ఇస్లామాబాద్ : వాయువ్య పాకిస్తాన్ లోని క్వెట్టాలో షియా విద్యార్ధులు నిర్వహించిన ప్రదర్శనలో ఆత్మాహుతి దాడి జరగడంతో 50 మంది మరణించగా, 40మంది గాయపడ్డారు. మరో రెండు చోట్ల కూడా దాడులు జరిగాయి. మతపరంగా మైనారిటీలైన షియాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడలు జరిగాయని భావిస్తు న్నారు. గాయపడిన వారిలో అనేకమంది విలేకరులు, టివి కెమెరామెన్‌లు వున్నారు. క్వెట్టాలో రద్దీగా వుండే మీజాన్ చౌక్ వద్ద మధ్యాహ్నం 3గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. శక్తివంతమైన ఈ పేలుడులో తమ సిబ్బంది వున్నారని జియో న్యూస్, ఎఆర్‌వై న్యూస్, డాన్ న్యూస్ ఛానెల్స్ ప్రకటించాయి. పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ, అల్ కుద్స్ డేను పురస్కరించు కుని ఇమామియా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఈ ప్రదర్శన నిర్వహించింది. కాగా ఈ దాడికి బాధ్యులమని ఇంత వరకు ఏ గ్రూపు ప్రకటించలేదు. పేలుడు కొన్ని కిలో మీటర్ల దూరం వరకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సంఘటనా స్థలమంతా రక్తసిక్తమై, బీభత్సంగా వుంది. దీంతో ఆగ్రహోదగ్రులైన ప్రదర్శనకారులు పేలుడు తర్వాత కాల్పులు జరిపారు. కొంతమంది ప్రద ర్శనకారులు, పోలీసులు మధ్య కాల్పులు జరిగినట్లు సమా చారం. కొంతమంది దుండగులు ఈలోగా అనేక దుకా ణాలకు నిప్పంటించారు. విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిని ప్రైవేటు వాహ నాల్లో ఆస్పత్రులకు తీసుకెళ్ళారు. దీంతో క్వెట్టా అంతటా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతకుముందు తీవ్రవాదులు ఒక పోలీసు వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకుని బాంబులతో పేల్చివేశారు. ఒక కానిస్టేబుల్ మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. మరో సంఘటనలో అహ్మది మసీదు వద్ద ఆత్మాహుతి దాడిలో ఒక వ్యక్తి మరణించగా ఇద్దరు గాయపడ్డారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
