పెద్ద రాజకీయ కుట్ర

Sat, 28 Jan 2012, IST    vv
అంబేద్కర్‌ విగ్రహాల విధ్వంసంపై బొజ్జా తారకం

హైదరాబాద్‌(వి.వి) : తూర్పుగోదావరి జిల్లా అమ లాపురం, ధవళేశ్వరంలో భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాల విధ్వంసం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగిఉందని, దానిని ప్రభు త్వం వెంటనే ఛేదించి దోషులను కఠినంగా శిక్షించా లని, ఆ రాజకీయశక్తుల నిజస్వరూపాన్ని బయట పెట్టాలని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పిఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. బషీర్‌ బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షులు బొజ్జా తారకం మాట్లాడారు. దళితశక్తి రాష్ట్ర కన్వీనర్‌ గడ్డం ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌సి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శంకర్‌, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు మల్లేపల్లి లక్ష్మయ్య, ఆర్‌పిఐ ప్రధాన కార్యదర్శి మహేష్‌లతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విగ్రహాల ధ్వంసం కుట్రకు కారకులైన దోషులను బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 29న తామిచ్చిన 'ఛలో అమలాపురం' పిలుపును విజయవంతం చేయాలని కోరారు. అమలాపురంలో ఆర్‌డిఒ, డిఎస్‌పి కార్యా లయాలు, మెజిస్ట్రేట్‌ కోర్టుకు కూతవేటు దూరంలో ని అంబేద్కర్‌ విగ్రహాలను కూల్చివేసి కాలువలో పడేశారని, సంఘటన జరిగి 5రోజులు గడుస్తున్నా దోషులెవరో తేల్చకపోవటం సిగ్గుచేటన్నారు. రాజకీయ నాయకులు, పోలీసులు దోషులకు కొమ్ముకాస్తున్నారని తారకం ఆరోపించారు. డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసినా ముఖ్యమంత్రి ఖండిస్తూ ప్రకటన ఇవ్వకపోవటం శోచనీయ మన్నారు. అమలాపురం సంఘటన మరవకముందే ధవళేశ్వరంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చటం ఆక్షేపణీయమన్నారు. ఈ విషయంపై మంత్రి గీతా రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహలతో ప్రకటనలు చేయిస్తున్న ముఖ్య మంత్రికి కనీస ఇంకితజ్ఞానం కూడా లేదని విమర్శించారు. స్పీకర్‌ లేదా ముఖ్యమంత్రి అమలా పురానికి వెళ్ళాళి కానీ, డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టివిక్రమార్కను అక్కడికి పంపిస్తాననటం విడ్డూ రంగా ఉందన్నారు. విగ్రహాలు కూల్చినవెంటనే బొత్స సత్యనారాయణ, చిరంజీవిలు ప్రకటన లివ్వటం వెనుక ఆంతర్యమేమిటో గ్రహించాల న్నారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి 24గంటల్లో దోషులను పట్టుకుంటామంటుంటే ఆ జిల్లాకు చెందిన పినిపె విశ్వరూప్‌ 48గంటల గడువు అవసరమని చెప్పటమంటే, విగ్రహాల విధ్వంసంలో ఎవరినో ఇరికించేందుకు కుటిలయత్నం జరుగుతుందన్నారు. ఝాన్సీ, తాను 24, 25 తేదీల్లో యానాంలోని రిజెన్సీ సెరామిక్‌ ఇండిస్టీ కార్మికులకు మద్దతు ప్రకటించామని ఆయన తెలిపారు. యూనియన్‌ను నెలకొల్పి గేట్‌మీటింగ్‌ పెట్టినందుకే మురళీమోహన్‌ను చంపేశారని బొజ్జా తారకం, ఝాన్సీలు కంటతడిపెట్టారు. అది యానాం పోలీస్‌స్టేషన్‌లో జరిగినహత్య, పోలీసులే చేసిన ప్రత్యక్ష హత్య అని ఆరోపించారు .మురళీమోహన్‌ హత్యకు కారకులైన వారిపై సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఝాన్సీ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో బలమైన సామాజికవర్గం గల్లీనుండి ఢిల్లీ వరకు కొందరు అమ్ముడుపోయే వ్యక్తులు, శక్తులను ముందుంచి విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో మైసయ్య, కార్తీక్‌, ప్రేమ్‌కుమార్‌ తదితరులు మాట్లాడుతూ నిఘావైఫల్యమే దీనికి కారణమన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు