కెప్టెన్సీ ఒక్కటే కారణం కాదు !

Fri, 6 Jul 2012, IST    vv
వరల్డ్‌ కప్‌ విజయంపై సెహ్వాగ్‌ - ధోనీపై పరోక్షంగా 'ధ్వజం'

నోడియా : గత వరల్డ్‌ కప్‌ విజయానికి మంచి జట్టే కారణమని, దానికితోడు మంచి కెప్టెన్‌ కూడా వుండటం కలిసి వచ్చిందని 'డాషింగ్‌' ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు. శుక్రవారం ఇక్కడ సాబా కరీం- గెన్సిస్‌ ప్రొ. క్రికెట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ధోనీపై ధ్వజమెత్తే రీతిలో వ్యాఖ్యలు చేశాడు. 2007 టి-20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ విజయాలకు ్ల కెప్టెన్‌గా ధోనీ సమర్థతే కారణమా అన్న ప్రశ్నకు, ధోనీకి పటిష్టమైన జట్టు లభించింది, బలమైన జట్టు దొరికినప్పుడు అద్భుతంగా రాణించడం తేలికేనని, ఒక దశలో ఆస్ట్రేలియా జట్టు వరుసగా సాధించిన విజయాలను ప్రస్తావించాడు. 'తమకు మంచి జట్టు వున్నందునే వరల్డ్‌ కప్‌ విజయం సాధ్యమైందని, ధోనీ సమర్థవంతంగా జట్టును నడిపించగలిగాడని' అన్నాడు. వచ్చే శ్రీలంక వన్డే సిరీస్‌కు సచిన్‌ టెండూల్కర్‌ దూరం కావడాన్ని ప్రస్తావించగా, తాను ఏ సిరీస్‌ ఆడాలో, వద్దో నిర్ణయించుకొనే హక్కు ఆయనకు వుందని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. 'తాను మాత్రమే గాక మొత్తం దేశమంతా సచిన్‌ యాక్షన్‌ను 'మిస్‌' అవుతోందని, అయితే 'మాస్టర్‌'కు 39 ఏళ్ళని గుర్తుంచుకోవాలని, ఏ సిరీస్‌లో ఆడాలో నిర్ణయిం చుకొనే అవకాశం ఆయనకు యివ్వాలని అంటూ, తరువాత న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు అందుబాటులో వుంటాడనే ఆశాభావాన్ని సెహ్వాగ్‌ వ్యక్తం చేశాడు. ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే శ్రీలంక సిరీస్‌కు తాను సన్నద్ధమౌతున్నానని, 'ఫిట్‌నెస్‌' సమస్యలేమీ లేవని అంటూ, ఐపిఎల్‌లో దాదాపుగా అన్ని మ్యాచ్‌లు ఆడానని, ఇప్పుడు 'ఫిట్‌నెస్‌' పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రస్తుత శ్రీలంక వన్డే సిరీస్‌ తమకు వచ్చే టి-20 వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఉపకరిస్తుందని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ఇటీవలి విండీస్‌ పర్యటనలో భారత -ఎ జట్టు బ్యాట్స్‌మెన్‌ ఆశించిన రీతిలో రాణించలేకపోయారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, గతంలో తానూ 'ఎ' జట్టుతో పర్యటించానని, ఇటువంటి పర్యటనల్లో అందరూ రాణించలేకపో వచ్చని, అయితే ఆ అనుభవం వారికి ఉపకరిస్తుందని అన్నాడు.భవిష్యత్‌లో టెస్టు క్రికెట్‌కు వచ్చిన ముప్పేమీలేదని, కొందరు సీనియర్‌ ఆటగాళ్ళు వన్డేలు, టి-20ల నుండి రిటైరైనా టెస్టుల్లో కొనసాగు తుండటం దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించాడు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు