న్యూఢిల్లీ : చక్కెర రంగంలో నియంత్రణ ఎత్తివేతకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ శుక్రవారం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి తన ఆర్థిక సలహా మండలి చైర్మన్ సి.రంగరాజన్ నేతృత్వం వహిస్తారు. జనవరి ఆరంభంలో చక్కెర పరిశ్రమ సంస్థలు ఇస్మా, ఎన్‌ఎఫ్‌సిఎస్‌ఎఫ్ ప్రతినిధులు కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. బహిరంగ మార్కెట్‌లో చక్కెరను స్వేచ్ఛగా విక్రయించుకోవడంతో పాటు చక్కెర రంగంలో పాక్షిక నియంత్రణకు అంగీకరించాలని ప్రణబ్‌ను కోరారు. అలాగే, ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి లెవీ ఇబ్బందులను కూడా తొలగించాలని విన్న వించారు. 'చక్కెర రంగంలో నియంత్రణ ఎత్తివేతకు సంబంధించిన అన్ని అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రి యను పూర్తి చేసి, ప్రధాన మంత్రికి సిఫా ర్సులు అందజే యాలని కమిటీకి విజ్ఞప్తి చేశాం' అని ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది.
ఆర్థికమంత్రిత్వశాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్‌బసుతో పాటు ఆహార, వ్యవసాయ, ఆర్థిక శాఖల కార్యదర్శులు కమిటీలో సభ్యులుగా వుంటారు. కమిటీలో ఇతర సభ్యులుగా సిఎసిపి చైర్మన్ అశోక్ గులాటీ, వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి నంద్‌కుమార్, ఇఎసి కన్వీనర్ కె.పి.కృష్ణన్ కూడా సభ్యులుగా వున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా నిపుణులు, విద్యావేత్తలను కూడా కమిటీలో చేరుస్తారని ప్రకటన తెలిపింది. విధులు సక్రమంగా నిర్వహించేందుకు ఆహారమంత్రిత్వశాఖ ఈ కమిటీకి అవసరమైన మద్దతు, సహాయ, సహకారాలు అందిస్తుందని ఆ ప్రకటన వెల్లడించింది. నివేదిక సమర్పించడానికి కమిటీకి ఎలాంటి గడువు విధించలేదు. చక్కెర పరిశ్రమ ప్రభుత్వ నియంత్రణలోనే పనిచేస్తున్నది. చక్కెర ఉత్పత్తి నుండి పంపిణీ వరకు ప్రభుత్వమే అన్నీ చూసుకుంటుంది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
