లెతెహర్ : జార్ఖండ్ లెతెహర్ జిల్లాలోని కర్మిది వద్ద మావోయిస్టులకు-భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావో యిస్టులు, మరణించగా, ఇద్దరు జవాన్లు గాయ పడినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు ముగి సిన అనంతరం మావోయిస్టులు ఆరుగురు తమ సహచరుల శవాలను మోసుకు వెళ్ళడం తమ జవాన్లు చూశారని జోనల్ ఐజిపి దీపక్ వర్మ పిటిఐతో చెప్పారు. ఆరుగురు మావోయిస్టులు మరణించిన విషయాన్ని నిఘా వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే వారి శవాలు మాత్రం ఇంకా లభించలేదని అధికారులు చెపుతున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ ఎదురు కాల్పులు కొన్ని గంటలపాటు సాగినట్లు అధికారులు తెలిపారు.
చత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌లో జవాన్ మృతి
రారుపూర్ : చత్తీస్‌ఘడ్‌లోని సుక్‌మా జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పులలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్.టి.ఎఫ్.)కు చెందిన జవాన్ ఒకరు మృతిచెందారని పోలీసులు తెలిపారు. గడిరాస్ స్టేషన్ పరిథి లోని గంధార్‌పాడ గ్రామం సమీపంలో గురువారం తెల్ల వారుఝామున జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో కనీసం ఐదు గురు గెరిల్లాలు మరణించి వుంటారని అనుమానిస్తున్నట్లు సుక్‌మా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ శాండిల్యా పి.టి.ఐ. వార్తా సంస్థకు తెలిపారు.
గంధార్‌పాడ అటవీ ప్రాంతాన్ని ఎస్‌టిఎఫ్ సిబ్బంది ముట్టడించటంతో వారిపై నక్సలైట్లు కాల్పులు ప్రారంభిం చారని, ఈ కాల్పులలో ఎస్.టి.ఎఫ్. జవాన్ ఆదేష్‌పాల్‌కు చాతిలో తూటా తగిలినట్లు ఆయన చెప్పారు. ఘటనా స్థలం నుండి మావోయిస్టులు పరారయ్యే వరకు దాదాపు నాలుగు గంటలపాటు ఈ కాల్పులు జరిగాయన్నారు.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో రక్తపు మరకలను కనుగొన్నామని, దీనిని బట్టి కనీసం ఐదుగురు నక్సలైట్లు ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెంది వుండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఘటనా స్థలం నుండి ఏ ఒక్కరి మృతదేహాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోలేదని ఎస్.పి. చెప్పారు. నక్సలైట్ల ఆచూకి తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టేందుకు అదనపు బలగాలను పంపినట్లు తెలిపారు.
''ఎస్.టి.ఎఫ్ జవాన్ మృతదేహాన్ని సుక్‌మాకు తరలించారు'' అని శాండిల్యా చెప్పారు.
భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులుమృతి
షిల్లాంగ్ : మేఘాలయలోని తూర్పు గారో హిల్స్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఒక రహస్య స్థావరంపై భద్రతా దళాలు జరిపిన కాల్పులో గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ (జిఎన్‌ఎల్‌ఎ)కి చెందిన ముగ్గురు తీవ్రవాదులతో పాటు, ఒక యువకుడు మరణించారు. ముందుగా అందిన సమాచారం మేరకు మాంగ్‌పాంగ్రో హిల్స్‌కు వెళ్ళిన భద్రతా దళాలపై ఉగ్రవాదులున్న ప్రాంతం నుంచి భారీ కాల్పులు జరిగాయని తూర్పు గారో హిల్స్ డిప్యూటీ కమిషనర్ విజరు మంత్రి 'పిటిఐ'కి తెలిపారు. వారి చర్యకు ప్రతిగా భద్రతా దళాలు కూడా జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు సహా నలుగురు చనిపోగా, కొంతమంది ఉగ్రవాదులు చీకటిలో పారిపోయారు.తర్వాత భద్రతా దళాలు ఒక ఎకె-47 రైఫిల్, కొన్ని రౌండ్ల మందుగుండు సామాగ్రిని సంఘటనా స్థలం వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.ఏప్రిల్ 7న ఉల్ఫా ఆవిర్భావ దినోత్సవం జరగడానికి రెండు రోజుల ముందు ఈ సంఘటన జరిగింది.
కాల్పుల్లో మరణించిన జిఎన్‌ఎల్‌ఎలోని చర్చలకు వ్యతిరేక వర్గానికి చెందిన వీరు మేఘాలయలోని మూడు గారో హిల్స్ జిల్లాల్లో హత్యలు, బలవంతపు వసూళ్ళు, అపహరణ నేరాల్లో పాల్గొన్నారు. కాగా, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా అస్సాం- మేఘాలయ సరిహద్దు మార్గంలో భద్రతా దళాలను నియమించి అప్రమత్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
