కేప్‌టౌన్ : వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా సమ్మె చేస్తున్న దక్షిణాఫ్రికాలోని వజ్రాల గని కార్మికులు యాజమాన్యం నుంచి బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. వెంటనే విధుల్లోకి రండి లేదంటే ఉద్వాసన తప్పదు అని గని యజమాని లోన్‌మిన్ ప్రకటించారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వజ్రాల గని కార్మికులు 3 వేల మంది వారం రోజులుగా సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో ఇదే గనిలో ఐదు రోజుల క్రితం జరిగిన ఘర్షణలు, పోలీసుల కాల్పుల్లో 34 మంది కార్మికులు మృతిచెందిన విషయం తెలిసిందే. గనిలో 3 వేల మంది కార్మికులు అక్రమంగా సమ్మె చేస్తున్నారని, వెంటనే విధుల్లోకి రావాలి అని లోన్‌మిన్ పేర్కొన్నాడు. జోహాన్స్‌బర్గ్ వాయువ్య ప్రాంతంలోని ఈ మరికానా వజ్రాల గనిలో గురువారం కాల్పులు, మృతుల నేపథ్యంలో కార్మికులు విధుల్లోకి రావడానికి గడువును శుక్రవారం నుంచి సోమవారానికి కంపెనీ పొడిగించింది. వెంటనే విధుల్లోకి రాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని తాజా చేసిన ప్రకటన కాల్పుల్లో మరణించిన తమ సహచర కార్మికులను అవమానించడమేనని గని కార్మికులు పేర్కొన్నారు. అధ్యక్షుడు జాకోబ్ జుమా కూడా వారం రోజుల సంతాప దినాలను ఆదివారం ప్రకటించారు. పోలీసుల కాల్పుల్లో 34 మంది కార్మికుల మృతిపై దక్షిణాఫ్రికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ దేశంలోనే కాదు లండన్‌తో సహా అనేక ఇతర ప్రాంతాల్లోను కార్మికులు, ప్రజలు ఈ ఘటనపై తమ నిరసన తెలియజేశారు. 27 శాతం మంది కార్మికులు సోమవారం నుంచి విధుల్లోకి వస్తారని తాను భావిస్తున్నానని, అయితే, వారం రోజులుగా సమ్మె చేస్తున్న ఈ కార్మికులు ఎప్పుడు సమ్మె ముగిస్తారన్నది ఖచ్చితంగా తెలియదని లోన్‌మిన్ ప్రకటించాడు. వారం రోజులుగా నిరసనకారులు ఉన్న ప్రాంతం సోమవారం ఉదయం కొంత ఖాళీగా కనిపించింది కానీ, తిరిగి విధుల్లోకి వచ్చిన సంకేతాలు మాత్రం ఎక్కడా కనిపించలేదని సంఘటనా స్థలంలో ఉన్న మీడియా పేర్కొంది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
