ఆటో కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం

Sat, 28 Jan 2012, IST    vv
ఆటోడ్రైవర్స్‌& వర్కర్స్‌ ఫెడరేషన్‌ రెండవ రాష్ట్ర మహాసభలో వక్తలు

తిరుపతి (వివి) : పొట్టకూటి కోసం కడుపుచేత పట్టుకుని తమ కాళ్లపై తాము నిలబడాలని ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకుంటే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు హెచ్చరించారు. ఆటో కార్మికుల కోసం సమగ్ర సంక్షేమ చట్టాన్ని రూపొందించాలని డిమాండ్‌ చేశారు. ఆటో డ్రైవర్స్‌ Ê వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర రెండవ మహాసభలు తిరుపతి నగరంలో శుక్రవారం పెద్ద ఎత్తున జరిగాయి. స్థానిక ఎఐటియుసి కార్యాలయం నుండి రైల్వేస్టేషన్‌, కర్నాలవీధి, రాయలచెరువు రోడ్డు, అన్నమయ్య సర్కిల్‌ మీదుగా బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌ వరకు ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఆటోవర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.మురళీ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభనుద్దేశించి జి.ఓబులేసు మాట్లాడుతూ దేశంలో అసంఘటిత రంగంలో 45 కోట్ల మంది పనిచేస్తుంటే బడ్జెట్‌లో రూ.1000 కోట్లు విదిల్చి చేతులు దులుపుకున్నారని టాటా, అంబానీ వంటి బహుళజాతి సంస్థలను కాపాడేందుకు 70 వేల కోట్లను కేటాయించ డమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటే వారిపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నార న్నారు. 8వ తరగతి చదివి ఉంటేనే లైసెన్సులు కేటాయిస్తామని హైవే రోడ్లపై ఆటోలు తిరగరాదని ఆంక్షలు విధించి కార్మికుల కడుపులు కొడుతున్నారన్నారు. సంతకాలు కూడా సక్రమంగా పెట్టలేని ఎమ్మెల్యేలు, మంత్రులున్నప్పుడు ఆటోడ్రైవర్లకు విద్యార్హత అడ్డువస్తోందా అని ప్రశ్నించారు. లైఫ్‌ట్యాక్స్‌ పేరుతో లక్షలాది రూపాయలు ఆటోడ్రైవర్ల నుండి కట్టించుకుంటు న్నారని అయితే కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం నష్టపరిహారం కూడా ఇప్పించడం లేదన్నారు. లైప్‌ట్యాక్స్‌లో 10% శాతం కేటాయించినా ప్రతి ఆటో కార్మికునికీ రూ.2000 వేలు ఫించను సౌకర్యం కల్పించవచ్చన్నారు. జీవో నెం.213,155 లను తక్షణం రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు.

కార్మిక సమస్యలపై పోరాడేందుకు ఎఐటియుసి నాయకత్వాన్ని ఆటోవర్కర్స్‌ యూనియన్‌ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్రంలోని ఆటో కార్మికులందరినీ ఏకం చేసి ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టి అసెంబ్లీని దిగ్బందిస్తామని హెచ్చరించారు. ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పి.హరినాథరెడ్డి మాట్లాడుతూ గాలి జనార్దన్‌రెడ్డి, రాజా, కల్మాడి, వైఎస్‌ జగన్‌ లాంటి అవినీతికి పడగలెత్తిన వారిని వదిలివేసి ఆటో కార్మికులపై పడి ప్రభుత్వం దోచుకుంటోందని పేర్కొన్నారు. దేశంలో అనేక రంగాలకు చట్టాలున్నాయని అయితే ఆటో కార్మికులకు ఎటువంటి చట్టాలు లేవన్నారు. ఆటో రంగాన్ని విస్మరిస్తే మెరుపు సమ్మె చేపట్టి రాష్ట్రాన్ని స్తంబింపచేస్తామన్నారు. ఆటో కార్మికులకు పిఎఫ్‌,ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ఆటో డ్రైవర్స్‌ Ê వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి మాట్లాడుతూ రోడ్డు ట్యాక్స్‌పేరుతో ఆటోడ్రైవర్లు ప్రభుత్వానికి రూ.3500 కోట్లు, లైసెన్సు రెన్యూవల్‌ పేరుతో రూ.200 కోట్లు పోలీసులు రవాణాధికారుల దాడుల పేరుతో మరో రూ.80 కోట్లను ప్రభుత్వానికి ఆదాయ రూపంలో వెళుతోందన్నారు. రూ.800కోట్లకు పైగా ఆటో రంగం నుంచి ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ ఆటో కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తోందన్నారు. లైసెన్సు, ప్యాసింజర్‌పర్మిట్లు, సీబుక్‌, రోడ్డుట్యాక్స్‌ వంటి పేర్లతో అధికారులు ఆటో డ్రైవర్లను వేధిస్తున్నారన్నారు. పైవన్నీ డ్రైవర్లకు సక్రమంగా అందించకపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. హైవే రోడ్లల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆటోలను నిషేదిస్తున్నారని అయితే ప్రైవేటు బస్సులు, జీపులు, ట్యాక్సీల రూపంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని వాటి జోలికి పోకుండా కేవలం ఆటోలపై ప్రతాపం చూపడం ఎంతవరకు సబబన్నారు. ఆటోలు అందిస్తున్న సేవలు గ్రామీణ పట్టణవాసులకు కీలకమన్నారు. ఎఐటియుసి జెండాను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు ఎస్‌ నాగరాజన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రామచంద్రయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సైతం నేడు ఆటోడ్రైవర్లు విస్తృత సేవలు అందిస్తున్నారని అటువంటి కార్మికుల పట్ల ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందించడంలో విఫలమైందన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ చట్టం కోసం ఉద్యమించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సభలో యూనియన్‌ రాష్ట్ర నాయకులు వెంకటేశ్‌, రెహమాన్‌, దాదాగిరి, రాధాక్రిష్ణ, మల్లికార్జున్‌, శంకర్‌, పిఎల్‌ నరసింహులు, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆటో కార్మికుల సమస్యలపై ఎపి ప్రజానాట్యమండలి కళాకారులు చిన్నం పెంచలయ్య, గుర్రప్ప, మణి ఆలపించిన ఉద్యమగేయాలు కార్మికులను ఉత్తేజపరిచాయి.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు