నానీల్లో హాస్యంచిన్న పదాలు-పెద్దభావాలు

Sun, 19 Aug 2012, IST    vv

కుక్క కరిచిన చోట ఎడాపెడా చెప్పుతో వాయించేస్తుంటారు. ఏమంటే చెప్పుదెబ్బతో కుక్కకాటు నయమయిపోతుందట!

కుక్కకాటుకు

చెప్పుదెబ్బ

అసలే కాటుతో ఏడుస్తుంటే

ఈ వడ్డీ ఒకటా!

తప్పదు మరి మూఢనమ్మకాలంటే అలానే వుంటాయి. అనుభవించాల్సిందే! సాధారణంగా పెద్ద పెద్ద ఇండ్లలో గేటు దగ్గర 'కుక్కలున్నాయి జాగ్రత్త' అని బోర్డు పెడుతుంటారు. ఆ ఇంట్లోకి వెళ్ళవలసివస్తే కొంచెం భయం జంకు పుట్టి గేటుదగ్గరే ఆగిపోతుంటాం. ధైర్యం చేసి ముందడుగు వేయలేం. కాని సోమేపల్లి వెంకటసుబ్బయ్య మరేం పర్వాలేదని ఇలా అంటున్నారు.

కుక్కలున్నాయి జాగ్రత్త

ఫర్వాలేదు

మనుషులున్నారేమో

అదేభయం!

మనుషులుంటే భయపడండని కుక్కలుంటే ఫర్వాలేదని, కుక్కలకన్నా మనుషులే ప్రమాదకరమని హెచ్చరించడంలో చమత్కార సందేశం ఉంది.

చలన చిత్రరంగంలో హీరోలు ఎంత కష్టమైనపని అయినా సునాయాసంగా చేసేస్తున్నట్లు, ఫైటింగులు కూడా వారే చేసేస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. కాని వాటిని డూప్స్‌ చేస్తారనే విషయం మనం గ్రహించలేనంతగా కెమేరా ట్రిక్స్‌ ఉంటాయి.రిస్కు షాట్లు చాలా వరకు డూప్స్‌ చేస్తారు. ఇది సర్వసాధారణమైన విషయమైనప్పటికి కన్నోజు లక్ష్మీకాంతం గారి హీరో ఇలా అంటున్నాడట!

ఫైటింగు సీన్‌

డూప్‌ కివ్వమన్నాడు

శోభనం సీన్‌

హీరోనే చేస్తాడట

శోభనం సీన్లు రక్తి కట్టించడం అలవాటైపోయిఉంటుంది మరి

గొప్పనటిగా ఎదగాలంటే నేడు పెద్దగా నటన అవసరంలేదట. మరేం కావాలో గాదిరాజు రంగరాజు చెపుతున్నాడు చూడండి.

నటిగా

ఎదిగిపోతున్నది

సిగ్గు శరమూ!

వదిలేసినట్టుంది!

అర్థమైపోయింది కదా! నేటి నటీమణుల పరిస్థితి, దుస్థితీను. రాజకీయాల్లోకి వస్తే నేడు పార్టీలకు సిద్ధాంతాలు, నిబద్ధతలు,ప్రజా ప్రయోజనాలు మరేమీలేవు. కేవలం అవకాశవాదం ఒక్కటే నేటి సిద్ధాంతం, సిద్ధాంతాలు, ఉన్న పార్టీలు కూడా అనైతిక పొత్తులకు అంగీకరిస్తున్న విషయాలను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మల్లయ్య ఇలా రాద్ధాంతం చేస్తున్నాడు.

సిద్ధాంతం లేదు

రాద్ధాంతం లేదు

ఏ పార్టీ టిక్కెటిస్తే

ఆ పార్టీ నాది!

రాత్రికి రాత్రే కండువాలు మార్సేసుకోవడం మనకు అనుభవమయ్యే విషయమే కదా!

ఎన్నికలొచ్చాయంటే వాగ్దానాల వర్షంలో జనాలు తడిసిపోవలసిందే గొర్రెల మంద అవాల్సిందే!

ఆ ఎన్నికలు పూర్తయిన తరువాత వాగ్ధానాలను గాలికి వదిలేయడం, మరలా ఎన్నికలు వచ్చినప్పుడు అవే వాగ్ధానాలు మళ్ళా ఇవ్వడం షరా మామూలే! స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి ప్రజలకు, నాయకులకు అలవాటైపోయిన తంతే ఇది. ఈ విషయాన్నే నూటెంకి రవీంద్ర ఇలా ప్రస్తావిస్తున్నారు.

పిట్టల దొరా

నీకిప్పుడు విశ్రాంతి

ఎందుకంటావా

ఇది ఎలక్షన్ల కాలం!

- పి.లక్ష్మణ్‌రావ్‌


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు