ఓబిసిలలో ఉపవర్గాలు ఉండాలి;సల్మాన్‌ ఖుర్షీద్‌

Mon, 6 Feb 2012, IST    vv

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో వెనుకబడిన ముస్లిం వర్గాల నుండి మద్దతు పొందేందుకు కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇతర వెనుకబడిన తరగతుల వారిని ఉప వర్గాలుగా విభజించాలని న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ డిమాండ్‌ చేశారు. ''ప్రభుత్వం తన చట్టపరిధిలో ఓబిసిల మధ్య ఉప వర్గాలను ఏర్పాటు చేయాలి. దీని వలన విస్తారంగా ఉన్న ఓబిసిలలోని అన్ని కులాలు, వర్గాల వారికి రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందుతాయి'' అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారిక పత్రిక ''కాంగ్రెస్‌ సందేష్‌'' తాజా సంచికలో రిజర్వేషన్లపై ఖుర్షీద్‌ ఒక వ్యాసం రాస్తూ అందులో పై అంశాలు పేర్కొన్నారు. సచార్‌ కమిషన్‌, రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌, ఇందిరా సవ్నె-ఇతరులు వర్సెస్‌ భారత యూనియన్‌-ఇతరులు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ప్రముఖ తీర్పులను ఈ వ్యాసంలో అన అభిప్రాయానికి మద్దతుగా ఖుర్షీద్‌ పేర్కొన్నారు. ఓబిసిలలో ఉప కులాలు గురించి ప్రస్తావించడం కొత్త విషయమేమి కాదని చెబుతూనే 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత ఓబిసిల జాబితాలను రాష్ట్ర జాబితాలో కలిగిఉన్నాయని అన్నారు. తొమ్మిది రాష్ట్రాలు మాత్రం తమ ఓబిసి జాబితాలో ఉప వర్గాలను కలిగి ఉన్నాయని తెలిపారు. ముస్లింల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనంపై సచార్‌ కమిటీ వెల్లడించిన అంశాలను పేర్కొంటూ ''ప్రత్యేక రిజర్వేషన్ల ద్వారా భారత్‌లోని ముస్లింల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సచార్‌ కమిటీ సిఫార్సు చేసింది'' అని ఆయన పేర్కొన్నారు. మైనార్టీ జనాభాలోని వెనుకబడిన వర్గాలను కేంద్ర జాబితాలోని ఓబిసిలలో చేర్చినప్పటికీ రెండు దశాబ్దాలుగా మైనార్టీలకు ప్రత్యేక కోటా కేటాయించాలన్న డిమాండ్‌ పెరుగుతూ వస్తున్నదన్నారు. మైనార్టీల్లోని ప్రధాన వర్గాలన్నీ దేశంలో మరింతగా వెనుకబడి ఉన్నాయన్న వాస్తవాన్ని ఇది తెలియచేస్తున్నదని ఆయన అన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు