డిమాండ్ చేస్తోంది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
