సామాజిక సమస్యలకు దర్పణం 'అంతస్సూత్రం'

Sun, 13 Dec 2009, IST    vv

నూతల పాటి రత్నశర్మ రచించిన సామాజిక సమస్యల దర్పణం 'అంతస్సూత్రం' వచన కవితా సంపుటి. శర్మ దశాబ్ధి కాలంగా పద్య కవిగా, వచన కవిగా, ఆధునిక కవితాలోకంలో సవ్యసాచిగా పురోగమిస్తున్నారు.

'అంతస్సూత్రం' 35 కవితల సమస్యల సమాహారం. కవితా ఖండికలన్నీ గతంలో పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఇందులో ప్రపంచీకరణ ప్రకంపనాలున్నాయి. ఉగ్రవాదంపై అధిక్షేపణలున్నాయి. బాలకార్మిక వ్యవస్థపై నిరసనలున్నాయి. భూకబ్జాదారుల ధనదాహంపై అధిక్షేపణలున్నాయి. ధరల పెరుగుదల, మత ప్రాతిపదిక రిజర్వేషన్లపై నిరసనలున్నాయి.

కవితాసంపుటి శీర్షిక అంతస్సూత్రంలో సమైక్య జీవన సూత్రాన్ని ప్రతిపాదిస్తూ ''సంస్కృతి సంప్రదాయాల అంతస్సూత్రంలో'' ఐక్యజీవనం గడుపుతుండటమే /భిన్న త్వంలో ఏకత్వం'' అని ఆవిష్కరించాడు. ఎన్నికల్లో కులాలకుం పట్లు రగిలించే నాయకులను గర్హించాడు.

ఈ సంపుటిలో ప్రపంచీకరణ ప్రభావంతో నిరసనకు నిలువెత్తు సాక్ష్యాలుగా 5 ఖండికలుఉన్నాయి. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రకృతి సౌందర్యానికి ఈ పట్టణ నాగరికత దూరమైందని, ప్రకృతికి దూరంగా ఖండికలో ''రోడ్‌సైడ్‌ పబ్‌లు/అత్యాధునిక విలాసాల కూడళ్ళు/స్టార్‌ హోటళ్ళు, విశ్వామిత్ర సృష్ట్టి/ఆత్మీయ పలకరింపుల కరస్పర్శలుండవు'' -కాలంతో పాటు పరుగు, పరుగుతోపాటు సంపాదనే లక్ష్యంగా సాగుతున్న వ్యవస్థను నిరసించాడు.

ప్రపంచీకరణ వల్ల సమైక్య భావం సమసి, సంకుచితత్వం ప్రబలిందని పండుగంటే శీర్షికలో ''ఎవడి వాకిలికి వాడే తోరణమై/వేలాడ టం తప్ప/ఇంటింటికో పండుగై మరింత ఎడం పెరుగుతుందని'' ఆవేదన వ్యక్త పరిచాడు. ప్రపంచీ కరణ రైతును దెబ్బ తీస్తుందని 'నత్తనడక' ఖండికలో ''దేశానికి వెన్నెముక రైతు/ ఎక్కడో విన్నట్టుంది మన మెతుకు మీద/ఆయన సంతకం చేస్తున్నమాట నిజమైనా/కదూ/ఆ మనకి మాత్రం కడుపు నిండటంలేదివ్వాళ'' అంటాడు. నీటి కరువు వల్ల, చేపల చెరువుల కబ్జాల వల్ల రైతులు బెంబేలెత్తి పురుగు మందులతో, ఉరితాళ్ళతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గర్హించాడు.

ప్రపంచీకరణ వల్ల మానవ సంబంధాలు క్షీణించిపోతున్న స్థితిని, స్వార్థంతో దిగజారిపోతున్న పరిస్థితిని నిరసించాడు. కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి పేగుబంధాలు తెంచుకు న్నందునే ఇన్ని వృద్ధాశ్రమాలు జీవంపోసుకుంటున్నాయని అధిక్షేపించాడు. డబ్బే చదువుకు పర్యాయపదంగా పుట్టుకొ స్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థల తీరును పరీక్ష ఖండికంలో నిరసించాడు.

'చేపల మార్కెట్‌ ఖండికలో చేపల హైటెక్‌ వ్యాపారం జాలరుల బ్రతుకు తెరువును దెబ్బతీసే స్థితిని ప్రకృతి సౌందర్య విధ్వంసాన్ని, పర్యావరణ పరిరక్షణాభ్యుతిని తీవ్రంగా అధిక్షేపించాడు. అంతులేని ధనదాహంతో భూకబ్జాలకు పాల్పడుతున్న వారిని 'భూదొంగలు' ఖండికలో ''భూమి మీద చాలదన్నట్లు /చంద్రుని మీద ప్లాట్లు కొంటున్న వాడి భూ దాహాన్ని కొలిచే సాధనం ఇంకా కనిపెట్టలేదు.'' అని తీవ్రంగా నిరసించాడు. గ్రామీణ వ్యవసాయ సంస్కృతిలో నవనాగరికత ప్రభావం వల్ల పొలం గట్లు రహదారుల మీద స్కూటర్లు ముచ్చటలాడుకొంటూ పరుగెడుతున్నాయని, కందిచేలలో సెల్‌ఫోన్లు ఊసులాడుకొంటున్నాయని ఆధిక్షేపించాడు.

పిల్లలు క్రికెట్‌ మోజులో చదువులు, పరీక్షలను నిర్లక్ష్యం చేస్తున్నారని పాపం పిల్లలు ఖండికలో గర్హించాడు. 'మసిబారిన బాల్యం' ఖండికలో ప్రభుత్వం బాల కార్మికవ్యవస్థ నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేయడంలేదని నిరసించాడు.

టి.వీ.ల్లో క్రికెట్‌ మోజులో, అర్ధనగ శృంగార భంగిమల చిత్రాల క్రేజులో రిమోట్‌ వదలక చదువులను అటకెక్కించే యువతను అధిక్షేపించాడు. టీ.వీని నిరసిస్తూ ''పాశ్చాత్య సంప్రదాయాల విషాన్ని/ఉగ్గుపాలతో అందిస్తున్న పెట్టె/ నిజంగా వినోదాల పెట్టె కాదు/అదొక ఇడియట్‌ బాక్స్‌/ దాని ముందు కూర్చునే మనమే నిజమైన ఇడియట్లం'' అన్న తీవ్ర మైన నిందారోపణ ఆలోచించదగినదే. మంచి కార్యక్రమాల కోసం టీ.వీ.ని వీక్షించే వాళ్లని కవి మినహాయిస్తే బావుండేది.

సమకాలీన సామాజిక సమస్యలను వాస్తవికతకు అద్దం పట్టే విధంగా చిత్రించిన కవి రత్నశర్మకు అభినందనలు. ఇందులో 'రక్షణ కంచె' భీకరదీర్ఘముసురు వంటి దుష్ట సమాసాలు దొర్లకుండా జాగ్రత్త పడితే బాగుండేది. ఆధునిక కవితా ప్రియులు విధిగా చదువదగిన వచన కవితా సంపుటి 'అంతస్సూత్రం' వెల రు. 35/-లు ప్రతులకు ఎన్‌.వి.రత్నశర్మ, జిల్లా పరిషత్‌ హైస్కూలు, దాచేపల్లి, గుంటూరుజిల్లా, చిరునామానుండి పొందవచ్చు.

-డా.పి.సుబ్బారావు


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు