హైదరాబాద్ (వి.వి): ముఖ్యమైన సమస్యలపై ప్రముఖుల ప్రసంగాలను పుస్తకరూపంలో తీసుకురావడం భావితరాలకు ఎంతో దోహదపడుతుందని పలువురు వక్తలు అన్నారు. శాసనసభ ప్రచురించిన 'శాసనసభలో డా|| వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి' పుస్తక ఆవిష్కరణ సభ శుక్రవారం ఉదయం పాత అసెంబ్లీ హాల్‌లో జరిగింది. పుస్తకాన్ని శాసనమండలి ఛైర్మన్ డా|| ఎ.చక్రపాణి ఆవిష్కరించగా, డివిడిలను అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ డా|| జె.గీతారెడ్డి విడుదల చేశారు. సభకు అసెంబ్లీ స్పీకర్ యన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ మహ్మద్ జానీ, మంత్రి ధర్మాన ప్రసాదరావు, అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్ డా|| మల్లు భట్టివిక్రమార్క, విప్ డా|| సాకె శైలజానాథ్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ వై.శివరామిరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ ప్రసంగాలకు పుస్తకరూపం ఇచ్చిన మాదిరిగానే ఇతర ప్రముఖుల ప్రసంగాలకు కూడా పుస్తక రూపమిస్తే భావితరాలకు ఉపయుక్తంగా ఉంటుందని కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. గత శాసనమండలి సమావేశాల రికార్డులు అందుబాటులో ఉంటే సభా సాంప్రదాయాలు, నియమ నిబంధనలు ప్రస్తుత శాసనమండలి సభ్యులకు మరింత మార్గదర్శకంగా ఉండేవన్నారు. కౌరవులు, పాండవులు వేర్వేరైనప్పటికీ బయటి వ్యక్తులు దాడి చేసినపుడు వారంతా ఒకటేనని చాటుకునేవారని, అదేవిధంగా సభలో సభ్యులంతా కలిసి కృషి చేస్తే సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశే అగ్రగామిగా ఉంటుందని ఆయన చెప్పారు. ఆదాయాన్ని పెంచుకుని వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం వుందని, అదే వైఎస్‌ఆర్ విజన్ అని ఆయన పేర్కొన్నారు. సభలో ప్రజా సమస్యలపై అత్యంత లోతుగా చర్చ జరగాలని వైఎస్‌ఆర్ సంకల్పించేవారని, ఏ సమస్యపైనైనా లోతుగా అధ్యయనం చేసేవారని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. వైఎస్‌ఆర్ సున్నిత స్వభావం కలిగిన వ్యక్తి అని చెప్పడానికి ఆయన ప్రసంగాలే నిదర్శనమని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ ప్రసంగాల డివిడిలను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. వైఎస్‌ఆర్ ఆత్మవిశ్వాసం, నమ్మకంతో ప్రతిపక్షాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేవారని డా|| గీతారెడ్డి కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా సమస్యలపై శ్రద్దగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారని ధర్మాన ప్రసాదరావు అన్నారు. సభలో పార్టీ ఎమ్మెల్యేలను ప్రోత్సహించేవారని ఆయన చెప్పారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
