కామ్రేడ్‌ వేములపల్లి శ్రీకృష్ణ సాహిత్య కృషి

Sun, 6 Dec 2009, IST    vv
కామ్రేడ్‌ వేములపల్లి శ్రీకృష్ణ సాహిత్య కృషి

ఈ మధ్య వేములపల్లి శ్రీకృష్ణ రాసిన 'తెలుగోడా!' గేయం ఇటీవల వివాదాస్పద మయింది. గతంలో కూడా కొందరు ఈ గేయం నేపథ్యం గురించి అపోహలుపడి అవాస్తవాలు రాసారు. శ్రీ కృష్ణ రాసింది ఈ ఒక్కగేయమేననే అభిప్రాయం కలిగినవారు అనేకమంది వున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ రాసిన గేయసాహిత్యం గురించీ వాటి చారిత్రక సందర్భాలను, రచనా కాలాల్ని వివరిస్తూ రాయాల్సిన అవసరాన్ని, పాఠకులకు వాస్తవ సమాచారం తెలియచేయా ల్సిన అవసరాన్ని, అలాగే వారి మొత్తం సాహిత్యకృషినీ ఎరుకపరచాల్సిన అవసరాన్ని బాధ్యతగా గుర్తిస్తూ ఈ వ్యాసం.

శ్రీకృష్ణ 'తెలుగోడా!' (చేయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!) తోపాటు మరో ఆరుగేయాలు రాశారు. అవి జాయేంగే కయ్యూరు, చెంచు పాట, రెడ్‌ ఆర్మీ, రండీ దేశసేవకు, అన్నాచెల్లెలు, రావోయి లభ్యమైనవి ఇవి మాత్రమే. తెలుగోడా కాకుండా మిగిలిన ఆరుగేయాలు అరుణగీతాలు సంకలనంలోఅచ్చయినాయి. అయితే వీటి తొలి ప్రచురణ వివరాలులేవు. 'ప్రచారం ప్రబోధం లేనిది కవిత్వమౌతుందా?' అనే దృష్టి, దృక్ఫథంలో ఆయా చారిత్రక సందర్భాలలో మాత్రమే ఈ గేయాలన్నింటినీ శ్రీకృష్ణ రాశారు. ప్రచార, ప్రబోధ గేయాల స్థానం సాహిత్య చరిత్రలో తాత్కాలికమే అయినా ఆయా సందర్భాలలో ఆ పాటలు ఒక చరిత్రను సృష్టిం చుకున్నా యనే వాస్తవాన్ని గ్రహించాలి. ఏ చారిత్రక సంఘటన లను ఆధారంచేసుకుని రాసారో అవి మనకు గుర్తుకు వస్తాయి. అంతేకాక రచయిత ఆయా చారిత్రక సంఘ టనలకు ఎలా స్పందించారో కూడా తెలుస్తుంది. శ్రీ కృష్ణకు అరసం జిల్లా శాఖ గుంటూరులో అమరజీవి పులుపుల వెంకట శివయ్యసాహితీ సత్కారాన్ని 28-11- 1998న అందచేసింది. ఆ సందర్భంలో శ్రీకృష్ణ తన జీవిత విశేషాలు, సాహిత్య కృషిని తెలియచేసే వివరాలను నాకు అందచేశారు. ఆ వివరాల ఆధారంగా, డిసెంబర్‌ 1978లో అరసం ప్రచురిం చిన పులుపుల వెంకట శివయ్య స్మృతిసంచిక 'పలనాడు వెలలేని మాగాణిరా'లో శ్రీకృష్ణ రాసిన వ్యాసం 'కరదీపిక, క్రాంతిరేఖ మా శివయ్య'లో పేర్కొన్న వివరాలను ఆధారం చేసుకుని, ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ పరిశోధనా గ్రంథం 'తెలుగులో ఉద్యమ గీతాలు' (1991) ఆసరాగా తీసుకొని శ్రీకృష్ణ గేయాల రచనా కాలాన్ని నిర్ణయించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో పొరపాట్లువుంటే విజ్ఞులైన పాఠకులను సవరణలను చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

జాయేంగే కయ్యూరు పాటకు నేపథ్యం 1943లో కేరళలోని మల్బారీ ప్రాంతంలో కౌల్దారీ రైతులు తమ హక్కుల కొరకు సాగించిన సమరం. కన్ననూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉరిశిక్షకు గురైన కున్హంబు,చిరుకందన్‌, అబూబకర్‌, అప్పూ అనే నలుగురు కమ్యూనిస్టు అమరవీరులకు జోహార్లర్పిస్తూ ఆ పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తూ రాసిన గీతమిది. ఈ గేయంలో 'వీరిగన్న తల్లులకూ వీరగంధం పూసివత్తాం' అన్న చరణం కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి రాసిన 'వీరగంధం దెచ్చినారము వీరుడెవ్వడో దెల్పుడీ పూసిపోదుము' (సూతాశ్రమగీతాలు- 1930) ను గుర్తుచేస్తుంది. శ్రీకృష్ణకు సమకాలీన సాహిత్యంతో వున్న పరిచయాన్ని, ప్రభావాన్ని తెలుపుతుంది. ఒక చారిత్రాత్మక సంఘటనపై శ్రీకృష్ణ హృదయ నివేదనను ఎనిమిది చరణాల ఈ పాట ద్వారా అర్థం చేసుకోగలం.

చెంచుపాట, రెడ్‌ ఆర్మీ పాటలు రెండూ, కమ్యూనిస్టుపార్టీద్వారా సంతరించిన ప్రాపంచిక దృష్టిని ప్రతిబింబిస్తాయి. 1939-43 సంవత్సరా లలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తరుణ సోవియట్‌ సోషలిస్ట్‌్‌ యూనియన్‌పైదాడి చేసిన ఫాసిస్టు నాజీ శక్తులను నిరసిస్తూ, ఎర్రసేన విజయాలను కీర్తిస్తూ రాశారు. భారతీయులు సంఘీభావాన్నికూడా వ్యక్తపరచారు. 'ఎర్రసేన నెదురపెట్టి స్టాలిన్‌ బాబూ తిరుగుదెబ్బ తీసినావు. విశ్వ విజేతలంచు విర్రవీగె నాజీల వెన్ను విరగగొట్టినావు విజయమింక మందేను' అలాగే' హిందు ముస్లింలేకమై ప్రజాయుద్ధములను మీ ప్రక్కనుండి పోరాడుతాము శతృమూకల నాశనంచేసి దేశ దాస్యముక్తి పొందుతాము' అన్నారు. శ్రీకృష్ణ రాసిన ప్రసిద్ధ గేయాలలో ఒకటి 'రెడ్‌ ఆర్మీ', 'మాస్కో పొలిమేరలోనా మారణ యంత్రాలు నిలిపి మాడ్చివేసేరా, రెడార్మీ పూడ్చేవేసేరా' అనే పల్లవితో ప్రారంభమయ్యే 18 చరణాల గేయమిది.

'రండీ దేశసేవకు' గేయం కూడా రెండవ ప్రపంచయుద్ధం నేపథ్యంలో రాసిందే. 'జాపాను వారదేరా కాలూదువ్వుచునుండే మదరాసులోన వారూ బాంబులువేయసాగె' అనిఆనాటి సంఘటనలను గుర్తు చేస్తూ 'జాతీయ నాయకులు జైలు కొట్లల్లొనుండె అని దేశరక్షణ, స్వాతంత్య్రం కోసం భారతీయులు ఐకమత్యంతో దీక్షబూనాలని ఉద్భోధించిన గేయమిది. మదరాసులోనేకాక విశాఖపట్టణంపై కూడా జపాను సైనికులు 1942లో బాంబులవర్షం కురిపించారు. ఈ ఘటనపై ప్రముఖ అభ్యుదయ రచయిత సెట్టి ఈశ్వరరావు 'బాంబులు పడ్డనాడు' (ప్రజాశక్తి కథల సంకలనం) కథానికను రచించారు.

మరో ప్రముఖ గేయం 'అన్నా చెల్లెలు' రెండవ ప్రపంచ యుద్ధకాలంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం వలనదేశంలో ఏర్పడిన కరువు పరిస్థితులను చిత్రిస్తూ, ఆ దుస్థితిని ఎదుర్కొనటానికి పరిష్కారా లను ఆవిష్కరిస్తూ సాగింది. 'పంటవున్నా కరువు వచ్చిన హేతువేమిర అన్నయా, పంటనంతా తిండి దొంగలు దాచివైచిరి అన్నయా'' అంటూ చీకటి వ్యాపారులను ఛీత్కరించారు. 'హెచ్చుపంటకు పెచ్చుసాగూ చేయవలెనే చెల్లెలా' అని హరిత విప్లవాన్ని ఆకాంక్షించారు. అంతేకాకుండా 'బంజరంతా ప్రభువులోరూ బీదవారికిత్తురా - రైతుకూలీ లేకమైతే బంజరివ్వకపోదురా' అని భూపోరాట ఆవశ్యకతతోపాటు రైతుకూలీల ఐక్యతనూ చాటి చెప్పారు.''ఆ రోజుల్లోరామకోటి, ముమ్మనేని విమల కలిసి బెంగాల్‌, రాయలసీమ కరువుకు సంబంధించిన ఘట్టాలను అన్నాచెల్లెలు సంవాదంతో 'ఎంత తిరిగిన ఏమిదొరకదు ఖర్మమే మిర అన్నయ్యా' అంటూ ప్రేక్షకుల్ని ద్రవీభూతం చేసేవారు''. (ప్రజాపోరాటాల రంగస్థలం ఆంధ్ర ప్రజానాట్యమండలి - మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి 1999) ఆనాడు, శ్రీకృష్ణరాసిన ఈ పాట ప్రజావేదికలపై ప్రదర్శించినప్పుడు కలిగిన స్పందన అది.

'రావోయి' అనే గేయం 'అన్నాచెల్లెలుకు కొంతమేరకు కొనసాగింపు. 'పంటల నధికము పండించుటయె దేశరక్షణకు దారియోనురా' అంటారు. ఈ గేయంలోశ్రీకృష్ణ జాతీయతాభావం స్పష్టమవుతుంది. వంగదేశపు కరువుపై ఆర్తితో పాటు సహాయానికి పిలుపు వుంది.ఆయా చారిత్రక సన్నివేశాలనుబట్టి నా వద్ద వున్న సమాచారాన్ని బట్టి ఈ పాటలన్నింటినీ 1944-45 ప్రాంతా లలో శ్రీకృష్ణ రాసారని స్పష్టమవుతుంది.

శ్రీకృష్ణ వీటిని జానపద గీతాల శైలినను సరించి రాసారు. ప్రజానాట్యమండలి గాయకులు నాజర్‌, గోపాలంలు కళాకారులు వీటిని గానం చేశారు, అభినయించారు. ఈ గేయాలలో గొప్ప సాహిత్యం కనిపించకపోవచ్చు. కానీ గొప్ప చారిత్రక సంఘటనలను మన ముందుంచుతాయి. అలాగే శ్రీకృష్ణ ఒక ఉత్తమ కమ్యూనిస్టు భావజాల ప్రచారకుడుగా, మానవత్వం మూర్తీభవించిన మనిషిగా మనకు వ్యక్తమవుతారు.

శ్రీకృష్ణ రాసిన నాటికీ నేటికీ నిత్యనూతనమైన గేయం 'తెలుగోడా!' ఈ గేయాన్ని 1945లో బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షతన మదరాసులో జరిగే వైజ్ఞానిక మహాసభలో పాడాలంటే గోపాలం కొరకు రెండురోజులలో రాసి ఇచ్చారు.దగ్గరుండి ట్యూన్‌ చేయించారు. ''చేయి గలిపి సాధించు స్వారాజ్యం జయమంది భోగించు నీ రాజ్యం' అన్న ఆఖరు చరణం 'భోగించు' అనే మాట మనసుకు తట్టక మరో మాట అతకక నా తలప్రాణం తోకకు వచ్చింది. ఆ మాట చెప్పి బయట వేసినవాడు శివయ్య'' అని శ్రీకృష్ణ కృతజ్ఞతాపూర్వకంగా శివయ్యను గురించిన వ్యాసంలో రాసారు. ''సాహిత్యంలో బహుకొద్ది పరిచయం వున్న నేనే వ్రాయగా తానెందుకు వ్రాయలేననుకున్నాడు. పోటీపడ్డారు. ప్రసిద్ధ గేయం 'పలనాడువెలలేని మాగాణిరా బయటకొచ్చింది' అనే ఆసక్తికరమైన విషయాన్ని శ్రీకృష్ణ తెలిపారు. ఒక గొప్ప గేయం శివయ్య రాయటానికి స్ఫూర్తినందించిన శ్రీకృష్ణకు కృతజ్ఞతలు. శివయ్య గేయం డిసెంబర్‌ 1945లో వెలువడింది. కాబట్టి శ్రీకృష్ణ ఈ గేయాన్ని 1945 మధ్యలో రాసి వుంటారు. వైజ్ఞానిక మహాసభ తేదీలు లభ్యమైతే మరింత స్పష్టంగా కాలనిర్ణయం చేయవచ్చును.

1940వ దశకంలో తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రం 'విశాలాంధ్ర' కావాలని ఉద్యమాలను కమ్యూనిస్టు పార్టీ కొనసాగిస్తున్న కాలంలో 'ఉత్తరాదీ మొదలు -దత్తమండల మంత తెలంగాణ ప్రాంతముతో - చెలిమి గలిగించాలి' అని ఉద్భోధిస్తూ 'ముక్కోటి బలగమోరు, ఒక్కటై మనముంటె ఇరుగు పొరుగులోన - వూరు పేరుంటాది' అని తెలుగువారి సమైక్యతను శ్రీకృష్ణ మరీ మరీ చాటిచెప్పారు.విశాలాంధ్ర ఉద్యమానికి ఊపునూ, ఉత్తేజాన్ని ఈ రాష్ట్ర భక్తిగేయం ఎంత గానో కలిగించింది. ఈగేయం 11వ చరణంలో తొలుత 'నాయకీ నాగమ్మ' అని వుండటాన్ని తరు వాత 'కాకతీ రుద్రమ్మ'గా శ్రీకృష్ణ మార్పు చేశారు.

''విశాలాంధ్ర'' పాటల పోటీకినేను వ్రాయలేదు'' అని స్పష్టం చేశారు.అయితే ఆంధ్ర జాతీయ గీతం కావాలని ఉత్తమ గీతాలకు బహుమతులిస్తామని రచనలను ఆహ్వానిస్తూ పుచ్చలపల్లి సుందరయ్య 4-1-1945న జారీచేసిన ప్రకటన 17-1- 1945 న ప్రజాశక్తిలో ప్రచురితమైంది. ఈ పోటీ ఫలితాలను 19.9.1945న ప్రజాశక్తి ప్రచురిం చింది. శ్రీకృష్ణ రాసిన కాలం పోటీలు జరిగిన కాలం దాదాపు ఒకటే కావటంతో కె.శ్రీనివాస్‌తో పాటు హరిపురుషోత్తం, రజాహుస్సేన్‌లు కూడా పొరపడ్డారు. శ్రీకృష్ణ ఈ గేయానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

''పాట విశేషమేమంటే దాని రచయిత కమ్యూ నిస్టు అనుకోరు. ఆ వాసన తగలదు. అప్పట్లో పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకులుగా వున్న ఆచార్య రంగా, ఆయన సోదరుడు లక్ష్మీ నారాయణ స్వయంగా తమ సభల్లో పాడేవారు. చీరాల కాంగ్రెస్‌ కమిటీవారు పార్టీగేయంగా తీర్మానించారు. ఈ గేయంసాహిత్య అకాడమీ, ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రచురించిన సంకలనా లలోనే గాకుండా జాతీయగీతాలు (ప్రజాశక్తి ప్రచురణాలయం ప్రచురణ, బెజవాడ జనవరి 1947), ప్రజానాట్యమండలి సంకలనాలలో, మరెన్నో సంకలనాలలో చోటు చేసుకుంది. అనేకమంది పరిశోధకులు విస్తృతంగా వుటం కించారు. ఈ గేయం తెలుగుసాహిత్య చరిత్రలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంది. ఒక చారిత్రక పాత్రను నిర్వహించింది. శ్రీకృష్ణ ఈ ఒక్క గేయాన్నే రాశారనుకునేవారు చాలామంది వున్నారు.శ్రీశ్రీ ఈ గేయాన్ని చదివిన తరువాత శ్రీకృష్ణను ఃaషషఱసవఅ్‌aశ్రీ జూశీవ్‌ః అన్నారు. 'పల్లెటూరు' చలనచిత్రంలో ఘంటసాల ఆలపించారు. 1982లో ఆవిర్భవిం చిన తెలుగుదేశంపార్టీ ఈ గేయాన్ని తన అధికార గీతంగా స్వీకరించి ఎనలేని ప్రాచుర్యా న్ని కలి పించింది. అమెరికా తానా సభల్లో నృత్యగేయంగా పదర్శితమైంది. ''శివయ్యగారు ఇంకా గొప్ప కవి అయి వుండేవారు. సాహిత్య కృషి సాగించి ఉంటే. కవిత్వం కన్నా గొప్ప పనులు నిర్వహించా లను కున్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి ప్రజా సమస్యలకు తమకు తాము అంకితం చేసుకున్నారు.'' (చేకూరి రామారావు 'చేరాతలు'-11-10-1987 ఆది వారం ఆంధ్రజ్యోతి దినపత్రిక) అన్న మాటలు శ్రీకృష్ణకు కూడా అక్షరాలా అన్వయిస్తాయి.

శ్రీ కృష్ణ యితర సాహిత్య కృషి

1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో తెనాలి లో తాపీ ధర్మారావు అధ్యక్షతన జరిగిన ప్రథమాంధ్ర అభ్యుదయ రచయితల సంఘం మహాసభలో శ్రీకృష్ణ ప్రతినిధిగా పాల్గొన్నారు.ఆ మహాసభ సంచికలో 'సారస్వత సమాలోచన' అనే వ్యాసాన్ని రాశారు. ఆ తరువాత ఒకటి రెండు మహాసభల్లో శ్రీకృష్ణ పాల్గొన్నారు. 1948 తర్వాత రహస్య జీవితంలో వుండగా తాపీ ధర్మారావు సంపాదకత్వాన వెలువడే 'కాగడా' పత్రికలో 'చరిత్ర చిందులు' అన్న శీర్షికతో 'గిరీశం' అనే కలం పేరుతో వ్యాసం రాశారు. కారుమంచి వెంకటేశ్వరరావు నడిపే 'నగారా' పత్రికలో వరుసగా 'లోకంపోకడ' శీర్షికక్రింద 'సాక్షి' కలంపేరుతో శ్రీకృష్ణ వ్యాసాలు రాశారు.1951లో రహస్యజీవితం నుండి బయటకు వచ్చిన అనంతరం గుంటూరు నుండి వెలువడే 'నగారా' పక్షపత్రికకు సంపాదకత్వం వహించారు. 1952లో మద్రాసులో జరిగిన అఖిలాంధ్ర సదస్సు కొరకు 'అఖిలాంధ్ర సదస్సుకు హాజరైనపెద్దలార - నేనా నేనొక తెలుగువాణ్ణి' అన్నగేయాన్ని రాసారు. ప్రకాశం పంతులుగారి మద్రాసు మనదేనన్న నినాదాన్ని విమర్శిస్తూ వ్రాసిన ఆ గేయాన్ని ఆనాడు గోపాలం చేత సదస్సులో పాడనివ్వలేదు. పనుల వత్తిడివలన ఈ గేయాన్ని శ్రీకృష్ణ ప్రచురణ కొరకు ఏపత్రికకూ పంపలేదు. ఇలా శ్రీకృష్ణ గేయమొకటి ఆంక్షలకు,నిషేధానికి గురైంది. 1952లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు, విశాఖపట్నంలో నిర్వహించిన అభ్యుదయోత్సవాలను శ్రీకృష్ణ ప్రారంభిం చారు.1969-72 మధ్యకాలంలో విశాలాంధ్ర దినపత్రిక ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటించిన శ్రీకృష్ణ అమెరికా, కెనడా పర్యటనా నుభవాలను వివరిస్తూ ఆ దేశాల స్థితిగతులను పేర్కొంటూ డజను వ్యాసాలు రాశారు. తానాసంస్థ వెలు వరించే పత్రికలో తెలుగు సాహిత్య, సాంస్కృతిక సంస్థల కృషిని వివరిస్తూ, చాగంటి సోమ యాజులు, రావిశాస్త్రి, మొదలగు సాహితీవేత్తల రచనలపై సమీక్షా వ్యాసాలను శ్రీకృష్ణ రాసారు. 'శాంతి-స్నేహం' (1989-90) మాసపత్రికకు సంపాదకత్వం వహించారు.

1938లో పులుపుల వెంకటశివయ్య ద్వారా భారత కమ్యూనిస్టుపార్టీ సభ్యత్వాన్ని స్వీకరించిన వేములపల్లి శ్రీకృష్ణకు అరసంజిల్లా శాఖ, గుంటూరులో 28-11-1998న శివయ్య సాహితీ సత్కారాన్ని అందచేసి గౌరవించుకుంది. ఆ సభలో 'సాహిత్యం - రాజకీయం' అంశంపై శ్రీకృష్ణ శివయ్య స్మారకోపన్యాసం చేశారు. జులై 1999లో విశాలాంధ్ర ప్రచురణాలయం శ్రీకృష్ణ ప్రసంగవ్యాసాన్ని పుస్తకంగా వెలువరించింది. విలువైన ఆ ప్రసంగంలో ప్రజాతంత్ర, ప్రగతిశీల, విప్లవ రచయితల ఐక్యతను శ్రీకృష్ణ ఆకాంక్షించారు.''రాజకీయాలవల్ల సాహిత్యం ప్రభవిస్తే సాహిత్యం రాజకీయాలను మలుపు తిప్పగలి గింది. సాహిత్యం-సమకాలీన ప్రజాజీవితం ఒకదాని కొకటి పెనవేసుకునే వుంటాయి. రాజకీయాలు- సాహిత్యప్రక్రియలు ఈ రెండింటి పరిధి చాలా విశాలమ యింది. ఎల్లలు నిర్ణయించటం అంత తేలికగాదు. రెండూ మానవ జీవితంతో ముడిపడి వున్నాయి. జీవిత వైవిధ్యానికి ప్రతిబింబాలు.'విశ్వశ్రేయ: కావ్యం' అన్న నానుడి అందరికీ తెలుసు. విశ్వశ్రేయస్సుకు ఆరాటం సాహిత్యం చేస్తే; పోరాటం రాజకీయం చేస్తుంది. సృజనా త్మకతసాహిత్యం- క్రియాశీల రాజకీయం అనేజోడు గుర్రాల మీద సమాజ పురోగమనం స్వారీ చేస్తుంది'' అని సాహిత్యం రాజకీయాల సమన్వయాన్ని గొప్పగా విశ్లేషించారు ఆ వ్యాసంలో డాక్టర్‌ పరుచూరి రాజారామ్‌ అధ్యక్షతన జరిగిన ఆ సభలో బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ సత్కారాన్ని శ్రీకృష్ణకు ప్రదానం చేశారు. శ్రీకృష్ణ, పులుపుల శివయ్య గేయాలకు తన గానశక్తితో ఎనలేని ప్రాచుర్యాన్ని, ఖ్యాతిని ఆర్జించిపెట్టిన ప్రజాగాయకుడు బొడ్డు గోపాలంను శ్రీకృష్ణ తనచేతుల మీదుగా అరసం పక్షాన సత్కరించారు. గోపాలం చేయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, పలనాడు వెలలేని మాగాణిరా గేయాలను ఆలపించడం ఒక విశేషం. ఆ సభ ఒక చారిత్రక సాహిత్యఘటన.

శ్రీకృష్ణ 1917లో గుంటూరుజిల్లా రేపల్లె తాలూకా బేతపూడి గ్రామంలో జన్మించారు.1948లో గుంటూరు జిల్లా కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శిగా ఎన్నికైనారు. పార్టీలో పలుపదవులను రాష్ట్ర, జాతీయస్థాయిలో చేపట్టారు. 1952లో బాపట్లనుండి, 1962, 1972లలో మంగ ళగిరి నుండి శాసనసభకు ఎన్నికైనారు.1972లో శాసన సభలో ప్రతిపక్షనా యకుడిగా వ్యవహరించారు. 2000 ఏప్రిల్‌8న హైదరాబాద్‌లో అమరులైనారు.

''మనసులోని అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పటం అలవర్చుకోండి. ప్రజల దైనందిన సమస్యలు తీసుకొని వారితో సాన్నిహిత్యం పెంచుకోండి. చెప్పే మాటలకూ,చేసే పనులకూ దూరంపెరిగే కొద్దీ నీకు ప్రజలు దూరమవుతారు.సిద్ధాంతం పరిజ్ఞానంతోపాటు వాస్తవ పరిస్థితుల అధ్యయనం అవసరం. నీతినిజాయి తీల్లో నికార్సయిన వాళ్ళని కమ్యూనిస్టులకున్న ప్రతిష్టను నిలబెట్టండి'' (స్వాతంత్య్రసమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు, సంపాదకుడు పరకాల పట్టాభిరామారావు, విశాలాంధ్ర ప్రచురణ - జనవరి 2000) అని తన స్వీయ అనుభవాలనుండి యువతరానికి సందేశమిచ్చిన శ్రీకృష్ణ అభ్యుదయ సాహిత్యోద్యమంలో, ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒక విశిష్ట అధ్యాయం, ఎన్నటికీ వన్నె తరగని ఆణిముత్యం. చేయ్యెత్తి జైకొట్టిన తెలుగుతేజం.

పెనుగొండ లక్ష్మీనారాయణ



Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు