సిమ్మన్న 1-3-1955లో శ్రీకాకుళంజిల్లా ''తిమడాం'' గ్రామంలో జన్మించారు. తల్లిదం డ్రులు ఆరుద్రమ్మ, డాక్టర్ కృష్ణమూర్తి. స్వగ్రామం లో ప్రాథమిక విద్య, నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్‌మీడియెట్, పై చదువు విజయనగరం మహారాజ కళాశాలలో సాగాయి. ఎంఏ తెలుగు ఆంధ్ర విశ్వవిద్యాల యంలో చదివారు. పి.హెచ్.డి.చేసి పరిశోధన ప్రారంభించారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో అధ్యాపక వృత్తిని చేపట్టారు.
సంస్కృతం, హిందీ, తమిళం, ఉర్దూ, లింగ్విస్టిక్స్, ట్రాన్స్‌లేషన్, ఫంక్షనల్ ఇంగ్లీషులో డిప్లొమాలు పొందారు. బహుగ్రంథకర్త, భాషకు సంబంధించిన గ్రంథాలు పందొమ్మిది, సాహిత్య విమర్శ గ్రంథాలు పదహారు, ముద్రిత పరిశోధనా వ్యాసాలు రెండు వందల ముప్పై. అముద్రిత పరిశోధన గ్రంథాలు పదిహేను. ఈ రచనలే గాక అరవైకిపైగా సెమినార్లలో పాల్గొన్నారు. రేడియో ప్రసంగాలు నలభైకి పైగానే చేశారు. ఇప్పటికీ ఈయన దగ్గర ఎంఫిల్ పదిహేనుమంది చేశారు. పిహెచ్‌డి చేసినవారు ఆరుగురు. ప్రస్తుతం ఎంఫిల్ పదహారు మంది, పిహెచ్‌డి పదిమంది చేస్తున్నారు. వీరి హోదాలు మెంబర్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆంధ్ర లయోలా కాలేజి విజయవాడ, జె.యం.జె. కాలేజి-తెనాలి, కళ్లికోటకాలేజి బరంహంపూర్, మహారాజా కాలేజి-విజయనగరం సెయింట్ జోసఫ్ ఉమన్స్ కాలేజి, విశాఖపట్నం -ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం, గుంటూరు, సిద్ధార్థ కాలేజి- విజయవాడ, ఉస్మానియా విశ్వవిద్యాలయం- హైదరాబాద్.
ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి 1985లో రఘుపతి వెంకటరత్నం నాయుడు బెస్ట్ థీసెస్‌కు 1995లో అదే విశ్వవిద్యాలయం నుండి బెస్ట్ రిసెర్చర్, 2008లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ బెస్ట్ ఎకడమీషియన్ అవార్డులు లభించాయి. రివార్డులు పది సంస్థల నుండి అందుకొన్నారు. ఇక సన్మానాలు,సత్కారాలు నలభైఆరుచోట్ల సాంస్కృతిక సమాఖ్యలు, కళాశాలల నుండి పొందారు. విశాఖపట్నంలోని దళిత సాహిత్య పీఠానికి అధ్యక్షులుగా, రెండో అంతర్జాతీయ టీచర్స్ కాన్ఫరెన్స్‌కు కార్యదర్శిగా, అధికార భాషా సంఘ సభ్యులుగా ఉన్నారు. అభిరుచి మాత్రం బోధన, పరిశోధన.
వెలమల 'తెలుగుభాషా చరిత్ర', 'సాహిత్య విమర్శ'పైన గ్రంథాలు వారి పాండితీ ప్రకర్షకు నికష్రాఫలం.''తెలుగుసాహిత్య విమర్శ సిద్ధాం తాలు'' అను గ్రంథాన్ని రచించారు. అది తెలుగు సాహిత్య విమర్శకు 'కలికితురాయి'. డాక్టర్ సిమ్మన్న చెప్పదలచిన విషయాన్ని నిర్మొహ మాటంగా చెప్పేస్తారు. అందులో సణు గుడు మాటలుండవు. అధ్యాపకానుభవంతో సరళశైలిలో సాహిత్య విమర్శ చేశారు. ఈ విమర్శన విషయాన్ని నలభైఆరు విభాగాలుగా విభజిం చారు. విమర్శ నిర్వచనంతో ప్రారంభిం చారు. ప్రాచ్య పాశ్చాత్య విమర్శకుల నిర్వచనాలను పాఠకుల ముందుంచారు. ఇటు ఆంధ్ర పండితులు, అటు ఆంగ్లేయుల నిర్వచనాలిచ్చారు. 'విమర్శ ఒక సాహిత్య ప్రక్రియ. ఈ ప్రక్రియ ఇతర ప్రక్రియ ల్లాంటిదికాదు. దీనికొక ప్రత్యేకత ఉంది. ఇతర ప్రక్రియల్లాగ ఇది సృజనాత్మక ప్రక్రియ కాదు. సాహిత్యంలో సృజనాత్మకత ప్రక్రియల్ని ఆధారం చేసుకొని వచ్చిన ప్రముఖ ప్రక్రియ విమర్శ' అని తన అభిప్రాయాన్ని రచయిత చెప్పారు.
''భారతీయకావ్య సిద్ధాంతాల్లో ప్రప్రథమ మైంది రససిద్ధాంతం. కావ్యానికి ఆత్మఏది అనే విషయం ప్రాచ్య అలంకారికులు శతాబ్దాలు తరబడి ఎన్నెన్నోచర్చలు చేశారు. వీటిలో ప్రధాన మైన సిద్ధాంతాలు ఆరు ఉన్నాయి. అవి రసం, అలంకారం, రీతి, ధ్వని, వక్రోక్తి, ఔచిత్యం. ఈ ఆరింటిలో రససిద్ధాంతమే ఉత్తమమైనదిగా అలం కారికులు నిర్థారించార''ని ఆచార్యులమాట. కావ్యా నికి రసం, ధ్వని ప్రధానమైనవి. వీటి విషయమై అలంకారికులు సుదీర్ఘమైన చర్చలు జరిపారు. దాని కనుగుణంగా సిమ్మన్న రసం అంటే ఏమిటి? దీని కర్తవ్యం ఏమిటి? అనే విషయాన్ని చెప్పారు. అలంకారికులు చర్చించిన విషయ పర్యవసానాన్ని సంబోధకంగా వివరించారు. ఆధునికుల రస సిద్ధాంతాన్ని, ధ్వనిసిద్ధాంతాన్ని లోతుగా పరి శీలించి ఆయా అలంకారికుల అభిప్రాయాలను అంగీకరించారు. రచయిత స్వశక్తి ప్రతిపదంలో ద్యోతకమవుతూనే ఉంది. ఈ రెంటినీ వివరించా లంటే రచయితకు ప్రతిభ ఉండాలి. ఆ ప్రతిభ సిమ్మన్నలో ఉంది. గనుక ఆయా విషయాలను శాస్త్రీయంగా నిరూపించి, తెలుగు విద్యార్థులకు అధ్యయన మార్గాన్ని సులభం చేశారు.
''తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు'' ఆధునికంగా విప్పారుతున్న హేతువాదం, అభ్యు దయ సాహిత్యం, దిగంబరకవిత్వం, చేతనావర్త విమర్శ మొదలైన వాటిని గూర్చి వెలమల వివరించారు.
''తెలుగు భాషా చరిత్ర'', ''ఆధునిక భాషా శాస్త్రం'' గ్రంథాలు రచించారు. ఇవి తెలుగు విద్యార్థులకు ప్రత్యేకింపబడ్డాయి. భాషాచరిత్ర ఒక శాస్త్రం. శాస్త్ర విషయాలను శాస్త్రీయంగానే చెప్పాలి. ఈ 'తెలుగు భాషా చరిత్ర'లో నలభైఆరు అంశాలను గూర్చి సుదీర్ఘంగా చెప్పారు. భారతీయ భాషలు అను అంశంతో ప్రారంభమై బోధనాభాష గా తెలుగు అను అంశంతో ముగింపు చేశారు. ప్రపంచ భాషా కుటుంబాలు, వాటి వర్గీకరణ మేప్ పాయింట్ ద్వారా తెలియచేశారు. విద్యార్థి అవగాహనకిది సులభమార్గం, ఏయే భాషా కుటుంబం నుండి ఏయే భాషలు పుట్టాయి. ఆయా భాషలు మాట్లాడే ప్రజలు, జనాభా, భౌగోళిక స్వరూపాన్ని వివరించారు. ఈ విధంగా వివరించి చెప్పటం చేత విద్యార్థి అవలీలగా అర్థం చేసుకొం టారు. విషయ వివరణ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఉపయోగం కలుగుతుంది.
''ఆధునిక భాషాశాస్త్రం'' భాషా చరిత్ర కంటె కాస్త భిన్నంగా ఉంటుంది.
ఆధునిక భాషాశాస్త్రంలో పదహారు చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్‌ను ఒక గ్రంథంగానే పరిగణించవచ్చు. అంటే అంత విషయాన్ని తెలుగు భాషీయులకందించారు. ' ఈ భాష ఎప్పుడెక్కడ ఎలా పుట్టింది, అనే విషయంలో ఆధారాలు లేవు. భాషాశాస్త్రంలో ఈ విషయాన్ని గూర్చి అనేక పరి శోధనలు జరిగాయి. వాదోపవాదాలు చోటుచేసు కొన్నాయి. ఈ పరిశోధనలు, వాదోపవాదాలు ఊహలకే పరిమితమయ్యాయి. అందుచేతనే భాషా శాస్త్రంలో వచ్చిన వాదాలను ఎక్కువమంది భాషా శాస్త్ర వేత్తలు అంగీకరించలేదు. కాబట్టి ఈ సమస్య సమస్యగానేమిగిలిపోయింద''ని అంటారు సిమ్మన్న.
భాషల వర్గీకరణ ఆయా భాషల్లో ఉండే పదాలపోలికలు, అర్థాలు, పలుకుబడులు దృష్టిలో ఉంచుకొని విభజించడం జరిగింది. లిపి లేకుండా కేవలం వాగ్రూపంలో ఉండే భాషలు కొండ ప్రాంతాల జనుల నోళ్ళలో నానుతున్నాయి. కొందరు భాషాశాస్త్రవేత్తలు పరిశోధన నిమిత్తమై కొండ ప్రాంతాలకు వెళ్ళి వారితో సఖ్యం చేస్తూ భాషాపదాలు సేకరించి ఏయే పదాలను ఏ సందర్భంలో వాడతారో తెలుసుకుని ఆయా జాతి జనుల భాషను గూర్చి గ్రంథాలు వ్రాస్తున్నారు. ఇది అపూర్వ విషయం. మరుగునపడ్డ భాషలకు భాషాశాస్త్రవేత్తలు సహాయ సహకారాలంది స్తున్నారు. ఈ గ్రంథంలో ఐదు, ఆరు అంశాలయిన భాషాశాస్త్రవేత్తల కృషిని వివరించారు. ఇందులో భారతీయ భాషా శాస్త్రవేత్తలు - పాశ్చాత్య భాషా శాస్త్రవేత్తలు అని విడివిడిగా వారిని గూర్చి చెప్పారు. మనకు లభించిన గ్రంథాలను బట్టి మన వారు భాషాశాస్త్రంపై అత్యధికంగా పరిశోధనలు చేశారు. దానివల్ల ''భారతదేశంలోని సంస్కృ తాంధ్ర, ద్రావిడభాషల ద్వారా ఆధునిక భాషా శాస్త్రానికి పునాదులేర్పడ్డా''యని గ్రంథకర్త పేర్కొంటున్నారు.
మన శరీరంలో ఉన్న వాగుత్పత్తి అవయ వాల స్పందనే ధ్వని. మాటలు మాట్లాడాలంటే శరీరంలోని అవయవాలకు పని కల్పించినపుడే సాధ్యమవుతుంది. దంతాలు, పెదవులు, నాలుక, తాలువు మొదలగు వానియొక్క స్పర్శతో దంత్యా లు, తాలవ్యాలు, ఓష్ట్యాలు, ఊష్పాలు, అనునాశి కాలు పలుకుతున్నాం. మనం ఉచ్ఛరించే అక్షరాల ఉత్పత్తిని బట్టి ఆ పేర్లు పెట్టారు. ఇందులో తొమ్మిది, పది, పదకొండు,పన్నెండు విభాగాలు ధ్వనికి సంబంధించినవే. వీటిని విద్యార్థికి బోధిం చాలంటే కష్టంగానే ఉంటుంది. బోధకుడు చెప్పే ప్రతివిషయాన్ని ఆకళింపు చేసుకొంటేనేగాని విద్యా ర్థులకర్థం కాదు. అలాంటి భాషాశాస్త్రం కొరకరాని కొయ్యే. అయినా సిమ్మన్న అలవోకగా చెప్పారు.
ఆచార్య వెలమల సిమ్మన్న అకుంఠిత దీక్షతో అశేష కావ్యాధ్యయనం చేశారు. అవిరళకృషితో పరిశోధనలు ప్రారంభించారు. అమూల్య గ్రంథా లను వెలువరించారు. అందరికి అందుబాటులోకి తెచ్చారు.
-గెల్లి రామమోహనరావు
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
