హైదరాబాద్ (వి.వి) : శాసనసభ సమావేశంలో తెలంగాణ తీర్మానం చేయాలంటూ ఆరోరోజూ పోడియం వద్దకు వచ్చి సభను (రెండోసారి) అడ్డుకోవ డంతో టిఆర్‌ఎస్ సభ్యులను స్పీకర్ ఎన్.మనోహర్ రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు. సభ బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వెంటనే తెలంగాణపై తీర్మానం చేయాలంటూ టిఆర్‌ఎస్ సభ్యులు పోడియంను చుట్టుముట్టడంతో స్పీకర్ సభను 9.12 గంటలకు అరగంట పాటు వాయిదా వేశారు. అనంతరం 11.30 గంటలకు సభ తిరిగి సమావేశమవగా అదే తీరు నెలకొంది. తెలంగాణ తీర్మానం చేయాలని, విద్యార్థులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని టిఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ పట్టు బిగించారు. మధ్యలో మంత్రి ధర్మాన ప్రసాద రావు కల్పించుకుని సభ సజావుగా నడిచేందుకు సభ్యులు సహకరించాలని పలుసార్లు కోరారు. అలా సహకరించని సభ్యులను సభ నుండి రెండురోజుల పాటు సస్పెండ్ చేయాలని మంత్రి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి అభ్యంతరం తెలిపిన టిఆర్‌ఎస్ సభ్యులు సస్పెండ్ చేసే ముందు సభలో ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓటింగ్ తంతు ముగించిన స్పీకర్ 11మంది టిఆర్‌ఎస్ సభ్యులను రెండురోజుల పాటు సస్పెండ్ చేసి సభ నుంచి నిష్క్రమించాలని సూచించారు. అయినా వారు పోడియం నుండి కదలకపోవడంతో మార్షల్స్ వారిని బయటకు పంపించారు. సస్పెండ్ అయిన వారిలో ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు, కె.తారకరామా రావు, ఇ.రవీందర్‌రెడ్డి, కె.విద్యా సాగర్‌రావు, శ్రీనివాసరావు, సోమారపు సత్య నారాయణ తదితరులు ఉన్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు అనుమతిస్తూ సభ సాయంత్రం నాలుగు గంటల వరకు నడుస్తుందని స్పీకర్ ప్రకటించారు. దీనికై కాంగ్రెస్‌కు 2.15గంటలు, టిడిపి 1.30 గంటలు, టిఆర్‌ఎస్, ఎంఐఎంలకు 25 నిమిషాలు, సిపిఐ, లోక్‌సత్తాలకు 15 నిమిషాలు, సిపిఎం, బిజెపిలకు 10 నిమిషాలు, ఇండిపెండెంట్లకు 5 నిమిషాలు చొప్పున మాట్లాడేందుకు స్పీకర్ సమయం కేటాయించారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
