పశుగ్రాసం ముప్పు..!

Sat, 28 Jan 2012, IST    vv
1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల కొరత
కన్పించని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

నల్లగొండ (వివి) : గత రెండు మూడు సంవత్సరాలుగా జిల్లాలో అతివృష్టి, అనావృష్టి కారణంగా పశుగ్రాసం కొరత తీవ్రంగా ఏర్పడింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ యేడాది పశుగ్రాసం లేక అనేక మంది రైతులు కబేళాలకు పశువులను, గేదెలను తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 40,10, 500 లక్షల పశువులు ఉన్నాయి. వీటికి సుమారు 25.570 లక్షల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం అవసరం ఉంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాబోయే కాలానికి సరిపడా పశుగ్రాసం లభించే అవకాశాలు కన్పించడం లేదు. ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావం, విద్యుత్‌ కోత కారణంగా వేసిన 2లక్షల 25వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇందుకు గాను 130 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు కోసం ప్రతిపాదనలు పంపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా మినుము, వేరు శనగ, పెసర వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఇబ్బందుల పాలయ్యారు. రైతులు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగంలో నూతన ఒరవడిని సృష్టించే విధంగా వ్యవసాయ శాఖాధికారులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వకపోవడంతో కేవలం ఎండుగడ్డిపైనే రైతులు ఆధారపడా ల్సివస్తుంది. అదే విధంగా రబీలో ఆయకట్టుకు నాగార్జున సాగర్‌ నీటి విడుదల ఉండదని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో అటు ఆయకట్టు, ఇటు మెట్ట ప్రాంతాల్లో కూడా రబీ సీజన్‌లో సేద్యం కష్టతరం గా మారింది. ప్రస్తుతం రబీలో రైతులు వ్యవసాయ బోర్లపైనే ఆధారప డాల్సివుంది. పశుగ్రాసం కొరత తీర్చేందుకు జొన్న, పజొన్న తదితర విత్తనాలను సరఫరా చేసి పశుగ్రాసం అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పశుగ్రాసం కొరత ఏర్పడి కబేళాలకు తరలించవల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. వ్యవసాయ శాఖాధికారులు ఖరీఫ్‌, రబీ పంటలను దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక అంచనాగా 1.70లక్షల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం కొరత వుంటుందని నివేదిక రూపొందిం చారు. అయితే ఇది మరింత ఎక్కువగానే ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. వేసవిలో పశుగ్రాసానికి మరింత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలోని 59 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు పరిహారం నేటికీ చెల్లించలేదు. అదే విధంగా జిల్లా యంత్రాంగం పశుగ్రాస విషయంలో నామమాత్ర చర్యలు మాత్రమే చేపడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్‌లో సక్రమంగా విద్యుత్‌ సరఫరా అందకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రస్తుతం నాట్లు వేసిన వరిమల్లు పంట చేతికొచ్చేవరకు నమ్మకం లేదని రైతన్నలు అంటున్నారు. గత ఖరీఫ్‌లోనే విద్యుత్‌ కోత కారణంగా ఎండిపోయిన పంటలను తగుల బెట్టారు. ప్రస్తుత సీజన్‌లో రైతులకు కూడా తిండి గింజలు కరువయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యేడాది సెప్టెంబర్‌ నుండి నేటి వరకు వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయి వ్యవసాయ బోర్లలో నీరు లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా ప్రాంతాల కరువును గుర్తించి రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు పశుగ్రాసం విషయంలో తీసుకుంటున్న చర్యలు జిల్లా రైతాంగానికి ఊరట కల్గించేలా లేదు. రైతులు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కోంటున్నా ఉచితంగా అందజే యాల్సిన గడ్డి విత్తనాలను సబ్సిడీపై అందిస్తామనడం విచారకరం. వేలాది మంది రైతులు పశుగ్రాసం లేకపోవడంతో ఇతర జిల్లాల నుండి గడ్డిని కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది పశుగ్రాసం కొనలేక కబేళాలకు తరలిస్తున్నారు. దీన్ని నివారించవల్సిన జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికైనా రైతులను ఆదుకుంటేనే వారి మనుగడ కొనసాగుతుంది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు