వివిధ సమస్యలపై 27న వామపక్షాల సదస్సు

Fri, 20 Jul 2012, IST    vv

హైదరాబాద్‌ (వి.వి) : సార్వత్రిక ప్రజాపంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, దారిద్య్రరేఖ దిగువ, ఎగువ వర్గీకరణ ఆపాలని, నెలకు గరిష్టంగా కిలోకు రెండు రూపాయలుగా ప్రతి కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాలు అందించాలని, ప్లానింగ్‌ కమిషన్‌ పేదరికం నిర్థారణ పద్ధతులను ఆపాలని, రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు స్వామినాథన్‌ కమిషన్‌ ప్రతిపాదనలు అమలు పరచాలని తద్వారా ఆహార భద్రతా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ స్థాయిలో నాలుగు వామపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు సిపిఐ, సిపిఐ(ఎం), ఫార్వర్డ్‌బ్లాక్‌- ఆర్‌యస్‌పిల రాష్ట్రశాఖల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈనెల 27వ తేదీ ఉదయం రాష్ట్ర సదస్సు జరగనుంది. అలాగే ఈ సమస్యపై ప్రచార ఆందోళన కార్యక్రమంలో ముగింపులో భాగంగా ఢిల్లీలో ఈనెల 30 నుండి ఆగస్టు 3 వరకు ధర్నా నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆగస్టు 3వరకు సదస్సులు ధర్నాలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి. డా||కె.నారాయణ, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి మురళీధర్‌ దేశ్‌ పాండే, ఆర్‌ఎస్‌పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో కలిసి రావాల్సిందిగా ఇతర వామపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. 2012 మే 1వ తేది నాటికి ప్రభుత్వ గోదాంలలో 7.7 కోట్ల టన్నుల గోధుమలు, బియ్యం నిల్వలున్నాయి. ప్రస్తుతమున్న పంపిణీ స్థాయి మేరకు సంవత్సరానికి ప్రజా పంపిణీ వ్యవస్థకు ఐదు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు సరిపోతాయి. సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థగా మార్చేందుకు ఆహార ధాన్యాల కోటాను పెంచి, ఎక్కువ మందికి సరఫరా చేసేందుకు వీలైన ధాన్య నిల్వలున్నాయనేది స్పష్టం. అయితే ప్రభుత్వం ఈ ధాన్యం ముక్కి పోవడానికి, పందికొక్కులు తినడానికి ప్రాధాన్యమిస్తోంది. ప్రైవేటు గోదాంల యజమానులకు లాభం చేకూర్చేందుకు ధాన్యం దాచటానికి పెద్ద మొత్తాన్ని వెచ్చిస్తోంది. బడా వ్యాపారులకు ఎగుమతుల ద్వారా లాభాలు తెచ్చిపెట్టేందుకు విదేశీ పశువులకు మేత సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుంది. కానీ భారత ప్రజానీకానికి ఆహార భద్రత కల్పించడానికి ఇష్టపడటం లేదు. గ్రామీణ ప్రాంతంలో రోజుకు 26 రూపాయల ఆదాయం వున్నవారు, పట్టణ ప్రాంతాలలో రోజుకు 32 రూపాయల ఆదాయం వున్నవారు పేదలుగా పరిగణింపబడరని అందువల్ల వారికి సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలు ఇవ్వాల్సిన పని లేదని ప్రభుత్వం సుప్రీమ్‌ కోర్టుకు సూచించింది. తత్ఫలితంగా దేశ మెజారిటీ ప్రజలు అధిక ధరలకు కొనాల్సి వస్తుంది. ఈ బోగస్‌ నిర్ధారణల ఫలితంగా గ్రామీణ భారతంలో ప్రతి వంద కుటుంబాలలో 54 కుటుంబాలు దారిద్య్ర రేఖ దిగువనున్న కేటగిరి నుండి తొలగించబడతారు. పట్టణ ప్రాంతాలలో 100 కుటుంబాలలో 72 కుటుంబాలు ఈ లిస్టు నుండి తొలగించబడతారు. ఈ బిల్లు కనుక ఆమోద ముద్ర పొందితే చట్టపరంగా ఈదేశ మెజారిటీ ప్రజలు చౌకగా సబ్సిడీలతో ఆహార ధాన్యాలు పొందే అర్హత కోల్పోతారు. నగదు బదిలీ పథకం పేరిట ప్రజాపంపిణీ వ్యవస్థను సర్వనాశనం చేయటానికి కుట్ర పన్నుతోంది. ఒక వేళ రెండు రూపాయలకు కిలో బియ్యం ప్రతి కుటుంబానికి కనీసం 35 కిలోల చొప్పున ఇవ్వగలిగితే ఆహార బడ్జెట్‌ను ప్రభుత్వం 30,000 నుండి 40,000 కోట్ల రూపాయలను సాలీనా పెంచాల్సి వస్తుంది. అదనంగా ఇవ్వాల్సిన ఈ డబ్బు ప్రభుత్వం దగ్గర లేదని బుకాయిస్తోంది. కానీ ఈ సంవత్సరం లోనే సంపదగలిగిన, అన్నీ ఉన్న సెక్షన్లకు రాయితీల పేరిట 5లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది. ఈ ప్రచార ఆందోళన కార్యక్రమం ముగింపుగా జులై 30 నుండి ఆగస్టు 3 వరకు ఢిల్లీలో ధర్నా నిర్వహించబడుతుంది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు