శ్రీశ్రీ అనంతుడు !

Sun, 6 Dec 2009, IST    vv

కార్మికుడి కండ కరిగిన చోట

శ్రామికుడి చెమట ప్రవహించిన చోట

గజ్జికుక్క కుయ్యోమన్న చోట

ముదుసలి బిచ్చగత్తె మొర్రో అన్నచోట

బాధఆర్తరావమై పోయిన చోట

శ్రీశ్రీ సాక్షమౌతుంటాడు!

అక్షరం ఆయుధమైన చోట

పిడుగు పెన్నై పోయిన చోట

పలుకు పలుగై పోయిన చోట

కవిత మెరుపై పోయిన చోట

విప్లవం పిడికిలై పోయిన చోట

శ్రీశ్రీ దర్శనం యిస్తుంటాడు!

లేడిపిల్ల పంజా విసిరినప్పుడు

పులి నెత్తురు ప్రవాహమైనప్పుడు

మనసు తిరగబడినప్పుడు

చిమ్నీ చావుకేక వేసినప్పుడు

శ్రామిక విజయం సంగీతమైనప్పుడు

శ్రీశ్రీగేయం వినిపిస్తుంటాడు

ఆవేశం అనంతమైనప్పుడు

చైతన్యం ఖడ్గం సృష్టించినప్పుడు

కార్మికుడు మరో ప్రపంచసైనికుడై

వజ్రాయుధం చేబూనినప్పుడు

శ్రీశ్రీ ఊపిరి వేణువు ఊదుతుంటాడు

బానిస సంకెల లంకెలు తెగినవేళ

శ్రీశ్రీ ఒక విప్లవగీత కాహళి

శ్రామిక విజయం కేతనమైన వేళ

శ్రీశ్రీ చైతన్య కవితా ప్రభంజనావళి

అక్షరం బ్రతికినన్నాళ్ళు

శ్రీశ్రీ అజరుడు అమరుడు అనంతుడు!

-గుర్రాల రమణయ్య


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు