హైదరాబాద్ (వి.వి) : 'ఫీజు రీ-యింబర్స్‌మెంట్' వ్యవహారం ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పోరాట కార్యక్రమాలతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ముప్పేట దాడులు చేస్తున్నాయి. దాంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. రోజురోజుకు ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రదర్శనలు, ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ ప్రధాన అంశంపై ప్రభుత్వం నిస్సహాయంగా చోద్యం చూస్తుండడాన్ని విపక్షాలతోపాటు అధికార పక్షం కూడా విమర్శిస్తోంది. ఫీజు రీయిబర్స్‌మెంట్ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని అన్నివర్గాల ప్రజానీకం తీవ్రంగా తప్పుబడుతోంది. విద్యార్థి సంఘాలు పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. కొందరు మంత్రులు సైతం మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలను విమర్శిస్తున్నారు. రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిగా కొనసాగించాలని, అన్నివర్గాల విద్యార్థులకు దీనిని వర్తింపజేయాలని, పూర్తిగా ప్రభుత్వమే ఫీజుల మొత్తాన్ని భరించాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే పూర్తిగా ఫీజులను రీయింబర్స్ చేయడాన్ని ఉపసంఘం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి పునరాలోచించాలంటూ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బీసీలు కాంగ్రెస్‌కు దూరమవుతున్న తరుణంలో బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగేలా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం తగదని వారు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని కలుసుకొని సమస్యలను వివరించాలని బీసీ మంత్రులు నిర్ణయించారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఇంజనీరింగ్, వృత్తివిద్యా కళాశాలల్లో ఫీజులను పెంచే విషయంపై ఫీజుల నియంత్రణ మండలి త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఫీజులు పెరగనున్నాయి. అయితే ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి కన్వీనర్ కోటా కింద ప్రస్తుతం ఉన్న రూ.31వేల ఫీజును మాత్రమే ప్రభుత్వం భరించాలని మంత్రిమండలి ఉపసంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. మిగిలిన మొత్తాన్ని ఆయా విద్యార్థులే భరించాల్సి ఉంటుంది. వ్యత్యాస మొత్తానికి విద్యార్థులకు బ్యాంకుల ద్వారా రుణాలిప్పిస్తామని సాంఘీక సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్న విషయం విధితమే. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే ఫీజులు ఎంతమేరకు పెరిగితే ఆ మొత్తాన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరించనున్నాయి. బీసీ, ఈబీసీలాంటి బడుగు వర్గాల విద్యార్థులపై ఫీజు పిడుగు పడనుంది.
విద్యార్థి దశలోనే అప్పులా?
ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై నారాయణ
హైదరాబాద్ : వెనుకబడిన, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఫీజు రీయింబర్స్‌మెంటు రూపంలో కేవలం రు. 31 వేలు మాత్రమే చెల్లిస్తామని, మిగతా రు. 20 వేలు విద్యార్థులే చెల్లించుకోవాలని రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రకటనను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ వ్యతిరేకించారు. ఈ ఏకపక్ష నిర్ణయాన్ని ఆయన ఖండించారు. ఫీజు రీయింబర్స్‌మెంటుపై ఎన్నికల్లో వాగ్ధానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి దీనిని వెనక్కి తీసుకునే రాజకీయ హక్కు లేదన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 15 లక్షల మంది వెనుకబడిన వర్గాల విద్యార్థులపై భారం పడనున్నదని పేర్కొన్న నారాయణ ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నత ధర్మాసనం తీర్పును గౌరవించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. మీ విధానాలతో విద్యార్థి దశ నుండే అప్పుల ఊబిలోకి దింపుతారా అని నిలదీశారు. కళాశాలల్లో సౌకర్యాల తనిఖీని నిర్వహించాలని విద్యార్థి వర్గాలు ఎన్నో ఏళ్ళుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పటికైనా ఏదోరకంగా దీనిపై దృష్టిపెట్టడంపై సిపిఐ హర్షం వ్యక్తం చేస్తున్నదని నారాయణ అన్నారు. ఈ తనిఖీల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సెమిస్టర్‌లో సగం సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కావాలని, 75% హాజరు ఉన్న వారికే ఫీజు రీయింబర్స్‌మెంటు చేస్తామని మెలికపెట్టడమంటే విద్యార్థులకు రీయింబర్స్‌మెంటు ఎగగొట్టడానికే అని అర్థం చేసుకోవాల్సి వస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఇంగ్లీషు మీడియం చదివే విద్యార్థులకు అనేక ఇబ్బందులుంటాయని, కాబట్టి ఈ షరతు రెండవ సంవత్సరం నుండి ఉపయోగించుకోవచ్చునని నారాయణ సూచించారు. అధిక సౌకర్యాలు కల్పించామని చెబుతున్న 133 కాలేజీలకు 30% నుండి 150% వరకు ఫీజులు పెంచుకోవడానికి సుప్రీంకోర్టు అవకాశమివ్వడాన్ని నారాయణ తప్పుపట్టారు. దీనిమీద ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. విద్యార్థులు అకడమిక్ సంవత్సరం నష్టపోకుండా వెంటనే కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని నారాయణ డిమాండ్ చేశారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
