తెలుగులో దళిత నవలలు

Sun, 13 Dec 2009, IST    vv

తెలుగు సాహిత్యంలో దళిత నవలకున్న స్థానం తక్కువదేమీ కాదు. రాశిరీత్యా తక్కువగా ఉన్నా, వాసి రీత్యా చెప్పుకోదగ్గ స్థాయి ఉన్న నవలలు మనకున్నాయి.

అప్పట్లో తెలుగులో వచ్చిన నవలల్లో- ఆచార వ్యవహా రాలు తెలిపేవిగా, మూఢ విశ్వాసాల్ని, దురాచారాల్ని, హేతు వాద దృష్టితో ఖండించేవిగా, సంఘంలో ఉత్పన్నమయ్యే వర్గ సంఘర్షణల్ని తెలిపేవి ఎక్కువగా వచ్చాయి. అందులో భాగం గానే దళిత స్పృహలో అంటరానితనాన్నీ కొంచెంగానో, పూర్తి గానో వర్ణించిన నవలలు మనసాహిత్యంలో అక్కడక్కడా చోటు చేసుకున్నాయి.

1872వ సం||లో నరహరి గోపాలకృష్ణమశెట్టి రాసిన శ్రీరంగరాజు చరిత్ర అన్న నవలలో దళితుల గురించి చర్చ కొంత వరకూ మనకు కనిపిస్తుంది.

1877-78 ప్రాంతాల్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించిన రాజశేఖర చరిత్రలో కూడా దళితుల స్థితిగతుల్ని వివరించడం జరిగింది.

1913లో తల్లాప్రగడ సూర్యనారాయణరావు హేలావతి నవలలోనూ దళితుల ప్రస్తావన ఉన్నది. ఇకపోతే 1922లో ఆనాటి రాజకీయ వాతావరణాన్ని గాంధీగారి ఆశయాల్నీ ఆనాటి సాంఘిక దురాచారాన్నీ చర్చిస్తూ వెలువడిన మొదటి సామాజిక నవల 'మాలపల్లి'. దీన్ని రచించినది ఉన్నవ లక్ష్మీ నారాయణ. 'ఈ నవలకు' 'సంఘవిజయమ'ని మరో పేరు కూడా ఉన్నది.

1936లో ఎన్‌జీ రంగా 'హరిజన నాయకుడు' అన్న నవలరాశారు. 1946 లో అడవిబాపిరాజు 'వరుడు' అన్న నవలరాశారు.

పైన తెలిపిన నవలలన్నింటిలోనూ ఒకటీ, అరా దళిత పాత్రలు ఉన్నాయి. వాటి నేపథ్యంలో జాతీయోద్యమమో, గాంధీ వాదమో, ఉదార ప్రజాస్వామిక భావాలో, మధ్యతరగతి కాల్ప నిక ఆదర్శాలలో తప్ప నిజంగా దళిత చైతన్యమని చెప్పగలిగినది ఏదీలేదు.

1962-78 మధ్య వచ్చిన దళిత స్పృహ నవలలు

1962లో రంగనాయకమ్మరాసిన 'బలిపీఠం' నవలలో ఆనాటి వర్ణవ్యవస్థనీ, స్త్రీకి స్వేచ్ఛ ఉండాలనే విషయాన్ని చాలా బలంగా చెప్పడం జరిగింది.

1965లో మహీధర 'కొల్లాయి కట్టితేనేమి' నవలా, 1970లోని దాశరథి రంగాచార్య 'చిల్లరదేవుళ్లూ' 'శరతల్పం' నవలలూ, 1970లో డా||కేశవరెడ్డి రాసిన 'బానిసలు' , 'ఇన్‌క్రెడబుల్‌ గాడెస్‌', 'స్మశానందున్నేరు', 'రాముడుండాడు రాజ్జేముండాది' నవలలూ, ఎన్‌ఆర్‌నంది నవల, నైమిశారణ్యం' నవలల్లో అగ్రవర్గాణాల ఆధిపత్యం కింద నలిగి పోతూ ఉన్న దళితుల జీవితాలను దయనీయంగా చిత్రించడం జరిగింది.

పైన వివరించిన తొలితరం దళిత నవలల్లో దళితులపై సాగే సాంఘిక, ఆర్థిక వివక్షల్ని ఇంకా ఎన్నో విషయాలను మనముందు ఉంచుతాయి. వీటి గురించి చర్చలూ, వాదోప వాదాలూ చాలానే జరిగాయి. ఎన్నో సిద్ధాంత గ్రంథాలు కూడా వెలువడ్డాయి. కానీ, 1980 నుంచి వచ్చిన దళిత నవలలపై పెద్ద చర్చ జరగనే లేదు. వాటిపై కూడా చర్చ జరగాల్సిన అవసరముంది.

దళిత నవల వికాసదశ 1980 - 2003

నిజానికి తెలుగు సమాజంలో దళితుల ఆత్మగౌరవ చైతన్యా నికి స్థానం దొరకడానికి కారంచెడు హత్యాకాండ దాకా అవకా శం దొరకలేదు. కాబట్టి తెలుగునవలా చరిత్రలో దాన్ని వెతకడం సాధ్యం కాదనే చెప్పాలి.

కారంచేడు హత్యాకాండ తర్వాత తెలుగు సాహిత్యంలో వికసించిన దళిత సాహిత్యం అటు కవిత్వంలోనూ, ఇటు విమర్శలోనూ చేసిన కృషి-దళిత జీవితాన్ని మరింత సమగ్రంగా చిత్రించేకథ, నవల ప్రక్రియల్లో కావలసినంతగా రాకపోవడం సాహితీ విమర్శకులు, సాహితీవేత్తలు గమనించినదే.

జీవితాన్ని అద్భుతంగా చిత్రించగలిగిన నవలా ప్రక్రియ దళిత సాహిత్యోద్యమంలోకి ప్రవేశించనేలేదు.

ఇప్పటికి దళిత స్పృహ ఉన్న నవలలు ఇరవయి అయిదుకు పైగానే వచ్చాయి. ఈ నవలల్లో గత శతాబ్దంలోని దళిత జీవన స్ధితిగతుల్ని, అంటరానితనాన్ని, దళితులు, క్రైస్తవులుగా మార డాన్నీ, కారంచేడు, చుండూరు, వేంపెంటలలో జరిగిన సంఘటనలన్నీ, దళిత సమస్యల్నీ చిత్రించాయి. వాటి గురించి కొంచెం వివరంగా చూద్దాం.

1981లో అక్కినేని కుటుంబరావుగారు రాసిన 'సొరాజ్జెం' నవల. ఇది 1947-1980కి మధ్యకాలంలోని దళిత/గ్రామీణ జీవితాన్ని విశ్లేషిస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో, దళితులు అనుభవించిన బాధల్నీ, ఆవేదనల్ని ఈసడింపుల్నీ అర్థంచేసుకోవడానికి సొరాజ్జెం నవల ఉపకరిస్తుంది. ఈ నవలలో స్వాతంత్య్ర ఉద్యమం గురించే కాకుండా దళిత సమ స్యల్ని కూడా చర్చకు పెడతాడు రచయిత. ఇందులో గ్రామీణ భూస్వామ్య వ్యవస్థ, అగ్రవర్ణాల ఆధిపత్యం దళితుల కుటుంబ, సామాజిక సంబంధాల మధ్య ఘర్షణలు వివరించబడినాయి. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కాలంలో దళితుల ఆవేదనలను ఈ నవల ఎంతోబాగా వివరించింది.

1980-82 మధ్యకాలంలో జి.మోహనరావుగారు 'స్పార్టకస్‌' కలం పేరుతో 'ఖాకీ బతుకు' నవల రాశారు. మనిషిలో ఉన్న విశిష్టమైన గుణం కన్నా కులమే గొప్ప అన్న నెపంతో ఒక పోలీసుకానిస్టేబుల్‌ను నిరంతరం పెనుభూతమై వెంటాడటం, అతను అనుక్షణం పీడింపబడటం ఈ నవల విశ్లేషిస్తుంది. ఎంతటి సంపన్నులయినా, ఏప్రాంతంలోనయినా కులప్రస్తావన వచ్చేటప్పటికి దళితుల్ని వేరుగా చూస్తారన్న విషయాన్ని ఈ నవల విశదీకరిస్తుంది.

ఈ నవలలో ప్రధానపాత్ర 'ప్రకాశం'. అతను తక్కువ చదువుకుని ఉంటాడు. పోలీసుశాఖలో ఉద్యోగం వస్తుంది. ప్రకాశం దళితుడు అవటం వల్ల పై అధికారుల దగ్గర నుండి క్రిందిస్థాయి ఉద్యోగుల వరకు, కులం పేరుతో అణిచివేస్తున్న సత్యాలను ఈ నవల తెలియజేస్తుంది. రచయిత ఆ నవల రాసినందుకు అతన్ని శాఖాపరమైన ఎన్ని ఇబ్బందులకు గురిచేశారో ఆ మధ్య పేపర్లో కూడా వచ్చింది.

1987లో 'అద్దంలో చందమామ' ఈ నవల నేను రాసింది. దళితుల ఉద్ధరణే ధ్యేయంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలూ, చేసిన చట్టాలు అమలులో ఎంత నిరుపయోగమవు తున్నాయో మనం నిత్యజీవితంలో చూస్తూనే ఉన్నాం. భూసంస్క రణల చట్టం 'తెలుగు మాగాణి సమారాధన' పేరుతో (అనం తపురం జిల్లాలో ఉరవకొండ తాలూకాలో జరిగినది) జరిగింది. ఇదొక ఫార్స్‌గా మిగిలిపోవడాన్ని ఈ నవలలో మనం చూస్తాం. ఇందులో ఒక పక్క ఆర్థికంగానూ, రాజకీయంగానూ., సామా జికంగానూ దళితుల అణిచివేతను చూపిస్తూనే మరోవైపు దళిత కుటుంబాల జీవనచిత్రణ చూపిస్తుంది 'అద్దంలో చందమామ'.

దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, చట్టాలు కాగితాలకు పరిమితమవుతాయి. పైగా ప్రభుత్వ యంత్రాంగం అంతా భూస్వాముల చేతిలోనే ఉంటుంది. ఇలా ఉన్నన్ని నాళ్ళూ సామాన్యులకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. 'అద్దంలో చందమామ' నవలలో దళితులు చదువుకుంటున్నారని ఆ ఊర్లో ఉన్న హైస్కూల్‌ని కూడా లేకుండా చేస్తారు. భూస్వాముల నుండి ల్యాండ్‌ సీలింగ్‌ కింద భూమిని తీసుకుని దళితులకి ఇస్తారు. అయితే ఒక్క దళితుడు కూడా ఆ భూమిని పొందడు. అనుభవించడు. బినామీ పేర్లతో భూస్వాములే సాగుచేసు కుంటూ ఉంటారు. ఆ భూములు సాగుచేసుకోవాలని దళితులు పోరాడతారు. దాంతో పెద్ద గొడవలే జరుగుతాయి. పోలీసు, రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లు దళితులకు సాయపడక పోగా పరోక్షంగా భూస్వాముల కొమ్ముకాయడం జరుగుతుంది. తరాల అణిచివేతల మధ్య దాగివున్న భయం వల్ల అగ్రవర్ణాల వారిని ఎదుర్కొనే ధైర్యంలేక యధావిధిగా దళితులు తిరిగి కూలిపనికి పోవడం జరుగుతుంది. ఈవిధంగా అగ్రవర్ణాల పెత్తనాన్ని, ప్రభుత్వ వైఫల్యాల్నీ, దళితుల యథాతథ స్థానంలో ఉంచే ఘట్టాలను 'అద్దంలో చందమామ' మనముందు ఉంచుతుంది.

1989లో ఓల్గాగారి 'ఆకాశంలో సగం' అన్న నవల రాశారు. 1990లో అది ప్రచురించబడింది. ఈ నవలలో దళితుల సమస్యలనే కాక పురుషాధిక్యత మీద, సమాజంలో ఉన్న 'జండర్‌' విధానం మీదకూడా చర్చ జరిగింది. మొత్తంమీద అగ్రవర్ణాలవారు దళితుల్ని అణిచివేస్తూ వారు పొందే రాక్షసా నందాన్ని దీనికి పరిష్కారంగా మార్క్స్‌, అంబేద్కర్‌లు అందించిన విప్లవ స్ఫూర్తితో అణిచివేయబడుతున్న వారిని ఏకం చేసి, విజయాల్ని సాధించిన విధానాన్ని 'ఆకాశంలో సగం' నవల చూపిస్తుంది. 1997లో కాలువ మల్లయ్యగారు రాసిన 'నీ బాంచెన్‌ కాల్మొక్తా' నవల యాభయి సంవత్సరాల దళితుల జీవన పరిణా మాల చక్రాన్ని వివరిస్తుంది.

తెలంగాణ యాసతో, ఆ సంస్కృతిలోనే నడిచే ఈ నవల స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల నాటితో ప్రారంభమవుతుంది. ఆ ''ఊరి దొర కొట్టంలో ఒక గేదె చచ్చిపోతే, దానిని తీసుకొని పొయ్యేదానికి మాదిగలు కొంత ఆలస్యం చేశారని అగ్రవర్ణాల వారు బండబూతులు తిడతారు. దాన్ని మారయ్య కొడుకు కొంరయ్య ''మీ గొడ్డులను మీరే ఈడ్చి పారేయొచ్చు కదా!' అనంటాడు. ఇది దళిత చైతన్యానికి ప్రతీకగా రచయిత చూపిస్తాడు. కొంరయ్యకు చదువుకోవాలని ఉన్నా అనుకోని పరిస్థితిలో దొర ఇంట్లో పాలేరుగా వెట్టిచాకిరి చేస్తుంటాడు. కాల్లో ముల్లు గుచ్చుకుని బాధపడుతూ ఉంటే పనికిరాలేదని దొర అతన్ని కొడతాడు, తిడతాడు. ఎన్ని విధాల ప్రాధేయపడినా వినడు. దళితులు అనుభవించే పీడనని ఎంతో హృద్యంగా వర్ణిస్తాడు రచయిత. 1997లోనే వచ్చిన మరో నవల 'కాడి'. దీని రచయిత సన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి. మారుతున్న జీవన సరళితో మారగలిగిననాడే జీవితంలో గెలుపుని చూడగలుగుతాడు అన్న విషయాన్ని తెలియజెప్పే నవల ఇది. ఈ నవల అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ''ఆటా 90' నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల.

గ్రామీణ జీవన విధానంలో దళితుల స్థితిగతులనూ, అగ్రవర్ణాల వారు దళితుల్ని ఏరీతిగా పావుల్లా ఉపయోగించు కుంటున్నారో అందుకు తీసిపోనీరీతిలో చర్చి ఫాదర్లు కూడా తమ విస్తరణకు దళితుల్ని ఏవిధంగా ఉపయోగించుకుం టున్నారో ఈ విషయాలన్నింటినీ 'కాడి' నవల వివరిస్తుంది.

ఈ నవలలో కొన్ని కొత్త విషయాలు చర్చకు వస్తాయి. అగ్రవర్ణాలవారు చెప్పుల దుకాణాలు తెరవడం ద్వారా మాదిగ వృత్తిని వ్యాపారంగా చేస్తుంటే, మాదిగలు కులవృత్తిని పక్కన పెట్టి సేద్యాన్ని చేస్తూ రైతులుగా మారుతున్న విధానాన్ని వివరి స్తుంది. మాల, మాదిగలు ఏబిసిడీలుగా వర్గికరించబడుతున్న వైనాన్ని, అది అగ్రవర్ణాల వారికి, ఏరకంగా కలిసి వస్తుందనే విషయాన్ని చూపిస్తుంది. పంటలు పండక రైతులు పట్టణాలకి వలసపో తున్న తీరూ, పాత్రికేయులు దళిత సమస్యల్ని రాయ కుండా ఉండే తీరూ ఒకవైపు చూపుతూనే యాభై సంవత్సరాల గ్రామీణ ప్రాంత జనజీవన సంఘర్షణని 'కాడి' చూపిస్తుంది.

1997లోనే వచ్చిన మరో నవల 'పంచమం' ఇది నేను రాసిన నవలే. ఈ నవల అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌- ఆటా 90 నవలల పోటీలో తృతీయ బహుమతి పొందినది.

ఒక దళిత యువకుడి జీవితంలో ఇంటర్మీడియెట్‌ రిజల్ట్స్‌ వచ్చినప్పటి నుండి అతను ఎపిపిఎస్సీ గ్రూప్‌ వన్‌ పరీక్షపాసయి ఆర్‌డిఓ అయీ, తన గ్రామానికీ, తన కులంలాంటి అణగారిన కులాలకీ మేలు చేయాలనుకుని భూస్వాముల కుట్రల్లో ఉద్యో గం పోగొట్టుకునే దాకా కథ సాగుతుంది. దీనికి సమాంతరంగా సరిగ్గా నవల ప్రారంభంలో భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న మిగులు భూమిని భూమిలేని పేదలకు పంపిణీ చేస్తామనే ప్రకటనతో మొదలయి నవల ముగింపులో ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుని భూస్వామికి అప్పజెప్పుతు న్నామనే ప్రకటన దాకా సాగుతుంది కథ.

ఈ రెండు సమాంతర ప్రారంభాలకీ ముగింపులకీ మధ్య 1990ల తొలిరోజుల నుంచి అయిదారేళ్ళపాటూ తెలుగు సీమలో జరిగిన ఘటనలన్నింటి ప్రతిఫలనాలూ ఉంటాయి. చదువు పట్ల దళితుల్లో వ్యక్తమయ్యే ఆకాంక్షలూ, భూసంస్కరణల భాగోతం, భూమిలేని నిరుపేదల్లో ఎంతోకొంత భూమిని పొందాలనే తపన ఎస్‌సిలకు, బిసిలకీ మధ్య పోటీ పెట్టి పబ్బం గడుపుకోజూసే భూస్వామ్యనీతి, రెవెన్యూ శాఖ అవినీతి, దళితుల్లో సంఘటిత చైతన్యం కల్పించిన ఆత్మవిశ్వాసం, తెలుగు సమాజంలోనూ, సాహిత్యంలోనూ వికసించిన ప్రజాస్వామిక, ప్రగతి శీల ఆలోచనలూ, సమన్వయ ప్రేమ స్వప్నాల వంటి అనేకానేక అంశాలు కూడా నవలలో చిత్రణకు వస్తాయి.

1998లో నరసయ్యగారు రాసిన నవల 'మాదిగపల్లె' కోస్తా జిల్లాలలోని దళితుల జీవన స్థితిగతుల్ని వివరిస్తుంది. దళితుల మీద భూస్వామ్య అగ్రవర్ణాల వారి దౌర్జన్యాలూ, అత్యాచారాలూ, రిజర్వేషన్ల విభజన, మాదిక దండోరా ఉద్యమాలు మొదలైన ఎన్నో విషయాల్ని తెలియజేస్తుంది.

ఈ నవల దళిత సమస్యలకు కొన్ని మార్గాల్ని చూపిస్తుంది. దళిత సమస్యలను ఒక సామాజిక సమస్యగా చూపుతూనే ఈ సమస్య నుండీ, బాధల నుండీ బయట పడాలంటే మాలా, మాదిగలు ఐక్యంగా ఉండాలని బిసిలతో కలసి అగ్రవర్ణ భూస్వాముల మీద పోరాటం చేయాలనే తీరును వివరిస్తుంది.

2000 సం||లో జి.కళ్యాణరావుగారు రాసిన 'అంటరాని వసంతం' వచ్చింది. ఇది కోస్తా జిల్లాలోని ఒకటిన్నర దశాబ్దపు దళిత జీవన సరళిని విప్లవ చైతన్యంతో చిత్రీకరించిన నవల.

దీనికి ప్రధాన భూమిక ప్రకాశం జిల్లాలోని వెన్నెల దిన్నె అనే గ్రామం. దాని చుట్టూ వున్న పక్కిల దిన్నె, కోళ్ళదిన్నె, చింతల కుంట, దిబ్బలమిట్ట వంటి ప్రాంతాల చుట్టూ ఈ నవల సాగుతుంది. ఈ నవలలో కనిపించే ముఖ్య విషయాలు మాల,మాదిగల్ని అగ్రవర్ణాల వారు ఊర్లోకి రానియ్యకపోవడం, దళితులు తమ గోడుని, జానపదరూపాలుగా విన్నవించడం, మాల, మాదిగల్ని క్రైస్తవ మతం దగ్గరకు తీసుకోవడం, దళితులు విప్లవవీరులుగా మారుతున్న తీరు ఈ నవలలో మనకు కనిపిస్తుంది. దళితుల్లో ఆనాటి నుంచి ఈనాటిదాకా అంటే దాదాపు నూటయాభైఏళ్ళ పరిణామాన్ని ఈ నవల విశ్లేషిస్తుంది. సమాజం మారుతూ ఉంటుంది. కాలం మారుతూ ఉంటుంది. తరాలూమారుతూ ఉంటాయి. అయితే దళితులకు అంటరాని తనం వెనువెంటే ఉంటుంది. అందులో మాత్రం ఏమార్పూ ఉండదు అన్న విషయం తేటతెల్లం చేస్తుందీ. 'అంటరాని వసంతం'.

2000 సం||లోనే మరో దళిత నవల 'కక్క'. దీన్ని వేముల ఎల్లయ్య రాశారు. ఇందులో తరతరాలుగా అగ్రవర్ణాల వారు దళితుల్ని అణిచివేసేతీరుని అగ్రవర్ణ రాక్షసత్వం, కులసంఘర్షణ, వర్గ సమీకరణం చేసే సన్నివేశాలూ, దళితుల ఆచారాలు, పెళ్ళిళ్ళూ ఊరేగింపులు, జాతర్లూ, వీధిభాగోతాలూ మొదల యిన ఎన్నో విషయాల్ని నవలలో కళ్ళకు కడతాడు రచయిత.

పుట్ట మన్నుకోసం పోయిన దళితుల్ని అగ్రవర్ణాలవారు కొట్టి చంపడం, చేయని నేరాల్ని మోపి పోలీసు స్టేషన్లకి దళి తుల్ని పంపడం, ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లు దళితులకి తెలియకుండా అగ్రవర్ణాలవారే తీసుకుని, పెత్తనాన్ని చెలాయిం చడం, లైంగిక హింసలూ, అక్కడి వాళ్ళ జీవన చిత్రణలూ మొదలైనవన్నీ ఈ నవల విశ్లేషిస్తుంది.

2001 సం||లో రాయలసీమ నుంచి ఫ్యాక్షన్‌ రాజకీ యాలు, రాజకీయముఠాల నేపథ్యంలో ఒక మంచి నవల వచ్చింది. దాని పేరు 'నిప్పుల వాగు' ఈ నవలను రాసినది 'పినాకపాణిగారు'. ఇది ఫ్యాక్షన్‌ రాజకీయ ముఠాలకు వ్యతిరేకంగా దళిత ప్రజాస్వామ్య ఉద్యమాలను ప్రధానంగా చేసుకుని రాసిన నవల.

కర్నూలు జిల్లాలోని వేంపెంట సంఘటన నేపథ్యంలో సాగే నవల ఇది. గ్రామాలలో భూస్వామ్య పెత్తందారీతనాన్ని, వారి ఆధిపత్యాన్ని, వారి ఆదాయ మార్గాలనీ ప్రశ్నిస్తూ, భూస్వాములు, అట్టడుగు వర్గాల మధ్య తగాదాలు పెట్టి వారి ఐక్యతను విడదీసే ప్రయత్నాలూ, రాజకీయ దురాగతాలూ, ఇవన్నీ ఈ నవల విశ్లేషిస్తుంది. మాల, మాదిగల మధ్య ఉన్న వైరుధ్యాలతో అటు మాదిగదండోరా, ఇటు మాలమహానాడు ఉద్యమాలు ఎలా మొదలయ్యాయో సూచనప్రాయంగా తెలియ జెప్తుంది. దళితుల్ని అణిచివేసే తీరునూ, వాళ్ళు చైతన్యవంతులు కాకుండా భూస్వామ్య రాజకీయాలు అడ్డుపడుతున్న తీరునూ ఈ నవల మనకళ్ళముందు నిలుపుతుంది.

2001వ సంవత్సరంలోనే గోపరాజు నాగేశ్వరరావుగారు 'దండెం మీద చిలుకలు' అన్న నవల రచించారు. బడుగు, బలహీన వర్గాల్లో వస్తున్న మానసిక మార్పునీ, దానిశక్తి సామర్థ్యాలనీ విడమరచి చెప్పే నవలిది.

తరతరాలుగా వస్తున్న వర్ణ వ్యవస్థని కాలరాసి దాని విముక్తికి విప్లవమే శరణ్యమని వివరిస్తుంది. ఈ నవల కోస్తా మాండలికంలో ఉన్నది. ఇందులో భారతీయ శిక్షాస్మృతిలోని డొల్లతనాన్ని, అగ్రవర్ణాలు మాల, మాదిగల మధ్య గొడవలు పెట్టడం, వ్యవసాయరంగంలో ఆధునిక యంత్రాలురావడం వల్ల బడుగు, బలహీన వర్గాలకు కూలీ, నాలీ దొరక్క బతుకు పోరులో వారు పడే బాధలు మనముందుంచుతుంది. దళితుల్లోని మాల, మాదిగల్లో మాలలే ఎక్కువగా మేలు పొందుతున్నారని మాదిగలకి అన్యాయం జరుగుతోందన్న రచయిత ఆవేదన మనకి కనిపిస్తుంది.

ప్రభుత్వం ఇచ్చిన దళిత భూముల్ని ఆక్రమించుకున్న అగ్రవర్ణ దొరలను చూపి, వారి భూమిని వారు పొందడం వంటి విప్లవాత్మకమైన మార్పును సూచిస్తూ రచయిత నవలని ముగిస్తాడు. 2003వ సంవత్సరంలో మరో దళిత నవల వచ్చింది. అది 'కక్షశిల' దీన్ని నేనే రాశాను. రాయలసీమకు ప్రాతినిధ్యం వహించే సాయుధ ముఠాల ఫ్యాక్షన్‌ వాతావరణాన్ని చిత్రిస్తూ సాగుతుందీ కథ. ఈ నవలలో మానవ జీవన స్థితిగతులు, వ్యక్తిగత కక్షలతో నవల చివరిదాకా నడుస్తుంది. మరోవైపు దళిత జీవితాన్ని , అంటరానితనాన్ని, మాదిగ దండోరా, మాల మహానాడుల ఉద్యమాల నేపధ్యాన్ని ఈ నవలలో చూడవచ్చు.

రెండు వర్గాల మధ్య బలాబలాలు హింసాత్మక వాతావర ణంలో అగ్రవర్ణాల హింసలతో మాల, మాదిగల్ని భయపెట్టి పబ్బం గడుపుకుంటున్న తీరునూ, అడుగడుగునా, హింసా, ప్రతిహింసలతో ఒకరిపై ఒకరు కొత్త ఎత్తుగడలతో, రక్తతర్ప ణతో, బలిదానాల బాటలో క్షణక్షణం మృత్యువుతో సయ్యా టలుగా బడుగు వర్గాల మధ్య చోటుచేసుకున్న కక్షలూ ఇవన్నీ నవలలో చూపడం జరిగింది. ఫ్యాక్షనిస్టులకు దళితులు కవచాలుగానూ, ఆయుధాలగానూ ఎట్లా ఉపయోగపడతారో చర్చిస్తుంది ఈ నవల.

ఈవిధంగా 1980 నుంచి 2003 వరకూ వచ్చిన ఈ నవలల్లో, ప్రధానంగా దళితుల జీవన విధానాలను ఇతివృత్తాలుగా తీసుకున్న నవలలు వచ్చాయి. ఇప్పుడున్న దళితుల సమస్యల్ని చిత్రిస్తూ మరెన్నో నవలలు రావాల్సిన అవసరం ఉంది.

- చిలుకూరి దేవపుత్ర


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు