కార్మికుల తిరుగుబాటు ఉద్రిక్తయానం

Fri, 27 Jan 2012, IST    vv
సిరామిక్‌ పరిశ్రమలో
తిరగబడ్డ కార్మికులు
పోలీసుల కాల్పులు
కార్మిక నాయకుడి మృతి
ప్రతిదాడిలో రీజెన్సీ
వైస్‌ ఛైర్మన్‌ మృతి
భయం.. భయం
144 సెక్షన్‌
కార్మికుల తిరుగుబాటు ఉద్రిక్తయానం

యానం (వివి) : కేంద్రపాలిత ప్రాంతం యానంలో శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భయం గుప్పెట్లో ఉత్కంఠంగా సాగింది. యానం రీజెన్సీ సిరామిక్‌ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు గత 25రోజులుగా యాజమాన్యం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ వారి ఆందో ళనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కార్మిక నాయకుడైన మత్సా మురళీమోహన్‌, మరికొంతమంది కార్మికులను శుక్రవారం ఉదయం యానం సిఐ విచక్షణారహితంగా దాడి చేసి వారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దాంతో కార్మికులంతా స్టేషన్‌కు పరుగులు తీశారు. సిఐ సమక్షంలోనే వీరిపై కానిస్టేబుళ్లు, ఐఆర్‌బి సిబ్బంది వచక్షణారహితంగా లాఠీలతో గాయపర్చారు. ఈ ఘనటలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 100మంది కార్మికులను స్టేషన్‌లో బందించారు. ఏంజరిగిందోగానీ స్టేషన్‌లో వున్న కార్మిక నాయకుడు మురళీమోహన్‌ను పోలీసులు తమ వాహనంలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు మురళీమోహన్‌ మృతిచెందారని నిర్ధారించారు. మురళీమోహన్‌ మృతి చెందాడన్న వార్త తెలియగానే కార్మికులంతా కోపోద్రిక్తులై ఆసుపత్రి వద్దే పోలీస్‌ వాహనాన్ని ధ్వంసం చేసారు. అక్కడ నుండి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ కార్మిక నాయకుని ఎందుకు చంపివేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ పోలీసు లకు-కార్మికుల మధ్య తోపులాట, గలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎటువంటి అనుమతులు లేకుండానే రెచ్చిపోయిన పోలీసులు కార్మికులపై కాల్పులు జరిపారు. ఈ తూటాలకు 20మందికి పైగా కార్మికులు గాయ పడ్డారు. రక్తపుమడుగులో కార్మికులు కొట్టుమిట్టాడారు. గాయపడ్డవారందరినీ ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వా సుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడున్న మిగిలిన కార్మికులు పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కొందరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ సమస్యకు కారణమైన రీజెన్సీ ఫ్యాక్టరీలోకి కార్మికులు చొరబడి రీజెన్సీకి సంబంధించిన సుమారు 30లారీలు, 10బస్సులు, 100మోటారు సైకిళ్లకు నిప్పుపెట్టడంతో అవి కాలిబూడిదయ్యాయి. యానంలో వివిధ కూడళ్ల వద్ద రీజెన్సీ సంస్థకు చెందిన స్కూల్‌ బస్సులను కూడా ధ్వంసం చేశారు. ఇదే సమయంలో జిక్రియానగర్‌లో వుంటున్న రీజెన్సీ వైస్‌ ఛైర్మన్‌ కెసి.చంద్రశేఖర్‌ ఇంటిపై కార్మికులు దాడి చేశారు. ఇంట్లో వున్న మహిళలు పరుగులు తీయగా, అక్కడున్న చంద్రశేఖర్‌ను కార్మికులు తీవ్రంగా గాయపరిచారు. అతనిని కాకినాడ ఆసుపత్రికి తరలించగా ఆయన మృతి చెందాడు. ఇదిలావుండగా పోలీస్‌ కాల్పుల్లో గాయపడిన ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా మారింది. మరోపక్క కాపులపాలెం జంక్షన్‌లో గత నాలుగు రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న కార్మికులు, పోలీసు కాల్పులతో గాయపడిన కార్మికుల బంధువుల ఆర్తనాధాలతో దీక్షా శిబిరం మారుమోగింది. ఈ సంఘటన టీవీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెలియడంతో జిల్లా నలుమూలల నుండి, అలాగే పాండిచ్చేరి రాష్ట్రం నుండి కార్మిక సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు శిబిరానికి చేరుకుని కార్మికులకు బాసటగా నిలిచారు. అలాగే సిపిఐ జిల్లా కార్యదర్శి మీసాల సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శిలు తాటిపాక మధు, కిర్ల కృష్ణ, నాయకులు కెఎస్‌ బాబు, నల్లా రామారావులు శిబిరానికి చేరుకొని తమ మద్దతు తెలిపారు. పోలీస్‌ కాల్పులను ఖండించారు. మృతి చెందిన కార్మికుని కుటుంబానికి 25లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, అతని భార్యకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్సీ పిజె.చంద్రశేఖరరావు హైదరాబాద్‌ నుండి హుటాహుటిన శిబిరం వద్దకు చేరుకుని కార్మికులపై పోలీసులు, ప్రభుత్వం ఈ విధమైన దాడులు చేయడం అమానుషమని ఖండించారు. కార్మికులు న్యాయమైన హక్కుల కోసం పోరాడుతుంటే వారిపై బలితీసుకోవడం అన్యాయమన్నారు. పోలీసు కాల్పులల్లో గాయపడిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని, మృతిచెందిన కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఈఘనటతో యానంలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. షాపులు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రజలు ఇళ్లల్లోంచి భయటకు రాలేదు. ఇదే అదునుగా భావించిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రీజెన్సీ ఫ్యాక్టరీలోకి చొరబడి విలువైన ఉత్పత్తులు, సామాగ్రిని లూటీ చేసారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కాకినాడ నుండి రెండు అదనపు బెటాలియన్‌ బలగాలు యానంకు రప్పించారు. 144 సెక్షన్‌ను విధించి సాయంత్రానికి పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పటికీ ప్రజలు భయాందోళనలోనే వున్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు