న్యూఢిల్లీ : 2జి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సార్ గ్రూప్, లూప్ టెలికం ప్రమోటర్లు అన్షుమన్, రవి రుయా, ఐ.పి. ఖైతాన్, కిరణ్ ఖైతాన్‌లు శనివారం కోర్టుకు హాజరు కాలేదు. సమన్లు అందుకోని కారణంగా కోర్టుకు హాజరు కాలేదని ప్రమోటర్ల తరుపు న్యాయవాదులు 2జి స్పెక్ట్రమ్ కేసుపై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టుకు తెలియచేశారు.
''నా క్లయింటు నివాసపు చిరు నామాకు సమన్లు అందలేదు. ప్రస్తుతం ఆయన విదేశాలలో ఉన్నందున నెల రోజుల అనుమతి కోరారు'' అని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్ర ప్రత్యేక సిబిఐ కోర్టు న్యాయమూర్తి ఒ.పి.సైనికి తెలిపారు. ఎస్సార్ గ్రూప్ డైరెక్టర్(ప్రణాళిక- వ్యూహం) వికాస్ సరాఫ్ తరుపున న్యాయవాది లూథ్ర కోర్టుకు హాజరయ్యారు. అదేవిధంగా రుయా, ఖైతాన్‌లు కూడా తమకు సమన్లు అందలేని న్యాయమూర్తికి తెలియచేశారు.
అంతకుముందు ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్లు అన్షుమన్, రవిరుయా, లూప్ టెలికం ప్రమోటర్లు ఐపి ఖైతాన్, కిరణ్ ఖైతాన్, వికాస్ సరాఫ్, మూడు కంపెనీలకు డిసెంబరు 21న న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. 2జి కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న తరువాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సైని సమన్లు జారీ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న లూప్ టెలికం ప్రైవేట్ లిమిటెడ్, లూప్ మొబైల్ ఇండియా లిమిటెడ్, ఎస్సార్ టెలి హోల్డింగ్‌లు సమన్లకు అను గుణంగా కోర్టుకు హాజరయ్యాయి. ఈ కేసుకు సంబంధించి కొంతమంది నిందితులు కోర్టుకు హాజరుకాక పోవడాన్ని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ యు.యు. లలిత్ ప్రశ్నిస్తూ విచారణ ప్రక్రియను నిలిపి వేయాలని డిఫెన్స్ కౌన్సిల్ పరోక్షంగా కోరుతు న్నదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ హై కోర్టు నుండి స్టే పొందడంలో విఫలమైన డిఫెన్స్ పరోక్షంగా స్టే కోరుతున్నదన్నారు. రుయా, ఖైతాన్‌లు ప్రస్తుతం దుబారులో ఉన్నారని, ఢిల్లీ, ముంబయిలలోని వీరి నివాసాల వద్ద సమన్లు అంటించారని డిఫెన్స్ న్యాయవాదులు తెలిపారు. తగిన చిరునామాకు సమన్లు పంపడంలో సిబిఐ విఫలమైందని వారు పేర్కొన్నారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
