ఆర్థిక ఇబ్బందులను అధిగమించినా పట్టాలపైకెక్కని రోశయ్య ప్రభుత్వం

Fri, 3 Sep 2010, IST    vv
ఏడాది పాలనలో ఆటంకాలెన్నో !

కె.శ్రీనివాస్‌రెడ్డి

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టి సెప్టెంబర్‌ 3 నాటికి సంవత్సర కాలం పూర్తయింది. అత్యంత విషాధకర సంఘటన పూర్వరంగంలో ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన విషయం అందరికీ విదితమే. ఆనాటి నుంచి వరుసగా ఆయనకు అన్నీ ఎదురీతలే. స్వంత మంత్రిమండలి నుంచి వ్యతిరేకత, స్వంత పార్టీ నుంచి వ్యతిరేకత, అనావృష్టి, అతివృష్టి, ప్రకృతి వైపరీత్యాలు, ప్రత్యేక రాష్ట్ర ఆందోళన, సమైక్య రాష్ట్ర ఆందోళనలతో పాటు అస్తవ్యస్థ ఆర్థిక పరిస్థితులు ఆయనకు ఎదురయ్యాయి. వీటన్నింటినీ ఆయన మనోనిబ్బరంతో ఎదురీదుతూ ఉన్నప్పటికీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొంత చక్కదిద్దినా, రాజకీయ పరిస్థితి మాత్రం యధావిధిగానే కొనసాగుతోంది. ఉధృతంగా సాగిన ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్ర ఆందోళనలకు శ్రీకృష్ణ కమిటీ నియామకంతో తాత్కాలిక విరామం ఏర్పడింది. అయితే రాజకీయ పరిస్థితులకు సంబంధించి వై.ఎస్‌. తనయుడు, ఎం.పి. జగన్మోహన్‌రెడ్డి సాగిస్తున్న ''ఓదార్పు యాత్ర'' రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో అంతర్యుద్ధానికి తెర తీసింది. పరిపాలనా వ్యవస్థ మాత్రం ఇంకా పట్టాలపైకి ఎక్కాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడడానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల పెంపుదల, నూతన పథకాలను చేపట్టకుండా డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిమితులతో కొనసాగించడం అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు లేదా నాటి ఆర్థిక మంత్రిగా, నేటి ముఖ్యమంత్రిగా రోశయ్య స్వయంగా చెప్పిన మాటల్లోనే మన రాష్ట్రంలో పన్నుల భారం ఉచ్ఛస్థితికి చేరుకుంది. అధికారం చేపట్టిన 2004 నుంచి 2009 వరకు పన్నుల భారాన్ని ప్రజలపై మోపలేదని చేప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, గడిచిన సంవత్సరం ప్రజలపై పన్నుల భారాన్ని అత్యధికంగానే మోపింది. ఆర్‌టిసి ప్రయాణఛార్జీలను కిలోమీటర్‌కు 8 పైసల నుంచి గరిష్టంగా 25 పైసలకు పెంచింది. వాహనాల జీవితకాలపు పన్నును రోశయ్య ప్రభుత్వం 9 నుంచి 14 శాతం వరకు పెంచింది. ఈ రెండింటి ద్వారానే దాదాపు రూ.1200 కోట్లకు పైగా భారం మోపింది. అలాగే పరిశ్రమలపై, వాణిజ్య సంస్థలపై, విద్యుచ్ఛక్తి టారిఫ్‌ రేట్లను పెంచింది. కొత్తగా సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు పరిశ్రమలు విద్యుత్‌ను వినియోగిస్తే అదనపు ఛార్జీలను విధించింది. విలువ జోడించబడిన పన్ను(వ్యాట్‌) గరిష్ట పరిమితిని 12.5 శాతం నుంచి 14.5 శాతానికి పెంచింది. గతంలో వ్యాట్‌ పరిధిలోకి రాని అనేక వస్తువులను కూడా దీని పరిధిలోకి చేర్చింది. ఫలితంగా అనేక వస్తువుల ధరలు భారీగానే పెరిగాయి. మద్యంను అత్యంత ప్రధాన ఆదాయవనరుగా అబ్కారీ విధానాన్ని ప్రభుత్వం మార్చివేసింది. ఫలితంగా మద్యం షాపుల వేలం, విక్రయాల ద్వారా ఏడాదికి రూ.17వేల కోట్ల వరకు ఆదాయాన్ని మూటగట్టుకుంటున్నది. పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మకపు పన్ను, వ్యాట్‌ రూపంలో అదనపు ఆదాయం సమకూరింది. ప్రజాందోళన ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ ధరలను తగ్గించకపోయినప్పటికీ, ప్రజలకు ఉపశమనం కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అమ్మకపు పన్ను,వ్యాట్‌ను తగ్గించుకోవచ్చని చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించలేదు. పొరుగున ఉన్న రాష్ట్రాలు వ్యాట్‌, అమ్మకపు పన్నును తగ్గించడం ద్వారా కొంత ఉపశమనం కలిగించాయి.

ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అదనంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టే యోచనేదీ లేదన్న ముఖ్యమంత్రి రోశయ్య, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపే తన లక్ష్యమని ప్రకటించారు. అయితే సంక్షేమ కార్యక్రమాల అమలు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలను ప్రతిపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి కూడా ఎదుర్కొంటున్నారు. జలయజ్ఞం, పెన్షన్‌ల మంజూరు, ఇందిరమ్మ గృహాల కేటాయింపు, విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో, నిధుల కేటాయింపు, మంజూరులో జాప్యం జరుగుతుంది. నీటిపారుదల రంగానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.15,000 కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు కేటాయించిన రూ.3,400 కోట్లు, గత ఏడాది చేసిన పనులకు బిల్లుల చెల్లింపులకే చెల్లిపోయిందని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా 2009-10 ఆర్థిక సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 204 లక్షల మెట్రిక్‌ టన్నులు నుంచి 150 లక్షల మెట్రిక్‌ టన్నులకు పడిపోయింది. వ్యవసాయ అభివృద్ధిరేటు తిరోగమనానికి మళ్ళింది. దీనికి పూర్తిగా ప్రభుత్వాన్ని నిందించి ప్రయోజనం లేదన్న మాట కూడా యధార్థమే. రాష్ట్రంలో అనావృష్టిని ఎదుర్కొనేందుకు రూ.9,053 కోట్లు, వరదల వల్ల సంభవించిన నష్టానికి రూ.12,825 కోట్లు కేంద్రప్రభుత్వం నుంచి సహాయం అర్థించినా, ఆశించిన మేరకు రాష్ట్రానికి సహాయం అందలేదనేది వాస్తవం. రాష్ట్రం నుంచి అధికార పార్టీకి 33 మంది లోకసభ సభ్యులు ఉన్నా ప్రయోజనం చేకూరలేదు.

రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన రెండు హామీల్లో ఒకటి వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్‌ సరఫరాను ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచడం కాగా, రెండవది తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉన్న కుటుంబంలో ప్రతి మనిషికి 2 కిలోల బియ్యం చొప్పున అదనంగా ఇవ్వడం. ఎన్నికల్లో నెగ్గగానే ఎల్‌.బి.స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకారసభలో ప్రజల సమక్షంలో ఈ రెంటికీ సంబంధించిన ఫైళ్ళపై ఆయన సంతకాలు కూడా చేశారు. వీటి అమలుపై శాసనసభలో నాటి ముఖ్యమంత్రి గత డిసెంబర్‌లోగానే అమలు చేస్తామని ప్రకటించారు. విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించి నాడు కొంత ఇబ్బందికర పరిస్థితిని రాష్ట్రం ఎదుర్కొన్న మాట వాస్తవమే. అయినప్పటికీ, ఆ తరువాత విటిపిఎస్‌ 500 మెగావాట్ల ఏడవ యూనిట్‌, కెటిపిఎస్‌కు చెందిన 500 మెగావాట్ల యూనిట్‌ ఇప్పటికే అదనంగా ఉత్పత్తిలోకి వచ్చాయి. అయినా ఈ హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు.

అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ముఖ్యమంత్రిగా అధిష్టానం అండతో కొనసాగినప్పటికీ రోశయ్యకు పూర్తి స్వేచ్ఛ లభించిందన్న భావన మాత్రం ప్రజల్లో నెలకొనలేదు. ముఖ్యమంత్రిగా నిలదొక్కుకోవడానికి అండనిస్తున్న అధిష్టానం, మంత్రిమండలి విస్తరణకు మాత్రం అనుమతించకపోవడమనేది కొందరికి బలంగా, మరికొందరికి బలహీనతగా గోచరిస్తున్నది. ఏడాది దాటినా కీలకమైన ఆర్థిక, ఆబ్కారీ, వాణిజ్య, విద్యుత్‌ తదితర శాఖలకు పూర్తి స్థాయి మంత్రులే లేరు. వై.ఎస్‌. దుర్మరణం తరువాత, ఆనాటి పరిస్థితుల్లో రోశయ్యను కాకుండా వేరెవ్వరిని ముఖ్యమంత్రిని చేసినా పరిస్థితి మరింత గందరగోళంగా తయారయ్యేదనండంలో సందేహం లేదు. ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి పదవి రోశయ్యకు ముళ్ళకిరీటంగానే ఉంది. కాంగ్రెస్‌ అంతర్గత పరిస్థితి సద్దుమణగనంత కాలం అధికార యంత్రాంగాన్ని పట్టాలపైకి ఎక్కించడం అత్యంత కష్టసాధ్యమైన పనే. ఈ పరిణామాలు తప్పనిసరిగా ప్రభుత్వంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజలను ఆయోమయానికి గురిచేస్తున్నాయి.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు