దాహం ఎందుకు వేస్తుంది?

Sun, 12 Aug 2012, IST    vv

ప్రజలు కాయకష్టం చేస్తారు. లేక ఎండలో నడచి వస్తారు. అదీ గాకపోతే ఎక్కువ దూరం ప్రయాణం చేసి వస్తారు. ఆ సమయంలో నాలుక ''పిడచ'' గట్టుకుపోతుంది. గొంతు ''తడారి'' పోతుంది. తెలియకుండానే ''దాహం దాహం'' అని అంటారు. దొరికిన నీళ్ళు గటగటా త్రాగేస్తారు. తిండీతిప్పలూ లేకుండా ఎక్కువ రోజులు ఉండవచ్చునేమోకాని, నీరు లేకుండా నాలుగైదు రోజులు ఉండలేము. మనం నీరు త్రాగుతూనే ఉంటాము. ఒక్క రోజులో 700 నుండి 1000 గ్రాముల నీరు చెమట రూపంలో పోతుంటుంది. లోపల 300 నుండి 400 గ్రాముల నీరు తయారవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ బయటకుపోయే నీరు ఎక్కువ. లోపల ఊరేది తక్కువ. ఇలా తగ్గినది భర్తీ అవ్వాలి కదా! అప్పుడు ''దాహం'' వేస్తుంది. రక్తంలో ఉప్పు, నీరు కలిసి ఉంటాయి. శరీరంలో ఉన్న జీవకణాల్లో కూడా ఈ రెండూ ఉంటాయి. మామూలుగా ఇవి రెండూ రక్తంలో స్థిరంగానే ఉంటాయి. ఏ కారణం చేతనయినా రక్తంలో నీరు తగ్గుతుందనుకోండి. ఏం జరుగుతుంది? మెదడు ఉన్నది కదా! దానిలో ''దాహాన్ని'' తెలియజేసే కేంద్రం ఉంటుంది. రక్తంలో ఉప్పు ఉన్న తీరునుబట్టి ఆ స్థానం ఉద్రిక్తం అవుతుంది. అక్కడి నుండి గొంతుకు ''సంకేతాలు'' వెళతాయి. గొంతు దగ్గర నుండి మళ్ళీ మెదడుకు ''వార్తా ప్రసారం'' అవుతుంది. దానితో మనకు ''నీళ్ళు కావాలి'' అని అనిపిస్తుంది. పొట్టనిండా నీళ్ళుంటాయి. నోటి నిండా ''లాలాజలం'' ఊరుతుంది. కాని దాహం ససేమిరా తగ్గదు, అంటే రక్తంలో ఉప్పు ఉండవలసిన దానికన్నా ఎక్కువో లేక తక్కువో ఉన్నదన్నమాట. అందుకనే ఆ లోటు భర్తీ చేయాలి. వేసవిలో చూడండి. ఎన్నో నీళ్ళు త్రాగుతాం! అన్నం కంటే నీళ్ళే ఎక్కువగా త్రాగుతాం. అయినా దాహం తీరదు. ఎందుకో గమనించారా? వేసవిలో ''చెమట'' ఎక్కువగా పోతుంది గదా! దానితో ఉప్పు చాలా పోతుంది. రక్తంలో ఉప్పు శాతం తగ్గిపోతుంది. ఎన్ని నీళ్ళు త్రాగినా ఆ శాతం పెరగదు. అందుకే విపరీతంగా నీరు త్రాగుతాం!


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు