న్యూఢిల్లీ : అక్రమ మైనింగ్ కేసులో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.ఎమ్. కృష్ణకు సుప్రీం కోర్టు శుక్రవారం కొంత ఉపశమనం కలి గించింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎస్.ఎమ్. కృష్ణ పనిచేసిన కాలం లో అక్రమ గనుల తవ్వకాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని లోకాయుక్తను ఆదేశిస్తూ కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు శుక్రవారం స్టే విధించింది. న్యాయమూర్తులు అల్తామస్ కబీర్, జ్ఞాన సుథా మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం స్టే ఉత్తర్వులు జారీ చేసింది. లోకాయుక్త కోర్టు దర్యాప్తుకు ఆదేశించడం తొందరపాటు చర్య అని ధర్మాసనం పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వానికి, ఫిర్యాదు దారునికి కూడా సుప్రీం నోటీసులు జారీ చేసింది. దీనిపై మూడు వారాల్లోగా స్పందించాలని కోరింది. కృష్ణ దాఖలు చేసుకున్న అభ్యర్ధనను పరిశీలించిన కోర్టు పైఉత్తర్వులు జారీ చేసింది. 1999-2004 మధ్య కాలంలో తాను కర్ణాటక ముఖ్య మంత్రిగా పనిచేసినప్పుడు అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డానని వచ్చిన ఆరోపణలపై లోకాయుక్త దర్యాప్తును, దాఖలైన ప్రైవేటు ఫిర్యాదును రద్దు చేయాలని కోరుతూ ఎస్ఎమ్ కృష్ణ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కర్ణాటక హై కోర్టు జనవరి 20న తీసుకున్న నిర్ణయాన్ని కృష్ణ తన పిటిషన్లో సవాల్ చేశారు. తనపై దాఖలైన ప్రైవేటు ఫిర్యాదుతో పాటు, లోకాయుక్త దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ కృష్ణ చేసుకున్న పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. దాదాపు 34 మంది మంత్రులు కలిసి మైనింగ్‌పై నిర్ణయం తీసుకున్నారని, దానికి తన ఒక్కడినే బాధ్యుడిని చేయడం తగదని కృష్ణ తన పిటిషన్లో పేర్కొన్నారు. అత్యధిక ఖనిజ నిల్వలు ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న అడవుల కూల్చి వేతకు జరగుతున్న నేరాలపై కూడా దర్యాప్తు కొనసాగించాలని హై కోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. కాగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మైసూర్ మినరల్స్ లిమిటెడ్ తన నిర్వహణలో అనేక అవకతవకలను ఎదుర్కొన్నదని వచ్చిన ఆరోపణలను కొట్టి వేస్తూ హైకోర్టు కృష్ణకు కొంత ఊరటనిచ్చింది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
