హైదరాబాద్ (వి.వి) : మద్యం సిండికేట్లకు సంబంధించి విజయనగరం జిల్లాలో వెలుగు చూసిన బినామీ దుకాణాల గోల్‌మాల్ వ్యవహా రంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ జిల్లాలో రట్టయిన లిక్కర్ స్కాంలో తన పాత్ర ఏమీలేదని బొత్స పదే పదే చెబుతున్నా ఎసిబి అధికారులు రూపొంది స్తున్న నివేదికలోని అంశాలు దీనికి భిన్నంగా వున్నాయని తెలుస్తోంది. జిల్లాలో 202 మద్యం దుకాణాలుండగా ఇందులో 103 మంది తెల్లరేషన్ కార్డుదారులు, మరో ముగ్గురు అంత్యోదయ కార్డు దారులు, తొమ్మిది మంది తాత్కాలిక కార్డులున్న వారికి మద్యం దుకాణాలున్నట్లు ఎసిబి తేల్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో మద్యం సిండికేట్లపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి అనేక అక్రమాలను వెలికితీసినప్పటికీ విజయనగరం జిల్లాలో రట్టయిన స్కాం ఎసిబినే షాక్‌కు గురిచేసింది. తెల్లరేషన్ కార్డులున్న వారు ఎలా మద్యం దుకాణాలకు అర్హులన్న విషయంపైన ఎసిబి అధికారులు ఆరా తీయగా దీని వెనుక బలీయమైన ఆర్థిక శక్తి వుందన్న విషయం నిర్దారణ అయింది. ఈ బలీయమైన ఆర్థిక శక్తి విజయ నగరం జిల్లాలో వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాగా రూపాంతరం చెందిందని ఎసిబి విశ్వసిస్తోంది. ఈ ముఠాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేసిన ఎసిబి అధికారులు ఈ మొత్తం వ్యవహారం వెనుక వున్న వారిని సైతం వదలబోమని వెల్లడించారు. మరోవైపు ఈ జిల్లాకు చెందిన ఓ అబ్కారీ అధికారి లిక్కర్ సిండికేట్ల వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న ఎసిబి జాయింట్ డైరక్టర్ కె. శ్రీనివాస్ రెడ్డికి లీగల్ నోటీసు ఇవ్వడం, ఇందులో అన్యాపదంగా బొత్స పేరును ప్రస్తావించడం కలకలం రేపింది. ఈ నోటీసు తరువాత బొత్స పలుదఫాలు మీడియాతో మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంకు తనకు ఎటువంటి సంబం ధం లేదని తెలిపారు. అబ్కారీ అధికారి తన పేరును అనవసరంగా లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఎసిబి అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. జిల్లాలో వెల్లడయిన బినామీ దుకాణాల వెనుక వున్న అసలు సూత్రధారికి సంబంధించి వారు ఇప్పటికే ఆయా దుకాణాల నిర్వాహకుల నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు తెలిసింది. దీని ఆధారంగా పిసిసి చీఫ్ బొత్స సత్య నారాయణకు ఎసిబి అధికారులు ఉచ్చు బిగిస్తున్నట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్య మంత్రికి ఒకటి, రెండు రోజుల్లో నివేదిక అందించనున్నారని సమాచారం.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
