హైదరాబాద్ (వి.వి.) : ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి బోధనా ఫీజుల అంశంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలన్న యోచనలో రాష్ట్ర సర్కార్ ఉంది. హైకోర్టు తీర్పుపై అడ్వకేట్ జనరల్‌తోనూ, న్యాయశాఖ అధికారులతోనూ చర్చించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వి. ప్రసాద్‌ను ఆదేశించింది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఈనెల 7వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై సుప్రీంకోర్టుకు వెళ్ళే విషయాన్ని ఖరారు చేయనుంది. ఫీజుల రీఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల విషయం, హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు నేపథ్యంలో మంత్రిమండలి ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. అనంతరం వివరాలను సాంఘిక సంక్షేమ శాఖమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, పంచాయతీ రాజ్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ, గిరిజన సంక్షేమ శాఖమంత్రి పి. బాలరాజ్, పశుసంవర్థక శాఖమంత్రి కె. పార్థసారథి పత్రికల వారికి వెల్లడించారు. మంత్రి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, అర్హులైన విద్యార్థులందరికీ ఫీజుల రీఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉందన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. విద్యార్థులకు నష్టం లేకుండా చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. అడ్మిషన్ సమయంలోనే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు విద్యార్థి లేదా ప్రభుత్వం విధిగా బోధనా ఫీజును చెల్లించాలని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఫీజుల రీఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల విధానానికి సంబంధించి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారం వార్షిక ఆదాయం లక్ష రూపాయలు, అలాగే 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ఏడాది ఫీజుల రీఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులకు సంబంధించి రూ.2093 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ. 1704 కోట్లు విడుదల చేశామని, మిగిలిన మొత్తాన్ని త్వరలోనే విడుదల చేస్తామని సుభాష్ చంద్రబోస్ తెలిపారు.
రెవెన్యూ రికవరీ చట్ట ప్రయోగం
కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 85 వేల మంది బోగస్ లబ్ధిదారుల పేర ఆయా యాజమాన్యాలు డబ్బులను డ్రా చేశాయని, వారిపై చర్యలు తీసుకుంటామని బొత్స తెలిపారు. ఒకే విద్యార్థికి రెండుసార్లు స్కాలర్‌షిప్పులు మంజూరు అవడం, ఒకే సమయంలో రెండు కాలేజీల్లో ఆ విద్యార్థి చదువుతున్నట్లుగా ఫీజుల రీఎంబర్స్‌మెంట్ పొందడం లాంటివి ఇందులో ఉన్నాయన్నారు. ఇలా అదనంగా డ్రా చేసిన మొత్తాలు రూ. 95 లక్షల వరకు ఉంటాయని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
