పాలకవర్గాల ఆలోచన ఆహారభద్రతకు చేటు

Thu, 5 Apr 2012, IST    vv

పి.జనార్దనరావు

భారత ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న సమస్య ఏమిటి? గత రెండు దశాబ్దాలనుండి ఆచరణలో పెట్టిన నయా ఉదారవాదం వృద్దిసాధించడంలో పక్కదారులు పట్టించబడిన చట్టాలు. పాలక వర్గాలు ఆచరణ అత్యధిక ప్రజా నీకం కొరకు కాక కొద్ది శాతం సంపదపోగుచేయుటకు తోడ్పడుట, పారదర్శకత లోపిం చిన పాలన ఏ స్థాయి పాలనలోనైనా ఎవరు ఎవరికీి జవాబు చెప్పవలసిన అవసరం కల్పించకపోవడం, సమర్దవంతమైన జవాబు దారీతనంతో కూడిన పాలనకు పునాదులు వేయుటలో విఫలమైనందువల్ల అవినీతి విస్తృతమైంది. దేశమూలాల్లోకి విస్తరించింది. ఆర్థిక కేంద్రీకరణకు అవకాశాలు కల్పించుటవల్ల నేడు అక్రమంగా సంపద గడించినవారు చట్ట సభల్లోనూ పార్లమెంటులోనూ ఎన్నికల ద్వారా ప్రవేశించగలిగారు. వారు తమ ప్రయోజనాలు నెరవేర్చుకొనుటకు కృషి చేస్తున్నందువల్ల ఆరున్నర దశాబ్దాల తర్వాత కూడ స్వాతంత్య్ర సాధన నాడు దేశం ఎదుర్కొన్న సమస్యలైన పేదరికం, మాల్‌ న్యూట్రిషన్‌ నిరక్షరాస్యత కొనసాగుచు న్నవి. చట్టాలను చుట్టాలుగా చేసుకొని దేశ వనరులను నిస్సిగ్గుగా కొల్లగొట్టుచున్నారు. సాధించిన అభివృద్ధి వల్ల పెరిగిన సంపద ప్రజా సంక్షేమం కొరకు వినియోగించ లేదు. విద్యాభివృద్ధికి, ఆరోగ్య రక్షణ పెంపొందించుటకు వినియోగించలేదు. త్రాగునీటి వసతి కల్పించే కృషి లేదు. పరిశ్రమలు స్థాపించి, విద్యుదుత్పత్తి పెంచి ఉపాధి అవకా శాలు పెంచలేదు. పలు రకాల వ్యాధులు విస్తరించుటకు కారణమైన పారిశుధ్య సౌకర్యాలు పెంచలేదు.

పాలకవర్గాలు ఆచరణలో పెట్టిన నయాఉదారవాద ఆర్ధిక విధానాలచే సృష్టించబడి ప్రోత్సహించడుతున్న అంశాలు అసమానతలు, 'అన్యాయం నిరాకరణ' కొన సాగుట, సామాజిక, ఆర్థిక అసమానతలు అనారోగ్య పరిస్థితులు కొనసాగుటకు, మరణాలకు ప్రధాన కారణం. పెట్టుబడి దారీ ఆర్థిక విధానం పెరుగుటకు తోడ్పడింది. ఆర్థిక సరళీకరణవల్ల ఎంతో కొంత పెట్టుబడి (ఆర్థిక, సామాజిక మరియు మేధోపరమైన) కల్గిన వారు లాభిం చారు. అత్యధికులు నష్టపోయారు. భారతదేశం సాధించిన ఆధునికీకరణ గ్లోబల్‌ పెట్టుబడివల్ల సాధ్యమైంది. నూతన సంపన్నవర్గాలు, నూతన జీవన విధానం అభివృద్ధి జరిగింది. నగరాల్లో కార్పోరేట్‌ పాఠశాలలు, వైద్యాల యాలు, షాపింగ్‌మాల్స్‌ వచ్చినవి. 1991 తర్వాత 10 సంవత్సరాలు గడిచినాక మిలియన్‌ కంటే అధికంగా సంపాదించేవారు 2,68000 నుండి 807000కి పెరి గారు. అట్లాగే ప్రభుత్వం అందించిన తోడ్పాటువల్ల బిలి యనీర్లు, మిలియనీర్లు పెరిగారు. అసమానతలు పెరుగుటకు కారణం - గృహస్తుల ఆదాయం, భూవసతి, వ్యవసాయం ద్వారా సంపాదించు ఆదాయం, విద్య పొందు అవకాశాలు, ఆరోగ్య రక్షణకు తీసుకొను చర్యలు- పేదరికం కారణాలు విశ్లేషించబడాలి. ఉపాధివల్ల ఆదాయం, కొనుగోలు శక్తి, వినిమయం వస్తాయి. విద్య నేర్వక, నైపుణ్యంలేక ఉపాధి అవకాశాలుండవు. తక్కువ ఆదాయ మందించు వృత్తులందుంటారు. ఎదుగు బొదుగు లేని జీవితం తర్వాత తరాలకు అదే జీవితం కొనసాగు తుంది. అత్యధిక శాతం ప్రజలకు భూమిలేదు. కూలీలుగా జీవితం- పేదరికం, మాల్‌ న్యూట్రిషన్‌ వారి పాలిట శాపంగా కొనసాగుతున్నది. మరో ముఖ్యమైన విచక్షణ విద్యలో కొనసాగుతున్నది. విద్యలో ప్రవేశం అందుబాటు- నాణ్యత లోపించిన విద్య-సామాజిక, ఆర్థిక పరిస్థితులవల్ల విద్యనుండి విరమించుట, నేటికీ అనేక వర్గాల పిల్లలకు- కులం, జాతి, మతం, లింగం కల్పించు అవరోధములవల్ల విద్య అందుబాటులో లేదు. ఏ వర్గాలు విచక్షణకు గుర య్యారు షెడ్యూల్డు కులాలు, గిరిజనులు ఆదివాసీలు, వెనుకబడ్డ కులముల వారు, ముస్లింలు ప్రత్యేకించి బాలి కలు. ఆరున్నర దశాబ్దాల తర్వాత కూడా అత్యధికంగా నిరక్షరాస్యులున్న దేశంగా గుర్తించబడింది. అనేక రంగాల్లో గణనీయ వృద్ధి సాధించినట్లు చెప్పుకొంటున్న స్థితిలో 1947 నుండి 2012 సంవత్సరం నాటికి సంవత్స రానికి ఒక్కశాతం కూడా విద్యలో అభివృద్ధి సాధించలేదు. మానవాభివృద్ధి నివేదిక యు.ఎన్‌.డి.పి.లో 182 దేశాల్లో 134వ స్థానంలో వుంది.

ప్రణాళికా సంఘ ప్రభుద్దులు మరోసారి పేదరికం తగ్గినట్లు ప్రచారం మొదలుపెట్టారు. ఆహారభద్రత కల్పించ చేసిన వాగ్దానం దాటవేయుటకు ప్రభుత్వస్థాయిలో తీవ్ర ప్రయత్నం జరుగుతున్నట్లు అర్థం చేసుకోవలసి వుంది. సబ్సిడీ భారం పెరుగుతోందని, ధాన్య సేకరణ 6కోట్ల మెట్రిక్‌ టన్నులు సాధ్యంకాదని, నిల్వకు గోదాములు లేవని ఆహార వ్యవసాయ శాఖామంత్రి శరద్‌పవార్‌తో సహా ప్రకటించుట అందులో భాగం. తాజాగా జైరాం రమేష్‌ గొంతు కలిపాడు. ఇంతకుముందు సుప్రీంకోర్టు మందలింపుకు గురైన ఆహ్లువాలియా మరల అదేపాట పాడాడు. పేదరికం నిజంగా తగ్గిందా? అనేక కమిటీలు ఇంతకుముందు అత్యధిక శాతం ప్రజలు కనీస జీవితా వసరాలు తీరక వున్నట్లు, ఆదాయం తక్కువ వున్నట్లు, స్థిరమైన హామీగల ఉపాధి లేనట్లు వెల్లడించుట జరిగింది.

1) అర్జున్‌ కె.సేన్‌గుప్తా కమిటీ 9 నివేదికలిచ్చింది. 836 మిలియన్లు (77%) రోజుకు రు.20తో జీవిస్తున్నట్లు తెల్పింది.

2) 800 మిలియన్‌ ప్రజలు రోజుకు రు.20కంటే తక్కువతో గడుపుచున్నారు-మాజీ కేంద్రమంత్రి, జె Ê కె మాజీ గవర్నర్‌ జగ్‌మోహన్‌.

3) 300 మిలియన్లు ఆకలితో నిద్రకుపక్రమిస్తున్నారు- ఎ.పి.జె.కలాం మాజీ భారత అధ్యక్షుడు.

4) టెండూల్కర్‌ 1800 కెలరీల శక్తినిచ్చు ఆహారం లెక్కించి ఇచ్చిన అంచనా ఆమోదం పొందలేదు.

5) కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఏర్పడిన సలహామండలి గ్రామీణ ప్రాంతాల్లో 90శాతం, అర్బన్‌లో 50శాతం ప్రజలు ఆహారభద్రత పథకంలో చేర్చబడాలి అంది. ప్రభుత్వం అంగీకరించింది గదా! ఇవిగాక ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్‌. అంచనాలు కూడా ఎక్కువ పేదలున్నట్లు తెలిపాయి.

ఈ మధ్య హంగామా సంస్థ భారత పిల్లల్లో ఐదేండ్ల లోపు వారు ఐదవవంతు పోషకాహారం పొందుట లేదని తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా మాల్‌నరిష్‌డు పిల్లలు భారత్‌లో వున్నారని తెల్పింది. ఎవరి తల్లులు నిరక్షరాస్యులో వారి పిల్లలు ఐదురెట్లు అండర్‌ నరిష్‌డు. అభివృద్ధిపై మాల్‌నరిష్‌మెంటు ప్రభావం గురించి చైతన్యం లేకపోవడం సమస్య. బరువు తక్కువ బిడ్డలకు జన్మనిచ్చుటకు కారణం తల్లులు పోషణనిచ్చు ఆహారం పొందకపోవడం. పిల్లల్లో మొదటి ఐదు సంవత్సరాల్లోనే గరిష్టంగా మెదడు అభివృద్ధి జరుగుతుంది.

6) ఆరోగ్య రక్షణ ఖర్చులు భరించ లేక ప్రతి సంవత్సరం 39 మిలియన్‌ ప్రజలను తీవ్రమైన పేదరికంలోకి నెట్టుచున్నది. కె.శ్రీనాధరెడ్డి, కార్డియాలజిస్టు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా. ఆహార ద్రవ్యోల్బణం, సాధారణ ద్రవ్యోల్బణం గత రెండు సంవత్సరాల నుండి అధికంగా వుంది. ద్రవ్యోల్బణం అత్యధిక శాతం ప్రజల కొనుగోలు శక్తిని హరింస్తుంది. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రమైన మాంద్యంలో 2008 నుండి కొట్టు మిట్టాడుతున్నాయి. నేటికీ కోలుకోలేదు. నయా ఉదార వాదం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ గతంలో కంటే ఎక్కువగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో జతపడి వుంది. ఆ దేశాల్లో సంక్షోభం భారత ఎగుమతులను నష్టపెట్టింది. అంతేగాదు, పెట్టుబడులు రాక తగ్గింది. ఉపాధులు నష్టపోయాయి. పారిశ్రామిక దేశాల ద్రవ్య విధానాలు (మానిటరీ పాల సీలు) కమ్మొడిటీల ధరల నిర్ణయంలో ప్రధాన పాత్ర గల్గి భారత ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణం అంచనాలు ద్రవ్య లోటుపైన పడుతుంది. జాతీయ ప్రభుత్వం చేయు విధాన నిర్ణయాలు అంతర్జాతీయ పరిణామాల పైన ఆధారపడి వున్నాయి. అంతేగాని స్వతంత్రించి స్వేచ్ఛగా చేయలేవు. ఉ||కమ్మొడిటీల ధరలు, క్రూడ్‌ ధరలు అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి వున్నాయి. ధరల పెరుగుదలను వాటిని దిగుమతి చేసుకొను దేశాలు అదుపు చేయలేవు. వాటి దిగుమతి ఖర్చు భరించుటకు అదనపు వనరులను భారత్‌లాంటి దేశాలు సమకూర్చు కొనుట మినహా మరోదారి లేదు. కానీ మన నయా ఉదారవాదులు తమ పంధా మార్చుకొని రాజ్యాంగ లక్ష్యాలైన ప్రజాస్వామ్యం, లౌకిక విధానం సోషలిజం లేక సంక్షేమ రాజ్యం కొరకు కృషి చేయ సిద్ధపడుట లేదు. రెండు దశాబ్దాల తర్వాత పరిస్థితి ఏమిటి? క్రోనీ కాపిటలిజం అభివృద్ధయ్యింది. దేశ, విదేశాల నుండి సేకరించిన అప్పు పెరిగింది. వడ్డీ చెల్లింపుల భారం పెరిగింది. ధరలను, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయుటలో విఫలమయ్యారు. సామాజికరంగానికి కేటాయింపులు తగ్గిస్తూ క్రమంగా ఆ రంగంనుండి వైదొలగ ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయరంగాన్ని బ్రష్టు పట్టించారు. నేటికీి 58శాతం ఆధారపడిన రంగమది. మైక్రో, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వృద్ధి సాధించుటకు విదేశీ పెట్టుబడులు ఆశించారు. కానీ అనుకొన్న మేర పెట్టుబడులు, నూతన టెక్నాలజీ రాలేదు. ఉపాధుల నుండి సరళీకరణ చేపట్టి లక్షలాది మందిని బయటికి పంపారు. నేటికీ వ్యయం తగ్గలేదు. ఉపాధుల పెంపుదల చేపట్టలేదు. సమాజంలో అసమానతలు ధనిక, పేద, రూరల్‌ అర్బన్‌ మరియు విద్యావంతులు, విద్యలేని వారి మధ్య తీవ్రంగా పెరుగుట జరిగింది. లోటు బడ్జెట్లు వేస్తూ ప్రభుత్వ వ్యయాన్ని (అన్‌ ప్రొడక్టివ్‌, ఆస్తులు నిర్మించలేని వ్యయం) పెంచి దేశాన్ని రుణ వలయంలోకి దించారు. గ్లోబలైజేషన్‌ ప్రయోజనాలు పొందుటకు మౌలిక సౌకర్యాలు పెంచలేదు. నైపుణ్యం గల మేధావంతులను తయారుచేయు ఉన్నత విద్య రూపొందించలేదు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు