పూనె : లోక్‌పాల్ తెస్తారా? ...లేక ఇంటికి పోతారా?... ఇదీ ప్రస్తుతం అన్నా హజారే బృందం నినాదం. పటిష్ట లోక్‌పాల్ బిల్లు కోసం ఇప్పటి వరకు చేసిన ఉద్యమం ఒక ఎత్తైతే ఇక్కడ నుండి మరో రూపం ఇవ్వాలని అన్నా బృందం నిర్ణయించింది. 2014 ఎన్నికలు లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నది. పటిష్టలోక్‌పాల్ బిల్లు తీసుకురాలేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని ప్రజా ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నది. 'ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు మే నెల చివరి వరకు జరుగు తాయి. ఈ సమావేశాల్లోనే జనలోక్‌పాల్ బిల్లు ఆమోదం కావాలని మేము కోరు తున్నాం. ఈ బిల్లు ఆమోదం కోసం అప్పటి వరకు వేచిచూస్తాం. ఒకవేళ బిల్లు ఆమోదం పొందకపోతే సార్వత్రిక ఎన్నికలకు అప్పటి నుండి మాకు ఏడాదిన్నర సమయం వుంటుంది. 2014 ఎన్నికలు ప్రకటించిన తర్వాత రామ్‌లీలా మైదాన్‌లో దీక్షకు దిగుతాను. ' లోక్‌పాల్ తెస్తారా?... లేకపోతే అధికారం నుండి దిగిపోతారా? అనే నినాదంతో ముందుకు కదులుతాం. నేను ఉద్యమం ప్రారంభించడం వల్ల ప్రజలు కూడా వీధుల్లోకి వస్తారు. వారే నాకు మార్గదర్శకత్వం వహిస్తారు. త్రివర్ణ పతాకం చేతపట్టుకొని ప్రజల్లోకి వెళ్లిపోతాం' అని హజారే చెప్పారు. హజారే అవినీతిపై ఉద్యమం ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాలేగావ్ సిద్ధిలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. లోక్‌పాల్ బిల్లు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నదని హజారే విమర్శించారు. ఇప్పట్లో ఎన్నికలు ఏమీ లేని కారణంగా లోక్‌పాల్ బిల్లును వాయిదా వేస్తున్నదని ఆగ్రహం వెలిబుచ్చారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ముసాయిదా బిల్లు రూపకల్పనకు ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీక రించిందని అన్నారు. అయితే, తర్వాత ప్రధాని తన వైఖరిని మార్చుకోవడం, బిల్లు ఆమోదంపై పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని హజారే అన్నారు. పటిష్ట లోక్‌పాల్ బిల్లుకు మద్దతు కూడగట్టడానికి తాను దేశవ్యాప్త ఉద్యమం చేపడతానని పునరుద్ఘాటించారు. ఏ ఒక్క పార్టీకో వ్యతిరేకంగా తాము ప్రచారం చేయడంలేదని, జన లోక్‌పాల్‌ను వ్యతిరేకించే వారికి ఓట్లు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తామన్నారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
