కాంగ్రెస్‌ తమతో కల్సి పనిచేయనందుకే ఓటమి

Sat, 23 Jun 2012, IST    vv
నామినేటెడ్‌ పదవులతో పార్టీ బలోపేతం: చిరంజీవి

హైదరాబాద్‌ (వివి): కాంగ్రెస్‌ పార్టీ తన బలాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోని కారణంగానే ఉప ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించలేకపోయామని రాజ్యసభ సభ్యులు చిరంజీవి అభిప్రాయపడ్డారు. పూర్వపు పిఆర్‌పి నాయకులు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్‌ శ్రేణులు సరిగ్గా పనిచేయలేదని, అలాగే తనకు ఉన్న బలాన్ని సక్రమంగా వినియోగించుకుని ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవని ఆయన వ్యాఖ్యానించారు. తమ వర్గం నాయకులకు నామినేటెడ్‌ పదవులిస్తే కాంగ్రెస్‌ మరింత బలోపేతం కాగలదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఓటమికి అనైక్యతే కారణమా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ఉప ఎన్నికలలో 18సీట్లకు గాను కేవలం రెండు సీట్లు గెలిచి కాంగ్రెస్‌ ఖంగుతిన్న విషయం తెలిసిందే. రామచంద్రాపురం ఎమ్మెల్యేగా గెలుపొంది స్పీకర్‌ సమక్షంలో పదవీ స్వీకారం చేసిన తోట త్రిమూర్తులు అనంతరం చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో కొత్త నాయకత్వం రావలసిన అవసరం ఉందన్నారు. తిరుపతిలో కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటరమణ తనకు కొందరు సహకరించడంలేదని వాపోయిన విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతానన్నారు. జగన్‌ అరెెస్టు, వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి కన్నీళ్లతో చేపట్టిన ఎన్నికల ప్రచారం, సెంటిమెంట్‌ రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాలలో ప్రభావం చూపలేదన్నారు. పూర్వపు పిఆర్‌పి కార్యకర్తలు తమ అభిమానులు, ఆత్మబంధువులు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో పనిచేసినందున ఆ సీట్లలో కాంగ్రెస్‌ గెలిచినట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందన్నారు. 2014లో కాంగ్రెస్‌ నాయకులు సమన్వయంతో కృషి చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అధిష్టానం దృష్టి సారించిందని రెండు నెలల్లో క్షేత్రస్థాయి నుంచి చర్యలు ఉంటాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే పార్టీ యంత్రాంగం అవసరమన్నారు. అందరి భాగస్వామ్యంతో పార్టీని పటిష్టం చేయాల్సి ఉందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు