'విశాలాంధ్ర' వార్తకు స్పందన - కదలిన అధికార యంత్రాంగం

Fri, 3 Sep 2010, IST    vv
క్షమాపణ చెప్పిన పెత్తందార్లు
సాంఘిక బహిష్కరణ విధించిన వారిపై చర్యలు : రజకులకు అధికారుల హామీ

శ్రీరాంపూర్‌ (వివి) : ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల మండలం సింగాపూర్‌ గ్రామంలో ''బట్టలు ఉతకడం లేదని...15 రజక కుటుంబాల వెలి!'' శీర్షికతో 'విశాలాంధ్ర'లో వచ్చిన వార్తాకథనంతో అధికార యంత్రాం గంలో కదలిక వచ్చింది. ఈ గ్రామానికి కదిలి వచ్చిన అధికారులు బహిష్కరణ విధించిన పెత్తందార్లచే రజకులకు క్షమాపణ చెప్పించారు. సాంఘిక బహిష్కరణ విధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రజకులకు హామీనిచ్చారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు హుటాహుటిన గ్రామాన్ని సందర్శించిన ఎంఆర్‌ఓ గ్రామ సభ నిర్వహించి బహిష్కరణ విధించిన పెత్తందార్లచే రజకులకు క్షమాపణ చెప్పించారు. 'విశాలాంధ్ర' వార్తను చూసి పెత్తందార్ల తీరును గర్హిస్తూ రజకవృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, రాస్తారోకోలు జరిగిన విషయం తెలిసిందే. పెత్తందార్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి, మానవ హక్కుల కమిషన్‌, బిసి కార్పొరేషన్‌ ఎండీలకు వినతిపత్రాలను సమర్పించారు. గురువారం (ఈనెల 2న) మంచిర్యాలలో రజకుల ఆత్మగౌరవ సభను నిర్వహించారు. దీనికి రాష్ట్రం నలుమూలల నుండి అత్యధిక సంఖ్యలో రజకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఆర్‌ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో దిగి వచ్చిన అధికార యంత్రాంగం పెత్తందార్లచే రజకులకు క్షమాపణ చెప్పించింది. సాంఘిక బహిష్కరణ విధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వృత్తిదా రులకు కనీస వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య తెలిపారు. రజకులకు వృత్తిపరంగా రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు. సింగాపూర్‌లో రజకులను సాంఘిక బహిష్కరణ విధించిన వార్తను వెలుగులోకి తెచ్చిన 'విశాలాంధ్ర'కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బహిష్కరణకు వ్యతిరేకంగా రజకులు ఉద్యమించిన తీరు ప్రశంసనీయమని, ఇది రజకుల్లో ఐక్యమత్యానికి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు