మావోయిస్టు ప్రాంతాల్లో స్కూళ్ళు ధనార్జనకు నెలవులు

Mon, 4 Jul 2011, IST    aa
సుప్రియాశర్మ

(అవి హాజరు పట్టీలను ఎలా నింపాలో, ప్రభుత్వ నిధులను ఎలా కైంకర్యం చేయాలో నేర్పుతాయి)

''చిరునవ్వులు నేర్చుకో విరులనుండి గీతాలాపన నేర్చుకో తేనెటీగలనుండి''

జనాదరణ పొందిన ఈ హిందీ గీత చరణాలు దంతెవాడ జిల్లాలోని ఒక స్కూలు గోడమీది వాల్‌ పోస్టరు మీద కనుపించాయి. కాని అవి నిరుప యోగమే ననిపించింది. ఎందుకంటే అక్కడ రోషన్‌ కుమార్‌ కరషు అనే బక్కచిక్కిన గ్రేడు - 2

ఉపాధ్యాయుడు తప్ప మరో ప్రాణి కనపడలేదు. అది గుఫాది గ్రామ ఎలిమెంటరీ స్కూలు.''ఇది మహువాసీజను, పిల్లలందరు తల్లిదండ్రులతో పాటు వెళ్ళి పూలుకోయటంలో వారికి సహాయం చేస్తారు. అందువలన బడికి రారని కరషు టీచరు చెప్పాడు. కాని అటెండన్సు రిజిష్టరు చూస్తే విద్యార్థులందరూ హాజరైనట్లుగానే వుంది. కరషు నా చేతిలోని అటెండెన్సు రిజిష్టరు లాక్కొని కొన్ని క్షణాల తరువాత ఆలోచించుకుని సమాధానం చెప్పే విద్యార్థిలాగా ''గ్రామస్థులు తమ పిల్లలను బడికి పంపకపోతే నేనేమి చేయగలను? వాళ్ళకు ఆబ్సంటు మార్కు. వేస్తే స్కూలు మూసి వేస్తారు. నా ఉద్యోగం పోతుం దని చెప్పాడతడు. ఆయన మాటలు నిజమేనేమో. రాయపూర్‌ దగ్గర దుర్గు ప్రాంతంలోని తన వూరు వదలి వచ్చాడు.ఉద్యోగం పోతుందంటే భయం సహజమే. కాని వాస్తవాలు చూస్తే ఆయన చెప్పింది నిజమేనా అని సందేహం కలుగుతుంది.దంతెవాడ జిల్లాల్లో ఇంతవరకు మూసివేసిన స్కూలంటూ లేదు. ఆ ప్రాంతంలో హింసాకాండ హద్దుమీరి లోతట్టు గ్రామాలనుండి ప్రభుత్వ అధికారులు పట్టణాలకు చేరినప్పుడు కూడా ఏ స్కూలునూ మూసివేయలేదు. అయితే రోడ్డు ప్రక్క గ్రామాలకు మార్చారు. ఇది పిల్లల పాలిట శాపమయింది. వారు స్కూలుకు వెళ్ళాలంటే నడవవలసిన దూరం పెరిగింది. అయితే విద్యాశాఖకు చెందిన అధికారులకు మాత్రం అక్రమార్జన సులభమయింది. పిల్లల హక్కుల జాతీయ కమిషన్‌ కార్యకర్త అయిన నారాయణ స్వామి గత అయిదు సంవత్సరాలుగా దంతెవాడ లోనే వుంటున్నాడు. ఆయన స్కూళ్ళను రోడ్డు దరి గ్రామాలకు మార్చటం వలన స్కూలు వార్డెన్ల జవాబుదారీతనం తగ్గిందన్నాడు. ఆయనే ''స్కూలుకు వచ్చేవాళ్ళు వస్తుంటారు వెళ్ళేవాళ్లు వెళుతుంటారు. విద్యార్థుల హాజరులో హెచ్చుతగ్గులు ఎక్కువగా వుంటాయి. ప్రభుత్వ నిధులు మాత్రం స్థిరంగానే వుంటాయ''ని కూడా చెప్పాడు.

ప్రతి విద్యార్థికి రు.450 నుండి రు.950 వరకు స్టైఫండు ఇస్తారు. దీనికి అదనంగా పుస్తకాలకు, యూనిఫారాలకు, మూడు పూటల భోజనానికి కూడా ఇస్తారు. ఇది విద్యార్థులు వచ్చినా రాకపోయినా హాజరు వేయటానికి ఉపాధ్యా యులకు మంచి ప్రేరణ అని నిస్సం దేహంగా చెప్పవచ్చు. స్కూళ్ళను మూసివేయకుండా వుండేం దుకు బాగా ఆలోచించి మార్చిన నియమాలే లంచగొండితనాన్ని పెంచాయి.

ఉదాహరణకు ప్రస్తుతమున్న స్కూలు ఏదీ తగినంత మంది విద్యార్థులకు అందుబాటులో లేకపోతే బ్లాకు ఆఫీసు అధికారులు కొత్త స్కూలును అనుమతించి ఉపాధ్యాయులను నియమించవచ్చు. గత అక్టోబరులో ఆరుగురు వ్యక్తులు స్కూలు అందుబాటులో లేకుండా మారుమూల గ్రామాల నుండి 228 మంది విద్యార్థులను పోగుచేశారు. వారికి ఏ స్కూలూ అందుబాటులో లేదన్న మాట నిజమైనా కాకపోయినా వారలా చెప్పారు. ఆ ఆరుగురిలో ఒకరిని వార్డెన్‌గాను, మిగిలినవారిని ఉపాధ్యాయులుగాను నియమించారు. స్కూలుకు హాస్టలుకు పనికివచ్చే పెద్ద బిల్డింగును చూపి దానిలో రెసిడెన్షియల్‌ స్కూలు నడపమన్నారు. మార్చినెలలో ఈ విలేఖరి ఆ స్కూలుకు వెళ్ళగా విద్యార్థులు వందకు మించిలేరు. ఆ నెలలో 140కి మించి ఎప్పుడూ హాజరు కాలేదని ఆ స్కూలు కరస్పాండెంట్‌ మాన్‌సింగ్‌ సైతం అంగీకరించాడు.

''వాళ్ళు ఏ అర్థరాత్రో పారిపోతార'న్నాడు మాన్‌సింగు. వాళ్ళను తిరిగి తీసుకురావచ్చుగదా అని అంటే ఆ గ్రామాలకు వెళ్ళటం ప్రమాదకర మ''ని రోషన్‌ యాదవ్‌ అనే ఉపాధ్యాయుడు బదులు చెప్పాడు. అయితే ఈ ఆరునెలలలో వచ్చిన మార్పేమిటి? ఆ పిల్లలను బడిలో చేర్పించేందుకు వారు అక్టోబరులో అదే గ్రామాలకు వెళ్ళారు గదా! అప్పుడు లేని ప్రమాదం ఇప్పుడేమొచ్చిందనే ప్రశ్నకు సమాధానం లేదు. అంతకంటే మౌలికమైన ప్రశ్న. మొత్తం 228 మందిని నిత్యం హాజరయినట్లు ఎందుకు చూపుతున్నారు?

దొర్నపాల్‌ అనే గ్రామంలో ఒక యువ

ఉపాధ్యాయుడు తాను వార్డన్‌గా నియమించ బడేందుకు రు.25,000 లంచమిచ్చానన్నాడు. అయితే ఈ కుంభకోణంలో ఉపాధ్యాయులకు, వార్డన్లకు దక్కేది పీసపాలె. సింహభాగం బ్లాకు ఆఫీసర్లకే దక్కుతుంది. ఎందుంకంటే ఈ పథకం అమలు వారి కంట్రోలులోనే వుంటుంది కనుక'' అని ఆ ఉపాధ్యాయుడే చెప్పాడు.

భారతదేశంలో ప్రాథమిక విద్యకు నిధులు, సర్వశిక్షా అభియాన్‌ అనే కేంద్ర పథకం ద్వారా విడుదలవుతాయి. ఆ సంస్థ ఆడిటర్లు దంతెవాడ జిల్లాలో వివిధ కొనుగోళ్లకు, సేకరణకు అవలం భించిన పద్ధతులను పరిశీలించేందుకు తమకు సమర్పించలేదని ఆడిటర్లు తెలియ చేశారు.వారి కొనుగోళ్ళలో బ్లాకు బోర్డుల దగ్గర నుండి టెలివిజన్‌ డివిడిలు కూడా వున్నాయి. ''దంతెవాడ జిల్లాలోని అనేక బ్లాకులలో భవన నిర్మాణ చెల్లింపులకు ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాలకు చెక్కులిచ్చారు. వారే బిల్లులు చెల్లిస్తారు. అత్యంత కల్లోలిత జిల్లాలుగా పేరుపొందిన దంతెవాడ, బీజపూర్‌ జిల్లాల్లో అత్యధికంగా అక్రమాలు చోటు చేసుకున్నాయ''ని కూడా ఆ నివేదిక తెలియచేసింది.

- టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సౌజన్యంతో,

అనువాదం : పి.ఆర్‌.ప్రకాశరావు


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు