మజ్జీ మన్మథరావు, మెదక్ జిల్లా
మెదక్ జిల్లాలో రైతన్న పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గోయ్యిలా మారింది, ఇటు ఖరీఫ్ పనులు సాగక, అటు రుణాలు అందక సంకట స్థితిలో రైతులు కొట్టు మిట్టాడుతున్నారు. జిల్లాలో వెయ్యి కోట్ల పంట రుణాలు ఇస్తామంటూ పాలకులు ప్రకటనలు గుప్పిస్తున్నా, అవి రైతన్న ధరి చేరడంలేదు .పైగా గత ఖరీఫ్ పంట నష్టాన్ని అందజేయడంలోనూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇందుకు గజ్వేల్ మండలం గిరిపల్లికి చెందిన రైతు బీమరి నర్సింలు ఉదాహరణ అని చెప్పవచ్చు. గత ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసి పంట నష్టపోయాడు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్‌పుట్ సబ్సిడీ లబ్దిదారుల జాబితాలో పేరు వుంది. కానీ, బ్యాంకు ఖాతాలో పరిహారం జమ కాలేదు. దీంతో పని మానుకుని, దాని కోసం ప్రతి రోజు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తున్నదని వాపోతున్నారు. నర్సింలు తరహాలోనే వేలాది మంది రైతులు నష్టపరిహారం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 4.45 లక్షల హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయాధి కారుల అంచనా. ఖరీఫ్ ఆరంభం నుండి నేటి వరకు నమోదు కావలసిన వర్షపాతం 153 మిమీ కాగా, 142 మిమీ మాత్రమే కురిసింది. అసలు వర్షపాతంలో 11 శాతం తక్కువ పడగా, ఒక్క చెరువు, కుంట కూడా నిండలేదు. బోర్ల వద్ద వ్యవసాయం చేస్తుండగా కరెంటు సరఫరా రెండు గంటలైన త్రీ ఫేస్ లేకపోవడంతో వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయి. జిల్లాలో నీటి నిల్వలు లేకపోవడం వల్ల తాగునీటికి ఇబ్బంది ఏర్పడనున్నది. కృష్ణ బేసిన్ నీటిని డెల్టా రైతులకు వదలడంతో హైదరాబాద్ జంటనగరాలకు మంజీరా నీటిని సరఫరా చేయాలనుకున్నా ప్రాజెక్ట్‌లో నీటి సామర్థ్యం 30టిఎంసిలు ఉండాలి. శుక్రవారంనాటికి 9.5 టిఎంసిలు మాత్రం నీటి నిల్వ వుండడంతో జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, జహిరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, నర్సాపూర్, శివ్వంపేట, హత్నూర ,అందోల్ , జిన్నారం మండలాలకు కోట్లాది రూపాయిలతో నిర్మించిన మంచినీటి పథకాలు బోసిపోతున్నాయి. మంజీర పరివాహక ప్రాంతమైన ఘన్‌పూర్ ఆనకట్ట, నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ రైతులకు ఉన్న సాగు నీటి హక్కును ప్రభుత్వం కల్పించకపోవడం వల్ల రైతులకు ఉరితాళ్లవుతున్నాయి. ఈ రెండింటికి సాగు నీరు సరఫరా చేయాల్సి వుండగా, హైదరాబాద్ నీటి బోర్డు అడ్డు పడడంతో వేలాది ఎకరాలలో వరి , వాణిజ్య పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం వరి పంటకు గిట్టుబాటు ధర రూ || 1500 ప్రకటించడంతో పంట సాగుకోసం రైతులు ఉత్సాహం చూపుతున్నా, పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవని చెప్పవచ్చు. విత్తనాలు, ఎరువుల కోసం ప్రతి రోజు రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉంది. మెదక్ , సిద్దిపేట డివిజన్లలో తీవ్ర వర్షాభావం నెలకొంది. ఖరీఫ్ లో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు, 1.05 లక్షల క్వింటాళ్ల విత్తనాలు కావాల్సి వుండగా, అవి అందుబాటులో లేవు.
అధికారులు మాత్రం జిల్లా రైతులకు కావలిసిన విత్తనాలు ఎరువులు అందుబాటులో వున్నాయని కాకి లెక్కలు చెబుతున్నారు. విత్తనాలు , ఎరువుల కోసం రైతాంగం ఆందోళన బాట పట్టింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాల్సిన వ్యవసాయ శాఖలో నిస్తేజం నెలకొంది.
విత్తుకొచ్చిన విపత్తు
ఖరీఫ్ ప్రారంభంలో ఒక మోస్తరుగా కురిసిన వర్షం ప్రస్తుతం ముఖం చాటేయడంతో అన్నదాతకు పుట్టెడు కష్టాలు మొదలయ్యాయి. తొలకరితో సంబరపడిన రైతులు విత్తనాలు వేశారు. ఆ తర్వాత చినుకు జాడ లేక విత్తనాలు మొలకెత్తక పోవడంతో రైతన్నలు అవేదనకు లోనవుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రైతులు ఓక్కోక్క మైకో కంపెనీకి చెందిన పత్తి విత్తనాల బస్తాను రూ||2600 వెచ్చించి బ్లాకులో కోనుగోలు చేశారు. విత్తనాలు జల్లి పది రోజులైనా కూడా అవి మొలకెత్తడంలేదు. నిత్యం ఊరిస్తున్న మేఘాలు రైతుల ఆశలను అడియాషలు చేస్తున్నాయి. వర్షం ఆధారంగానే వ్యవసాయం కోనసాగే జిల్లాలో పక్షం రోజులుగా వర్షం జాడ లేకపోవడంతో అన్నదాతలలో అయోమయం నెలకొంది. పత్తితో పాటు సోయాబిన్ , పెసర, కంది, జొన్న విత్తనాలు సైతం మొలకెత్తక పోవడంతో వర్షం కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఆకాశం వైపు చూస్తున్నారు. ఎండిపోతున్న పత్తి మొలకలను చూసి రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఖరీఫ్ అరంభంలో వర్షం కురియకపోతే తాము విత్తనాలు వేసేవారం కాదని, దీంతో విలువైన విత్తనాలైన మిగిలేవని రైతులు ఆవేదన చెందుతున్నారు. పత్తాలేని వరుణుడు విలువైన విత్తనానికి విపత్తు తెచ్చిపెట్టాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో వర్షం పడకపోతే, రెండో దఫా విత్తనాలు వేయాల్సి వస్తుందని, ఇందుకు తాము ఆర్థికంగా సిద్దంగా లేమని రైతులు వాపోతున్నారు. అష్టకష్టాలు పడి అప్పులు చేసి తెచ్చిన విత్తనాలు ఇలా పనికి రాకుండాపోవడం తమను కోలుకోకుండా చేస్తున్నదని వాపోతున్నారు.
ఖాళీలతో కుదేలవుతున్న వ్యవసాయం
జిల్లాలో వ్యవసాయశాఖలో పని చేయాల్సిన
ఉన్నతాధికారి నుండి రైతులకు మెలకువలు చెప్పాల్సిన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో జిల్లాలో వ్యవసాయ రంగం కుదేలవుతుంది. జిల్లాకేంద్రంలో పని చేయాల్సిన అధికారి పదవి విరమణ చేయడంతో, అది ఖాళీగా ఉంది. ఈ పోస్టులో మరొకరిని నియమించకుండా రంగారెడ్డి జిల్లా వ్యవసాయాశాఖ అధికారికి అదనపు బాధ్యతలు అప్పజెప్పడంతో ఆయన వారం రోజుల్లో రెండు రోజులు మాత్రం ఇక్కడకు వస్తున్నారు. మండల స్థాయిలొ పనిచేయాల్సిన వ్యవసాయాధి కారులు 46 మందికి గాను 22 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మండల విస్తరణాధి కారులు 46 మందికి గాను 28 మంది మాత్రమే పని చేస్తున్నారు.
వివిధ విభాగాలలో మొత్తం 87 మందికి గానూ 42 పోస్టులు ఖాళీగా ఉండడం వ్యవసాయంపై పాలకులకు ఉన్న శ్రద్ధ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో సిబ్బంది కొరత మూలంగా ఇన్‌ఫుట్ సబ్సిడీ చెల్లింపు, ఎరువులు, విత్తనాల సరఫరా, పంటసాగు విస్తీర్ణం నమోదు చేయడం వంటి అంశాలపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, తమకు సకాలంలో సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
