ఓ సూరమ్మక్కో!
ఓచంద్రమ్మక్కో
ఇదేమి విపరీతం
ఈవిపత్తు మనకొచ్చే
మన బ్రతుకులు తెల్లవారె!
మనమేనేరం చేశామమ్మో! ||ఓ సూరమ్మక్కో...!||
కృష్ణాహంద్రీ కందూ
తుంగభద్ర నదులన్నీ
హఠాత్తుగా పొంగిపొరలి
ఊళ్లన్నీ ముంచేసెను
ఎందుకింత పగవాటికి
ఎందుకింత కసివాటికి ||ఓ సూరమ్మక్కో...!||
వరదపోటు తాకిడి మన-
ఊళ్లన్ని ఊడ్చిపెట్టె
కొంపపోయె గూడుపోయె
పంటపోయే పాడిపోయె
పశువులన్ని ప్రాణమొదలె
కాడిపోయె మేడిపోయె
గుడులూబడులూ మునిగెను
దాచిన గింజలు పోయెను
దరిద్రము దాపురించె
తిండిలేదుత్రాగేందుకు నీరులేదు
మనమెట్లా బ్రతకాలమ్మో ||ఓ సూరమ్మక్కో...!||
మట్టియేటతో గుడిసెలు
మురికి కూపములాయెను
మంచినీరు దొరకదాయె
మనదాహం ఎట్లు తీరునే? ||ఓ సూరమ్మక్కో...!||
వరద వలలో చిక్కిన మనం
ఉక్కిరి బిక్కిరిమైతిమి
చెట్లల్లో కంపల్లో యిరుక్కొని
ఊపిరిలొదలిన మనుషులు
ఉబ్బిన శవాలై దుర్వాసన కొడుతున్నవి
పచ్చని బ్రతుకుల మధ్యన
చిచ్చురగిలినట్లాయెను
కడుపునిండ తిండిగూడ
దొరకని దుస్థితివచ్చెను ||ఓ సూరమ్మక్కో...!||
పట్టపగలే నింగిలోన
చుక్కలు మొలిపించేలా
మాయమాటలెన్నో చెప్పి
గద్దెలనెక్కిన నేతలు
మొక్కుబడిగ ముఖాల్ చూపి
మళ్ళీకన్పించరాయె! ||ఓ సూరమ్మక్కో...!||
మనకు బాసటెవరొస్తారూ
మనకు సాయమెవరిస్తారూ
మనలనాదుకునేదెవ్వరూ?
కట్టూగుడ్డలతోడ
కడుదీనంగా మనముంటే
కనికరించువాడులేడు
పలకరించువాడులేడు
మనమెట్లా బ్రతకాలమ్మో
మనకు మంచి ఎప్పుడోయమ్మో? ||ఓ సూరమ్మక్కో...!||
- సువారపు రామచంద్రరావు
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
