దారాసింగ్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో బిజెపి ఎమ్మెల్యే అరెస్ట్‌

Thu, 5 Apr 2012, IST    vv

జైపూర్‌ : దారా సింగ్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో బిజెపి ఎమ్మెల్యే రాజేంద్ర రాథోడ్‌ను గురు వారం సిబిఐ అదుపులోకి తీసుకున్నది. ప్రస్తుతం రాథోడ్‌ తారానగర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నివాసంలోనే ఉదయం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్యేని ఇంకా కోర్టులో హాజరుపరచవలసి వున్నది. ఈ కేసులో మరో నిందితుడు పోలీసు ఎడిజి ఎ.కె. జైన్‌ ఇప్ప టికే ఇక్కడి ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. దారాసింగ్‌ 2006లో ఎన్‌కౌంటర్‌ చేయబడలేదని, ఎస్‌ఒజి దళం చేతిలో హత్య చేయబడ్డారని, ఈ హత్య పోలీసు ఎడిజి ఎ.కె.జైన్‌, ఎస్‌ఒజి ఎ పొన్ను చమ్మీ, అదనపు ఎస్‌పి ఆర్షాద్‌ అలీతో పాటు ఇతర అధికారుల పర్యవేక్షణలో జరిగిందని, ఈ హత్య జరుగుతున్నంత సేపు జైన్‌తో ఎమ్మెల్యే రాథోర్‌ ఫోన్‌లో సంప్రదిస్తునే వున్నారని లభ్యమైన సాక్ష్యా లను బట్టి తెలుస్తోందని దాఖలు చేసిన చార్జ్‌ షీట్‌లో సిబిఐ ఆరోపించింది. ఈ కేసుకు సంబం ధించి గత ఏడాది జూన్‌లోనే సిబిఐ చార్జ్‌ షీట్‌ను దాఖలు చేసింది. దారా సింగ్‌ను జైపూర్‌ ఎయిర్‌ పోర్టు నుంచి అక్రమంగా ఎస్‌ఒజి అధికా రులు కస్టడీకి తీసుకున్నారని, అనంతరం ఎవ్వరూ సంచరించని అంబేర్‌కు సమీపంలోని ప్రాంతానికి దారా సింగ్‌ను తీసుకొని వెళ్ళి పథకం ప్రకారం 2006, అక్టోబర్‌, 23న హత్య చేసినట్లు సిబిఐ ఆరోపించింది. కాగా అరెస్ట్‌కు ముందుగా రాథోర్‌ బిజెపి కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తనపై తప్పడు కేసు పెట్టిందని విమర్శించారు. అంతేకాక వార్తా పత్రికల్లో వార్త వచ్చే వరకు ఆ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని పేర్కొన్నాడు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు