ఆజాద్‌ మృతిపై న్యాయ విచారణ

Fri, 3 Sep 2010, IST    vv
అప్పుడే ప్రభుత్వానికి విశ్వసనీయత
రోశయ్యకు లేఖ రాసిన సురవరం సుధాకరరెడ్డి

న్యూఢిల్లీ : మావోయిస్టు నేత ఆజాద్‌ మృతిపై న్యాయ విచారణ జరిపించాల్సిందిగా సిపిఐ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రోశయ్యను కోరారు. ఈ మేరకు ఆయనకు ఒక లేఖ రాశారు. గతంలో ఒకసారి ఆజాద్‌ మృతిపై దర్యాప్తు జరిపించాల్సిందిగా కోరామని, ఈసారి న్యాయ విచారణ కావాలని కోరుతున్నామని సుధాకర రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఆజాద్‌ను చాలా దగ్గరనుండి అంటే 7.5సెంటిమీటర్ల దూరం నుండి కాల్చిచంపినట్లు ఔట్‌లుక్‌ మేగజైన్‌ పేర్కొంది. ఫోరెన్సిక్‌ నివేదికలో ఈ విషయం వెల్లడైందని, ఆ నివేదిక ప్రతి తమ వద్ద వుందని ఆ పత్రిక పేర్కొంది. అదేగనుక నిజమైతే దీన్ని ఎన్‌కౌంటర్‌ అనలేమని సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు. అత్యంత పకడ్బందీగా కుట్ర పన్ని హత్య చేయడంగా వ్యవహరించాలని అన్నారు. ప్రొఫెసర్‌ ఎమిరటస్‌ అమిత్‌ బహదూరి, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, ప్రముఖ పౌర, మానవహక్కుల కార్యకర్తలతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చిన తాత్కాలిక నివేదిక చూస్తే ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ కథనం ఏమాత్రమూ హేతుబద్ధంగా లేదని పేర్కొంది. అందువల్ల దీనిపై న్యాయ విచారణ జరిపించాల్సిందిగా వారు డిమాండ్‌ చేశారు. పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా కోరారు. వారిచ్చిన నివేదిక కూడా చాలా వివరంగా వుందని అన్నారు. పైగా, ఈ నెల 1వ తేదిన ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి చిదంబరం పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, ఆజాద్‌ మృతిపై పౌర హక్కుల సంఘాలు ప్రభృతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. శాసనసభకు దీనిపై నిర్ణయం తీసుకునే హక్కు వుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక కావాలని మేం కూడా కోరామని చెప్పారు. అంటే బంతి ఇప్పుడు మీ కోర్టులో వుంది. ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కేసుల విషయంలో కేంద్రం వేర్వేరుగా స్పందించడం, వ్యవహరించడం చాలా విస్మయాన్ని కలిగిస్తోందని సురవరం పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో అరెస్టు చేసిన ఆంధ్రా పోలీసులే ఆజాద్‌ను, హెచ్‌.సి.పాండేను హత్య చేశారని తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయ విచారణ జరిపించాలని సుధాకర రెడ్డి ఆ లేఖలో కోరారు. ఆజాద్‌ ఎవరో తనకు తెలియదని, ఆయన్ని ఎన్నడూ కలుసుకోలేదని చెప్పారు. అయితే తనకు తెలిసినంతవరకు ఎప్పుడు మావోయిస్టు యాక్షన్‌ స్క్వాడ్‌ల్లో ఆయన ఎన్నడూ లేడు. ఏవో కొన్ని కేసుల్లో ఆయన ప్రమేయం వున్నప్పటికీ కోర్టుకు హాజరుపరచకుండా ఆయన్ని చంపేసే హక్కు పోలీసులకు లేదని అన్నారు. సాధారణంగా ప్రభుత్వ వైఖరి ఎప్పుడూ పోలీసులను సమర్ధించేలానే వుంటుంది. కాని అది సరికాదు. చట్టబద్ధ పాలన కొనసాగేలా కచ్చితంగా మీరు సాహసోపేతమైన చర్యలు తీసుకోవాల్సి వుంటుందని సుధాకర రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని అన్నారు. వారు చట్టానికి అతీతులు కూడా కాదని అన్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగింది, అందులో ఆజాద్‌ మరణించాడని మీరు, పోలీసు అధికారులు భావించినట్లైతే దాన్ని న్యాయ విచారణలో నిరూపించాల్సి వుందన్నారు. న్యాయ విచారణ జరగడం వల్ల మీ ప్రభుత్వానికి విశ్వసనీయత పెరుగుతుందన్నారు. తాను చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించగలరన్న ఆశాభావాన్ని ఆ లేఖలో సుధాకర రెడ్డి వ్యక్తం చేశారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు