చర్ల (వి.వి) : గత కొంత కాలంగా స్తబ్ధతగా ఉన్న మావోయిస్టులు అటవీప్రాంతాలకు చెందిన గిరిజనులను కిడ్నాప్ చేయడంతో ఖమ్మం జిల్లా, చర్ల మండలంలోని గిరిజన గ్రామాల్లో విషాదం అలముకుంది. మావోయిస్టుల అదుపులో ఉన్న తమవారిని కడసారి చూసుకునేందుకు ఆప్తులు ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. కుర్నపల్లి గ్రామానికి చెందిన కొమరం పుల్లయ్య, సున్నం భీమయ్య, బూరుగుపాడుకు చెందిన మడకం నందాలను సాయుధులైన మావోయిస్టులు గతనెల 28న కిడ్నాప్ చేసారు. మావోయిస్టుల అదుపులో వున్న ముగ్గురు గిరిజనులను నేటి వరకు విడుదల చేయకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టుల ఆధీనంలో వున్న గిరిజనులు క్షేమంగా వున్నారా? లేక ఏదైనా దురదృష్ట సంఘటన జరిగిందా? అనే విషయాలు తెలియక మధనపడు తున్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా సహకరించే ఇన్‌ఫార్మర్‌లను ఏరివేసే పనిలో
మావోయిస్టులు నిమగమయ్యారనేందుకు చర్ల మండలంలో జరిగిన సంఘటనే సాక్షంగా నిలుస్తుంది. మావోయిస్టులపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ముందుగా ఇన్‌ఫార్మర్ వ్యవస్థను నిర్వీర్యం చేసే లక్ష్యంగా గత కొంతకాలంగా పోలీసులకు సహకరిస్తున్నారనే అనుమానంతో అమాయక గిరిజనులను కిడ్నాప్ చేసి హత్యలకు పాల్పడుతున్నారనే విషయం పోలీసులకు మింగుడుపడటం లేదు. 2008 మార్చి 18న చర్లకు సమీపంలోని చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల కంచాల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా 2 నెలల వ్యవధిలో 14 మందిని కిడ్నాప్‌చేసి 11 మందిని ఊచకోత కోయడంతో నాడు గిరిజన పల్లెలు గజగజలాడాయి. గతంలో నక్సల్స్ కొరియర్‌లను పోలీసులు ఏరివేస్తే ఇప్పుడు పోలీస్ ఇన్‌ఫార్మర్‌లను మావోయిస్టులు ఏరివేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నారని సమాచారం. తాజాగా కుర్నపల్లి సంఘటనతో అటవీప్రాంత ప్రజలు భయంతో వణుకుతున్నారు. 2008లో తిప్పాపురానికి చెందిన దబ్బా చంద్రరావు, శ్రీను అనే యువకులను మావోయిస్టులు కిడ్నాప్‌చేసి వారం రోజుల తరువాత చంద్రరావును హతమార్చి శ్రీనును విడుదల చేసారు. ఇంకో విచిత్రకరమైన విషయమేమిటంటే చంద్రరావు మృతదేహం ఆచూకి నేటివరకు తేలకపోవడం విశేషం. ప్రస్తుతంలో మావోల వద్ద బంధీలుగా ఉన్నవారిని మానవతా దృక్పధంతో విడుదల చేయాలని కుటుంబ సభ్యులు మావోయిస్టులను వేడుకుంటున్నారు. బంధీల కుటుంబసభ్యులను ఎవ్వరిని పలకరించినా తమ వారిని తలచుకొని కన్నీటిపర్యంతం అవుతున్నారు. గిరిజనుల కిడ్నాప్ విషయంపై వెంకటాపురం సి.ఐ కిరణ్‌కుమార్‌ను వివరణ అడగగా కిడ్నాప్‌కు సంబంధించి కుటుంబసభ్యుల నుండి తమకు ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, తమకు అందిన సమాచారం మేరకు ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
