బొగ్గు 'భగ్గు'

Wed, 22 Aug 2012, IST    vv
రెండవ రోజూ స్తంభించిన పార్లమెంట్‌
ప్రధాని రాజీనామాకు ప్రతిపక్షాల పట్టు

న్యూఢిల్లీ : బొగ్గుగనుల కుంభకోణంపై తొలిరోజైన మంగళవారం విపక్షాల దాడికి తలపట్టుకున్న అధికారపక్షాన్ని, బుధవారం రెండో రోజు కూడా ఆ తలనొప్పి తీవ్రత ముచ్చెమటలు పట్టించింది.యుపిఎ ప్రభుత్వంలో అతిపెద్ద బొగ్గు కుంభకోణంపై విపక్షాలు విరుచుకుపడటంతో రెండోరోజు సైతం పార్లమెంట్‌ స్తంభించింది.కాగ్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా బొగ్గుగనుల కేటాయింపునకు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తక్షణం రాజీనామా చేయాల్సిందేనంటూ వామపక్షేతర విపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి.కేటాయింపులో అవినీతికి పాల్పడ్డారంటూ అధికార కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు చేస్తోన్న తీవ్రస్థాయి ఆరోపణల తాలూకు దృశ్యాలు రాజ్యసభ, లోక్‌సభల రెండింటా సాక్ష్యాలుగా నిలిచాయి.ప్రైవేట్‌ సంస్థలకు బొగ్గుగనుల కేటాయింపులు చేయటం వెనుక 1.86లక్షల కోట్ల 'అనుచిత ప్రయోజనం' దాగి ఉందని కాగ్‌ వెల్లడించిన నేపథ్యంలో,బొగ్గు స్కామ్‌ పార్లమెంట్‌ను పట్టికుదిపే సింది.ఈ నేపథ్యంలో లోక్‌సభ రెండుసార్లు వాయిదాపడగా, రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల వరకూ మూడుసార్లు వాయిదా పడింది.'కొయిలే కి దలాలి హై, సారి కాంగ్రెస్‌ కాలి హై' (గనుల కేటాయింపులో కుంభకోణం ఉన్న చోటల్లా, కాంగ్రెస్‌ పార్టీ మొత్తం ప్రతిష్ట మసకబారింది) 'ప్రధాన్‌మంత్రి గద్దీ చోరో' (పిఎం.క్విట్‌)లాంటి నినాదాలు పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రతిధ్వనించాయి. ప్రతిపక్షాలు దాడి చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు వాటిని తిప్పికొట్టారు.అయితే, ఆ సమయంలో ప్రధాని సభలో లేరు. బిజెపి, శివ్‌సేన, జెడి-యు, టిడిపి, బిజెడి, అన్నాడిఎంకె సభ్యులు దిగువ సభలోని వెల్‌లోకి దూసుకువచ్చారు.కాగా, వామపక్షాలుకూడా ఇదే సమస్యపై లేచి నిలబడి నిరసన తెలిపారు. బొగ్గుగనుల కేటాయింపుపై ఆయన రాజీ నామా కాకుండా దానిపై ఒక ప్రకటన కోరారు.

ఇదిలా ఉండగా, రాజ్యసభలో ఎన్డీయే సభ్యులు లేచి నిలబడి నినాదాలిచ్చారు.సర్కార్‌ ఖజానాకు గండికొట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కాగా, ఈ సమస్యపై చర్చించేందుకు తాము సిద్ధమేనని ప్రభుత్వం ఉభయ సభల్లో తేల్చిచెప్పింది.ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయమంత్రి వి.నారాయణసామి లోక్‌సభలో మాట్లాడుతూ దీనిపై చర్చకు తాము సిద్ధమని, ప్రతిపక్షం వెనుకడుగు వేయొద్దని సవాల్‌చేసారు. ఎగువసభలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్‌శుక్లా కూడా ఇదే రీతిలో ప్రస్తావించారు.

ఇదిలా ఉంటే, లోక్‌సభలో ఎన్డీయే కన్వీనర్‌, జెడి(యు)చీఫ్‌ పదవులకు సారథ్యం వహిస్తున్న శరద్‌యాదవ్‌, బిజెపి నాయకుడు రాజ్‌నాథ్‌సింగ్‌లు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌లతో సంప్రదింపులు జరుపుతూ కనిపించారు. జెడి-యు అధ్యక్షులు తెలుగుదేశం పక్షనాయకులు నామా నాగేశ్వర్‌రావుతో మాట్లాడుతూ కంటబడ్డారు.సమావేశం ప్రారంభం కాగానే, పూర్వపు సభ్యులు ప్రభాత్‌ సింగ్‌ చౌహాన్‌ మరణవార్తను ప్రస్తావించారు.సంతాపం తెలిపిన అనంతరం ఎన్డీయే, వామపక్షానికి చెందిన సభ్యులు గుంపుగా వెల్‌లోకి దూసుకు పోయారు.బిజెపి సభ్యులు అధికసంఖ్యలో స్పీకర్‌ మీరా కుమార్‌ విజ్ఞప్తిని ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా ప్రధాని మన్మో హన్‌సింగ్‌ రాజీనామాను డిమాండ్‌ చేయటం వినిపించింది. విపక్ష సభ్యులు కాఠిన్యంగా వ్యవహ రించటంతో, సభాపతి మీరాకుమార్‌ మధ్యాహ్నం రెండుగంటల వరకు సభను వాయిదా వేసారు. కాగా, రాజ్యసభలో కూడా ఇదేతరహా పరిస్థితి కనిపించింది. బిజెపి-నాయకత్వంలోని ఎన్డీయే సభ్యులు లేచినిలబడి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజీనామా చేయాలంటూ నినాదాలిచ్చారు.'ఇస్తిఫా దో.. ఇస్తిఫా దో..ప్రధాన్‌మంత్రి ఇస్తిఫా దో' (ప్రధానమంత్రి రాజీనామా) అంటూ డిమాండ్‌ చేస్తుండగా, ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ నినాదాలివ్వ రాదంటూ వారించారు. సీనియర్‌ బిజెపి నాయ కుడు వెంకయ్యనాయుడును ఉద్దేశించి ఏదైనా మాట్లాడదలచుకున్నారా అని ప్రశ్నించారు.దీంతో, నాయుడు లేచి ఈ సమస్యపై ఒక ప్రకటన కాకుండా 'ప్రధానమంత్రి గద్దెదిగి పోవాలని మేం కోరుకుంటున్నాం' అని తెలిపారు.ఇదే సమయంలో నినాదాలు, అరుపులు కొనసాగుతుండగా, అన్సారీ హౌస్‌ను అరగంటసేపు వాయిదా వేసారు.సభ తిరిగి ప్రారంభమైన అనంతరం కూడా ఇదే దృశ్యాలు పునరావృతం కాగా, సభను మళ్ళీ మధ్యా హ్నం వరకు వాయిదా వేసారు.తిరిగి మధ్యాహ్నం 12గంటలకు సభ ప్రారంభమైనా పూర్వ స్థితే నెలకొంది. బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే సభ్యులు నినాదాలు, అరుపులతో సభ దద్దరిల్లింది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు