హైదరాబాద్(వి.వి) : రాష్ట్ర పరిస్థితులపై సంప్రదింపులు జరుపుతున్న శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరమే గ్రూప్-1 పోస్టులకు పరీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ శాసనసభ్యులు డా|| టి.రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్ష వాయిదా వేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలమంతా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ వాటాను తేల్చకుండా ఎపిపిఎస్‌సి గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తే తీవ్ర నిరససను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గ్రూప్-1 పరీక్ష వాయిదాను కోరుతున్న విద్యార్ధులకు మద్దతునిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రంగాల్లో తెలంగాణాకు అన్యాయం జరుగుతున్నందునే తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిందని చెప్పారు.
బ్రిటీష్ పాలనలో ఉన్న సీమాంధ్ర ప్రాంతాలు విద్యాపరంగా ముందున్నాయని, నిజాం నవాబు పాలనలో ఉన్న తెలంగాణ విద్యాపరంగా వెనుకపడిందని గుర్తు చేశారు. కులాలవారీగా రిజర్వేషన్లు కల్పించిన మాదిరాగానే ప్రాంతాలవారీగా ఎపిపిఎస్‌సిలో వాటాలు కేటాయించాలని ఆయన కోరారు. మూడుసార్లు వాయిదా పడిన గ్రూప్-1 పరీక్ష నాలుగోసారి వాయిదా పడితే నష్టం ఏమీ లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు జరిగిన గ్రూప్-1 పరీక్షల్లో తెలంగాణ ప్రాంతం వారు ఎక్కువగానే పోస్టులు సాధించుకున్నారని సీమాంధ్ర నాయకులు పేర్కొంటున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా 'ఏ ప్రాంతం వారిని దోచుకునే ఉద్దేశ్యం తమకు లేదని, తమ వాటా తమకు కావాలని' మాత్రమే కోరుతున్నామని డా|| రాజయ్య సమాధానమిచ్చారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
