ఫైనాన్స్‌ వ్యాపారి హత్య

Sat, 11 Aug 2012, IST    vv

విశాఖపట్నం/అల్లిపురం (వి.వి) : అక్కయ్యపాలెం శంకువానిపాలెంకు చెందిన ఫైనాన్స్‌ వ్యాపారి చిరంజీవి శనివారం వేకువజామున ఒంటి గంట, మూడు గంటల మధ్య ప్రాంతంలో హత్యకు గురయ్యారు. స్థానికుల కథనం మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిరంజీవి పాతికేళ్ల కిందట బతుకుతెరువు కోసం విశాఖకు వచ్చి స్థిరపడ్డారు. అప్పటి నుంచీ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కార్యాలయం పై అంతస్తులోనే కుటుంబంతో నివాసముంటున్నారు. శుక్రవారం రాత్రి చిరంజీవి ఫైనాన్స్‌ కార్యాలయంలో నిద్రకు ఉపక్రమించారు. అయితే అప్పటికే మాటు వేసి ఉన్న దుండగలు నిద్ర మత్తులో ఉన్న చిరంజీవిని ఆయుధాలతో హతమార్చారు. గొంతు కోసి చంపారు. పొట్టపై కత్తులతో బలంగా గాయపర్చారు. ఆయన రక్తపు మడుగులోనే ప్రాణాలు విడిచారు. హత్య జరిగిందన్న విషయం శనివారం సంచలనం రేపింది. జాగిలాలతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వీధి చివరకు వెళ్లి జాగిలాలు అగిపోయాయి. దీంతో హంతకుల జాడ తెలియరాలేదు. బీరువాలో డబ్బు భద్రంగా ఉండటంతో దొంగల పని కాదని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే చిరంజీవికి ఎవరితోనూ విబేధాలు, కక్షలు లేవని స్థానికులు చెప్తున్నారు. తూర్పు ఎసిపి ఎస్‌.వెంకట్రావు మాట్లాడుతూ ఇద్దరు అంతకన్న ఎక్కువ మంది దుండగలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నామన్నారు. ఫైనాన్స్‌ వివాదాలు, కుటుంబ తగదాలు, లేదా వక్తిగత కక్షలు చిరంజీవి హత్యకు కారణమై ఉంటాయన్న కోణంలో విచారణ కొనసాగిస్తామని తెలిపారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు