హైదరాబాద్ (వి.వి) : రత్నగిరి 'కథ' ఎట్టకేలకు సుఖాంతమైంది. వివాదాస్పదంగా మారిన గ్యాస్ తరలింపు సమస్యపై ప్రతిపక్షాల ముప్పేట దాడికి తలొగ్గిన యుపిఎ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. రాష్ట్రంలో తలెత్తిన ఆందోళనలతో సోమ వారం ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి హుటా హుటిన ఢిల్లీకి వెళ్ళి, ప్రధానిని, ఇతర మంత్రులను కలిసిన విషయం తెల్సిందే. ఆగస్టు 1 నుంచి మహారాష్ట్రలోని రత్నగిరి ప్లాంట్‌కు కేటాయించిన 2 ఎంఎంఎస్ సిఎండి గ్యాస్‌ను వెంటనే నిలిపివేయాలని ప్రధానమంత్రి డా|| మన్మోహన్‌సింగ్ మంగళవారం పెట్రోలియం శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ కోటాను అదే రాష్ట్రానికే సరఫరా చేయాలని, ఆగస్టు 1 నుంచి ఈ ఆదేశం అమలు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని పెట్రో లియం శాఖను ప్రధాని కార్యాలయం ఆదేశించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించింది. రత్నగిరికి గ్యాస్ కేటాయింపు ఆదేశాలు రద్దుచేశామని, సరఫరా నిలిపివేశామని అందులో వివరించింది. ఫలితంగా రాష్ట్రంలో దాదాపు 400 మెగావాట్ల విద్యుదుత్పత్తికి కలిగిన ఆటంకం తొలగనుంది. పెట్రోలియం శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి చెప్పినట్లుగానే సమస్యకు సత్వర ఫలితం రావడంతో ఊరట లభించింది. అయితే ప్రభుత్వం అలసత్వం వల్లనే రాష్ట్రంలో గ్యాస్ కొరత నెలకొందని జైపాల్‌రెడ్డి తొలుత చేసిన వ్యాఖ్య కొంత దుమారం లేపింది. కాకపోతే వెంటనే కిరణ్ సర్కారు చేపట్టిన చర్యలు గ్యాస్ తరలింపు ఇబ్బందులను అధిగమించాయి. ఇదే విషయమై ఆయా రాజకీయ పార్టీలు ప్రభుత్వ వైఖరిని, పెట్రోలియం మంత్రి తీరును తప్పు పట్టిన విషయం విదితమే. కాగా గ్యాస్ తరలింపును నిరసిస్తూ అన్ని రాజకీయపార్టీలు 10న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
