పంటల బీమాకై సిపిఐ ఆందోళన

Fri, 3 Sep 2010, IST    vv
అనంతపురం జిల్లావ్యాప్తంగా రిలేదీక్షలు

ఉరవకొండ (వి.వి) : రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రోజు రోజుకు ప్రజాదరణ కోల్పోతున్నదని సిపిఐ అనంతపురం జిల్లా కార్యదర్శి దేవరగుడి జగదీష్‌ అన్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు ప్రాధాన్యత నిస్తూ ముఖ్య మంత్రి రోశయ్య రైతాంగ సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. శుక్రవారం సిపిఐ, రైతుసంఘం ఆధ్వర్యంలో 2009 పంటల బీమా సాధనకై జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల వద్ద ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జగదీష్‌ ఉరవకొండలో ప్రారంభించారు. స్థానిక మండల కార్యాలయం ఎదుట జరిగిన ఈ దీక్షలో జగదీష్‌తో పాటు రైతుసంఘం రాష్ట్ర సమితి సభ్యులు శివన్న, సిపిఐ మండల కార్యదర్శి నిరంజన్‌గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎరువుల కోసం రైతన్నలు పడిగాపులు పడుతున్నారని, రైతన్నలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 2009 వేరుశెనగ పంటల బీమాను, 2008లో పెండింగ్‌లో ఉన్న 5శాతం బీమాను ఇప్పటి వరకు రైతులకు చెల్లించలేదని, కేవలం ప్రకటనలతోనే కాలాన్ని వెల్లబుచ్చుతున్నదని విమర్శించారు. రైతాంగ సమస్యలపై ప్రకటనలకే పరిమితమైన వ్యవసాయమంత్రి రఘువీరారెడ్డి అసలు మంత్రిగానే పనికిరారని అన్నారు. అనేక సంవత్సరాలుగా కరువుకాటాకాలతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన మేలు ఏమిటని ప్రశ్నించారు. గత యేడాది జిల్లాలోని 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినా, ఈ ప్రభుత్వం ఏ ఒక్క మండలంలోను కరువు సహాయక చర్యలు చేపట్టిన పాపాన పోలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే 2009 పంటల బీమాను వారంలోపు విడుదల చేయాలని ఆయన డిమాండు చేశారు. సిపిఐ ఆందోళనకు టిడిపి, సిపిఎం నాయకులు మద్దతు ప్రకటించి దీక్షలో కుర్చున్నారు. దీక్షలో సిపిఐ నాయకులు వన్నూర్‌సాబ్‌, శ్రీధర్‌, మల్లేషప్ప, వెంకటేష్‌, ఇదయ తుల్లా, టిడిపి నాయకులు ఆసిఫ్‌, విజయభాస్కర్‌, గోవిందు, సిపిఎం నాయకులు రంగారెడ్డి, కోనంకి రాముడు పాల్గొన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు