విశ్వవిఖ్యాత సైంటిస్టు ''భారతరత్న'' డాక్టర్ సి.వి. రామన్ తన అనన్య సామాన్య పరిశోధనా సామర్ధ్యంతో ఫిజిక్స్ రంగంలో ''రామన్ ఎఫెక్ట్'' కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28నే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. మన దేశంలో 1987 ఫిబ్రవరి నుండి ప్రతీ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం, ప్రజలు నిర్వహిస్తున్నారు.
1928 ఫిబ్రవరి 28న సి.వి. రామన్ ''రామన్ ఎఫెక్ట్'' కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. మనదేశంలో పుట్టి, మనదేశంలోనే చదువుకొని, మనదేశంలోనే పరిశోధన చేసి, తన అత్యంత విశిష్ట కృషికి గుర్తింపుగా ఫిజిక్స్‌లో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతిని పొంది చరిత్ర సృష్టించిన మహనీయుడు రామన్. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి శ్వేతేతర శాస్త్రజ్ఞుడు రామన్ కావడం గర్వకారణం. అంత వరకూ సైన్సులో నోబెల్ బహుమతులు అన్నీ తెల్ల జాతీయులైన పాశ్చాత్యులకే లభించాయి. కాని, రామన్ నూటికి నూరుపాళ్ళూ భారతీయునిగా ఈ గడ్డపై, యిక్కడ చదువుకొని, తలమానికమైన పరిశోధన జరిపి సైన్సులో భారతీయుల శక్తిసామర్ధ్యా లను చాటిచెప్పిన విశిష్ట వ్యక్తి రామన్. అంతకు ముందు 1913లో సాహిత్యంలో మనదేశం నుండి నోబెల్ బహుమతి పొందిన విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ అనంతరం సైన్సు రంగంలో విజయఢంకా మ్రోగించిన అఖండ ప్రజ్ఞాశాలి రామన్ కావడం అందరికీ గర్వకారణం. రామన్ పరిశోధ నలు సైన్సులో ఒక క్రొత్త విభాగం. ''రామన్ స్పెక్టో స్కోపీ'' ఆవిర్భావానికి, శాస్త్రరంగంలోను, ఇండిస్టియల్ రంగంలోను క్రొత్తపుంతలు త్రొక్కడానికి దారితీసింది. రామన్‌కు 1954లో ''భారతరత్న'', 1957లో ''లెనిన్ శాంతి బహుమతి'' లభించాయి. సి.వి. రామన్ ఆప్టిక్స్‌లో కాంతి ప్రసరణపై జరిపిన పరిశోధనలకు నోబెల్ బహుమతి లభించింది. మనకి స్వాతంత్య్రం రాగానే రామన్‌కు మొట్టమొదటి నేషనల్ ప్రొఫెసర్‌గా ప్రభుత్వం నియమించి గౌరవించింది. 1948లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్‌గా రిటైరుఅయి, 1949లో బెంగుళూరులో రామన్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ స్థాపించి, 1970 నవంబరు 27న ఆయన మరణించే వరకూ, ఆ సంస్థలో పరిశోధనలు జరిపి, మన దేశంలో సైన్సు అభివృద్ధికి మార్గదర్శకు లయ్యారు. 1971 నవంబర్ 21న సి.వి. రామన్ పోస్టేజి స్టాంపును భారత ప్రభుత్వం వెలువరించి ఆ మహా శాస్త్రజ్ఞుడిని గౌరవించింది.
డాక్టర్ సి.వి. రామన్ తమిళనాడులో తిరుచిరాపల్లికి దగ్గరలో తిరుపనైకాపల్‌లో 1888 నవంబరు 7న జన్మించారు. పూర్తిపేరు చంద్రశేఖర వెంకట రామన్. తండ్రి చంద్రశేఖర అయ్యర్. తల్లి పార్వతీ అమ్మాళ్. 8 మంది పిల్లల్లో 2వ కుమారుడు. బాల్యంలోనే తండ్రితో విశాఖపట్నంలో సెయింట్ అలోషియస్ ఆంగ్లో-ఇండియన్ స్కూలులో చదువు కున్నాడు. తండ్రి కె.బి.యన్ కాలేజీలో, మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్. రామన్ తన 13వ ఏట ప్రెసిడెన్సీ కాలేజీలో 1902లో ప్రవేశించి, 1904లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకం పొందాడు. 1907లో అదే కాలేజీ నుండి యం.ఏ. డిగ్రీని ఫిజిక్స్‌లో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. గవర్నమెంటు ఉద్యోగిగా జీవితం ప్రారంభించిన రామన్ కలకత్తా యూనివర్శిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ అయ్యాడు. కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్‌తో సంబంధం కలిగి దానికి కార్యదర్శి అయ్యాడు.
అఖండ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్‌కు ఎన్నో గౌరవ డాక్టరేట్లు లభించాయి. 1924లో ఇంగ్లండులో రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు. 1928లో రామన్‌కి ''సర్'' బిరుదు లభించింది. 1947లో ప్రతిష్ఠాత్మకమైన ఫ్రాంక్లిన్ మెడల్ లభించింది.
రామన్‌కి మంచి ఆర్గనైజేషనల్ సామర్ధ్యం వుంది. సమిష్టి కృషి ద్వారా సైన్సు అభివృద్ధి చెందుతుందని, ఏ దేశంలో సైన్సులో నిష్ణాతులున్నా, వారిని మనదేశానికి ఆహ్వానిస్తే, సైన్సు రంగంలో మనదేశం వృద్ధి చెందుతుందని రామన్ ప్రగాఢ విశ్వాసం.
కలకత్తా యూనివర్శిటీలో తారకనాధ్ సలిత ప్రొఫెసర్‌గా సి.వి. రామన్‌ని నియమించాలని వైస్ ఛాన్సలర్ అనుతోష్ ముఖర్జీ ఆకాంక్షించారు. కాని, ఆ ప్రొఫెసర్ హెడ్ విదేశాలలో చదువుకున్న వారికే యిచ్చేవారు. స్వదేశాభిమానం గల రామన్ దానికొరకు విదేశాలు వెళ్ళనని నిరాకరించారు. దానితో వైస్ ఛాన్సలర్ రూల్స్ మార్చి రామన్‌ని కలకత్తా యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా ఆహ్వానించి, నియమించడం ప్రత్యేకత.
1933లో బెంగళూరులో టాటా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టరుగా వున్నప్పుడు జర్మనీ నుండి హిట్లర్ ఎంతోమంది సైన్సు నిష్ణాతులను తరిమివేసేవాడు. జాత్యహంకారంతో హిట్లర్ బాధల గాధలకు గురిచేస్తున్న నిష్ణాతులైన యూదు సైంటిస్టులను, ఇతర సైంటిస్టులను మనదేశానికి ఆహ్వానిస్తే, మనదేశం సైన్సు రంగంలో అగ్రగామి కాగలదని రామన్ ఆకాంక్షించాడు. మనదేశస్తులు విదేశాలు వెళ్ళి చదువుకొనే బదులు విదేశస్తులనే మనదేశం ఆహ్వానించాలని రామన్ అభిమతం. సైంటిస్టులకు దేశాల సరిహద్దులు వుండవు. సైన్స్ విశ్వజనీనం. అందుచేత రామన్ హిట్లర్‌చే హింసింపబడుతున్న కొందరు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రజ్ఞులను వచ్చి మనదేశంలో స్థిరపడమని, యిక్కడ పరిశోధన కొనసాగించమని ఆహ్వానించాడు. దానితో బ్రిటీషు ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని హర్షించకపోగా, సి.వి. రామన్‌ను టాటా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ పదవి నుండి తొలగించింది. అది రామన్ పట్టుదల, దీక్షను మరింత పెంచి, సైన్స్ రంగంలో మనదేశం స్వయం సంపూర్ణం కావాలని వివిధ రంగాలలో తన కృషిని కొనసాగించాడు. తన తలపాగాను తియ్యలేదు. విదేశస్తుల ముందు తలవంచలేదు. మన శాస్త్రీయ సంగీతం, వాయిద్యాలపై కూడా ఎంతో పరిశోధన చేశాడు. సైన్సు పరిశోధనల ద్వారానే మనదేశం ప్రపంచ దేశాలలో అగ్రగామి కాగలదని రామన్ స్పష్టంగా గుర్తించాడు.
అలాంటి మహా శాస్త్రజ్ఞుని ముందుచూపు, విజ్ఞత, అఖండ ప్రజ్ఞత్వానికి ప్రతీకగా రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా పేర్కొనడం సముచితమైన నిర్ణయం. అది మనదేశ ఖ్యాతిని, గౌరవాన్ని సైన్సు రంగంలో మరింత ఇనుమడింపజేస్తుంది.
- డాక్టర్ విజయం
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
