నవీ ముంబయి ఎయిర్‌పోర్టుకు త్వరలోనే అనుమతి

Fri, 3 Sep 2010, IST    vv
ప్రధాని మన్మోహన్‌

న్యూఢిల్లీ : దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న నవీ ముంబయి విమానాశ్రయ ప్రాజెక్టుకు త్వరగా అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ అంశాన్ని పరిష్కరిస్తానని, తాను స్వయంగా పరిశీలిస్తానని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేడు తెలిపారు. ముఖ్య మంత్రి అశోక్‌ చవాన్‌ నేతృత్వంలో తనను కలిసిన మహారాష్ట్ర కాంగ్రెస్‌ ప్రతినిధి వర్గానికి ప్రధాని పై మేరకు హామీ ఇచ్చారు. ''ఈ విషయాన్ని నేను స్వయంగా పరిశీలిస్తా. ముంబయి దేశంలోనే అతి ముఖ్యమైన నగరం. కొత్త విమానాశ్రయం అవసరముందంటే కచ్చితంగా పరిశీలిస్తా. ముంబయి అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు వుండవు.'' అని ప్రధాని ప్రతినిధివర్గానికి తెలియచేశారని అశోక్‌ చవాన్‌ చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబయి మహానగరానికి మరో విమానాశ్రయం అవసరం ఎంతైనా వుందని తాము ప్రధానికి తెలియచెప్పామన్నారు. ప్రస్తుతమున్న విమానాశ్రయంలో కొన్ని పునర్నిర్మాణాలు జరిపి, గరిష్టంగా విస్తరించాల్సిన అవసరం వుందని అన్నారు. ప్రస్తుతం ముంబయి ఎయిర్‌పోర్టులో ఏటా 2కోట్ల 60లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని, 2014-15నాటికి నాలుగున్నర కోట్లకు చేరే అవకాశముందని, 2031-32నాటికి 119మిలియన్లకు చేరుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ మంత్రి జైరాం రమేష్‌ వైఖరి మహారాష్ట్రకు సమస్యగా మారుతోందా అని చవాన్‌ను ప్రశ్నించగా ఆయనతో మూడుసార్లు సమావేశమయ్యానని, ఈ ప్రాజెక్టు చేపట్టేటపుడు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అవి తీసుకోవ డానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందని చెప్పినట్లు తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టు పక్కనే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంతమంది నేతలు స్థలాలు తీసుకున్నందున నవీ ముంబయి విమానాశ్రయం కోసం పట్టుబడుతున్నారని శివసేన చేస్తున్న ఆరోపణనలు చవాన్‌, నారాయణ రాణే తోసిపుచ్చారు. అసలు ప్రాజెక్టు పక్కన ప్రైవేటు స్థలమనేదే లేదని చెప్పారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు