ఎసిబి ఎటాక్‌!

Fri, 27 Jan 2012, IST    vv
మద్యం సిండికేట్లపై మరోసారి ఎసిబి దాడులు
అబ్కారీ వ్యాపారులు, ఎక్సైజ్‌ అధికారుల విచారణ
కీలక పత్రాలు స్వాధీనం

హైదరాబాద్‌ (వి.వి.) : మద్యం సిండికేట్లపై అవి నీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి దాడు లకు దిగారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో శుక్ర వారం ఉదయం మొదలైన ఈ దాడులు సాయం త్రం వరకు కొనసాగాయి. మద్యం వ్యాపారులతో పాటు ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లు, కార్యాలయాల లోనూ ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి అక్రమాలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిని అదు పులోకి తీసుకుని విచారిస్తున్నారు. నెల రోజుల క్రితం జరిగిన దాడుల సందర్భంగా వెలుగు చూసిన పత్రాల నేపథ్యంలోనే రెండవ దఫా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో మద్యం మాఫియాపై ఎసిబి కొరడా ఝళిపించ సాగింది. గత డిసెంబర్‌లో కరీంనగర్‌లో బట్టబయలైన మద్యం సిండికేట్‌ వ్యవ హారంపై లోతుగా ఆరా తీసిన ఎసిబి అధికారులు ఇతర జిల్లాలలోనూ సిండికేట్ల లావాదేవీలు వున్నా యని నిర్దారణకు వచ్చి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో మద్యం వ్యాపారుల అక్ర మాలతో పాటు అధిక ధరలకు మద్యం విక్రయిం చడం, పొరుగు రాష్ట్రాల నుంచి నాన్‌ డ్యూటీ లిక్కర్‌ను అక్రమంగా తరలించి అమ్మడం, మిల టరీ మద్యాన్ని విక్రయించడం వంటి విషయాలు వెలుగు చూశాయి. అప్పటి దాడుల సందర్భంగా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడగా భారీగా అవ కతవకలు బట్టబయలయ్యాయి. ఈ అక్రమాలపై చర్యలు తీసుకున్న ఎసిబి అధికారులు పలువురు అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు మొత్తం వ్యవహారంపై కోర్టుకు నివేదించారు. కాగా అప్పట్లో వెల్లడైన విషయాల ఆధారంగా శుక్రవారం ఎసిబి అధికారులు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా దాడులకు దిగారు. రాజధాని హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ పట్నం, శ్రీకాకుళం జిల్లాలలో ఈ దాడులు జరి గాయి. తొలుత ప్రకాశం, గుంటూరు జిల్లాలలో మొదలైన దాడులు అనంతరం ఇతర జిల్లాల్లోనూ కొనసాగడంతో మద్యం వ్యాపారులతో పాటు అబ్కారీ అధికారులు సైతం హడలెత్తి పోయారు. మొదట ఈ దాడులు కేవలం అబ్కారీ అధికారులపై దాడులుగా ప్రచారం జరిగినా ఇది నిజం కాదని కొద్దిసేపట్లోనే తేలిపోయింది. మద్యం సిండికేట్లు నిర్వహిస్తున్న వారితో పాటు వారికి బాసటగా నిలుస్తున్న అధికారుల ఇళ్లు, కార్యాలయాలపై ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వ హించి కీలక పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. తాజా దాడుల్లో మద్యం వ్యాపా రులకు ఎక్సైజ్‌ అధికారులు వడ్డీలకు డబ్బులు అప్పుగా ఇస్తున్నట్లు తేలింది. మద్యం వ్యాపారులు తమ అవసరాల కోసం అబ్కారీ అధికారుల నుంచి కోట్లాది రూపాయలను రూపాయి నుంచి మూడు రూపాయల వడ్డీకి అప్పు తీసుకుని మద్యం సీజన్‌ ముగిసిన తరువాత తిరిగి

చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారని ఎసిబి అధికారులు తేల్చారు. వైజాగ్‌, నెల్లూరు, ఉభయ గోదావరి, వరంగల్‌, శ్రీకాకుళం జిల్లాలలో అబ్కారీ అధికారులతో పాటు పలువురు మద్యం వ్యాపారులను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దాడులు రెండు మూడు రోజుల పాటు కొనసాగే వీలుందని తెలుస్తోంది. ఈ దాడులపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, తప్పు చేసిన వారు ఎవరైనా సరే తప్పించుకోలేరని అన్నారు.

22 చోట్ల దాడులు : ఎసిబి డిజి వెల్లడి

ఇదిలా వుండగా మద్యం సిండికేట్లపై జరిగిన దాడులపై ఎసిబి డిజి భూపతి బాబు ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 22 చోట్ల దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడుల్లో అనేక అక్రమాలు వెలుగు చూశాయని ఆయన తెలిపారు. నాన్‌ డ్యూటీ లిక్కర్‌ విక్రయాలు జరుగుతున్నట్లు తేలిందని, అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు నిర్దారణ అయిందని, ఈ సందర్భంగా కొందరికి భారీగా ముడుపులు అందినట్లు వెల్లడయిందని ఆయన తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళంలో ముమ్మర సోదాలు

హైకోర్టు హెచ్చరికలను సైతం ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. మద్యం సిండికేట్లకు సహకరించవద్దని హైకోర్టు ఆదేశించినా ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారు. హైకోర్టు ఆదేశాలతో శక్రవారం రాష్ట్రవాప్తంగా సిండికేట్‌ నిర్వాహకుల ఇళ్లపై, కార్యాలయాలపై, వారికి సహకరిస్తున్న ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లపై ఎసిబి దాడులు నిర్వహించింది. ఇటీవల కొద్ది రోజుల క్రితం సిండికేట్‌ కార్యాలయాలపై దాడులు చేసి, కీలకమైన సమాచారాన్ని సేకరించిన ఎసిబి అధికారులు నెలరోజులపాటు కసరత్తు చేసి, ఓ నివేదికను కోర్టుకు సమర్పించారు. దీంతో, శ్రీకాకుళం జిల్లాలో ముమ్మరంగా దాడులు నిర్వహించారు. పట్టణంలోని హౌసింగ్‌బోర్టు కాలనీలో నివసిస్తున్న ఎక్సైజ్‌ శాఖ శ్రీకాకుళం సర్కిల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మెండ అప్పన్న ఇంటిపై ఎసిబి దాడులు నిర్వహించింది. సిండికేట్లతో లింకులు ఉన్న అధికారులు, సిబ్బంది నెలవారీ మామూళ్ల వసూళ్లు వ్యవహారంపై దాడులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్‌ అధికారులకు అక్రమంగా చేరుతున్న డబ్బు ఇతర లావాదేవీలతో పాటు, ఈ తనిఖీల్లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తిస్తున్నామని, వారిపై కేసులు పెడతామని ఎసిబి అధికార్లు చెబుతున్నారు. శ్రీకాకుళం ఎక్సైజ్‌ సి.ఐగా పనిచేస్తున్న రామకృష్ణ ఇంటిపై దాడి చేయాలని తలంచి, ఆయన ఇంటికి వెళ్లే సరికి తాళం వేసి ఉండడంతో అధికారులు వెనుదిరిగారు. విశాఖలో ఉన్న ఆయనను ఎసిబి అధికారుల బృందం విచారణ చేస్తున్నది. నర్సన్నపేట ఇందిరానగర్‌ కాలనీలో నివసిస్తున్న మద్యం సిండికేట్‌లో ప్రధాన వ్యక్తి ఓరుగంటి ఈశ్వరరావు ఇంటిపై రాజమండ్రి ఎసిబి డిఎస్పీ టి.నాగేశ్వరరావు, శ్రీకాకుళం సి.ఐ నర్సింగరావు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంటిలో ఉన్న పలు రికార్డులు, నగదు వివరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. కంప్యూటర్‌లో వివరాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిపిన దాడులకు కొనసాగింపుగానే ఉత్తరాంధ్రలో 8చోట్ల ఎక్సైజ్‌ అధికారులు సిండికేట్ల ఇళ్లపై దాడులు చేపట్టినట్లు వారు విలేకర్లతో చెప్పారు. వివరాలు పూర్తిస్థాయిలో స్వీకరించిన తరువాత హైకోర్టుకు నివేదిస్తామని వారు తెలిపారు. ఎక్సైజ్‌ అధికారులు సిండికేట్ల మధ్య ఉన్న సత్సంబంధాలు ఇప్పటికే బహిర్గతమయ్యాయని వారన్నారు. ఈ దాడులతో సిండికేట్‌ సభ్యులు, ఎక్సైజ్‌ అధికారులు, వారి సిబ్బంది ఏ సమయాన ఏమి జరుగుతుందో, ఎవరి ఇళ్లపైన దాడులు జరుగుతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు