విజయవాడ (వి.వి.) : గ్రూప్ -1 పరీక్ష నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి సుమారు రెండు సంవత్సరాలుగా అభ్యర్థులు ఎంతో వ్యయప్రయాసలకోర్చి చదివి, ఈ నెల 5న పరీక్ష రాయడానికి సిద్ధపడుతున్న తరుణంలో, ఏవో సాకులు చెబుతూ వాయిదా వేయించడానికి ప్రయత్నిస్తూ, నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో చెలగాటం అడవద్దని సమైఖ్యాంధ్ర జె.ఎ.సి. కన్వీనర్ ప్రొ|| శామ్యూల్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్, సెంట్రల్ ఎం.ఎల్.ఎ. మల్లాది విష్ణు తెలంగాణా జె.ఎ.సి.కి, కె.సి.ఆర్.కు విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ విభే దాలు ఈ విషయంలో పక్కన పెట్టాలని, నిరుద్యోగ విద్యా ర్థుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. శుక్ర వారం నిర్మల కాన్వెంట్ సమీపంలోని వైకేస్ ఐఎఎస్ విన్నర్స్ కోచింగ్ సెంటర్‌లో విజయవాడ మేధావుల ఫోరం ఆధ్వర్యాన జరిగిన విలేకరుల సమావేశంలో ప్రొ|| శామ్యూల్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తరుణంలో, తమ ప్రాంత విద్యార్థులు ఉద్యమాల్లో వున్నందున, సరిగా ప్రిపేర్ కాలేదని అసంబద్ద కారణాలు చెబుతూ వాయిదా వేయాలని కోరడం సమంజసంగా లేదన్నారు. విద్యార్థులు తీవ్రమైన వ్యథతో, నిరుత్సాహంతో వున్నారని, వారి ఆశలపై నీళ్ళు చల్లవద్దన్నారు. అంతేకాకుండా వున్న సీట్లలో 42 శాతం సీట్లు మా ప్రాంతానికి కావాలని కోరడం కూడా సబబుగా లేదన్నారు. ఇది సర్వీస్ కమిషన్‌కు సంబంధించిన పరీక్ష అని, జోనల్ సిస్టమ్ కాదన్నారు. ఇది కమిషన్ నిబంధనలకు విరుద్ధమైన కోర్కె అన్నారు. ఫోరం అధ్యక్షులు యార్లగడ్డ కృష్ణారావు మాట్లాడుతూ లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారని, వారిని బలిపెట్టవద్దని కోరారు. దీనిపై తెలంగాణా విద్యార్థులు కూడా ఆవేదన చెందుతున్నారని, కోదండరామ్, కె.సి.ఆర్.లు వారికి క్షమాపణ చెప్పాలన్నారు. అవసరమైతే సీమాంధ్ర ప్రాంతంలో ఈ పరీక్షను నిర్వహించే విధంగా ప్రభుత్వం సిద్ధపడా డలన్నారు. పరీక్షకు ప్రిపేర్ అవుతున్న బి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చదువుకున్న మూర్ఖుల్లా కోదండరామ్ వ్యవహరిస్తున్నారని, విద్యార్థి లోకం వారి చర్యలను ఖండించాలన్నారు.
ఈ సమావేశంలో అధ్యాపకులు ఎస్. కృష్ణ, ఫోరం సభ్యులు పి.వీరభద్రం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రరత్న భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎం.పి. రాజగోపాల్ మాట్లాడుతూ గ్రూప్ -1 పరీక్షలను అడ్డుకునేందుకు, విద్యార్థి లోకంలో గందరగోళం సృష్టించడానికి తెలంగాణా నేతలు చేస్తున్న దుష్ట పన్నాగంగా పేర్కొన్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయరాదన్నారు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ ఎం.ఎల్.ఎ. మల్లాది విష్ణు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎంతో ఓర్పుతో వ్యవహరిస్తున్నారని, అయినా విద్యార్థుల జీవితాలతో కె.సి.ఆర్ ..చెలగాటం ఆడుతున్నాడని విమర్శించారు. ఏవైనా అభ్యంతరాలు వుంటే నోటిఫికేషన్ వెలువడినప్పుడే చెప్పాల్సివుందన్నారు. పరీక్ష వాయిదా వేయకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
