ఇడి పిటిషన్‌పై వాదనలు పూర్తి

Mon, 2 Jul 2012, IST    vv
జగన్‌ కౌంటరు దాఖలు : తీర్పు 6వ తేదీకి వాయిదా

హైదరాబాద్‌(వి.వి) : అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో వున్న వైఎస్‌ జగన్‌ను విచారించాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి) పిటిషన్‌పై నాంపల్లి సిబిఐ కోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. జగన్‌ను విచారించాలన్న తమ వాదనలను ఇడి అధికారులు మరోసారి కోర్టుకు గట్టిగా వినిపించారు. జగన్‌ కంపెనీల్లోకి వందల కోట్ల రూపాయలు హవాలా రూపంలో వచ్చాయని, దీంతో పాటు జగన్‌ మనీ లాండ రింగ్‌కు పాల్పడ్డారని వారు వాదించారు. జగన్‌ను విచారిస్తే అనేక విషయాలు వెలుగు చూస్తాయని కోర్టుకు తెలిపారు. జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇప్పటికే పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి బ్రహ్మానందరెడ్డిలను విచారించి వారి వాంగ్మూలం తీసుకున్నామని ఇడి అధికారులు వివరించారు. జగన్‌ను కూడా విచారించి ఆయన వాంగ్మూలం కూడా తీసుకుంటే తమ దర్యాప్తు ఒక కొలిక్కి వస్తుందని వారు తెలిపారు. అయితే ఇడి అధికారుల వాదనలతో జగన్‌ తరపు న్యాయవాదులు విభేదించారు. ఇందుకు సంబంధించి వారు కోర్టుకు కౌంటరు దాఖలు చేశారు. ప్రస్తుతం జగతి పబ్లికేషన్స్‌కు, జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆ సంస్థకు జగన్‌ ఛైర్మన్‌గా లేడని, అలాగే, డైరక్టర్‌గా కూడా లేడని వారు తెలిపారు. ఇటువంటి సమయంలో జగన్‌ను ఎలా విచారిస్తారని వారు కోర్టును ప్రశ్నించారు. ఇడి దాఖలు చేసిన పిటిషన్‌ నిబంధనల ప్రకారం చెల్లదని వారు వివరించారు. జగన్‌ ప్రస్తుతం జైల్లో వున్నారని, సాక్షికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలు ఆయనకు తెలియవని వారు వాదించారు. ఈ క్రమంలో జగన్‌ను ఫెమా, పిఎంఎల్‌ చట్టం కింద విచారించాలనుకోవడం సరికాదని కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న తరువాత సిబిఐ కోర్టు దీనిపై తీర్పును ఈ నెల ఆరవ తేదీకి వాయిదా వేసింది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు