మహబూబ్‌నగర్ (వి.వి) : అనుకున్నది ఒక్కటి అయినది మరొకటి ...పెట్టింది సన్మాన కార్యక్రమం,... జరిగింది తోపులాట కార్యక్రమం ఇలా సాగింది జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి మంత్రి డి.కె అరుణతో పాటు నాగర్‌కర్నూల్ ఎంపి డాక్టర్ మంద జగన్నాథం హాజరయ్యారు. సమావేశంలో పార్టీ నిర్మాణం తదితర అంశాలపై చర్చించాల్సిన పార్టీ కార్యకర్తలు, నాయకులు వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో సమావేశం కాస్తా రసాభాసగా మారింది. అరుణ, జగన్నాథంలకు సంబంధించిన వర్గీయులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి కాస్తా ఉద్రిక్తతకు దారితీసింది. నాయకులు ఎంతగా సముదాయించిన సమస్య సద్దుమనగకపోవడంతో చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మంత్రి వర్గానికి చెందిన కార్యకర్తలు, ఎంపి వర్గీయులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. పరిస్థితిని గమనించిన మంత్రి అక్కడి నుండి వెళ్లిపోవడంతో నాయకులు మరింత రెచ్చిపోయి కుర్చీలను విసురుకునే వరకు వెళ్లారు. ముఖ్యంగా జిల్లాలో ఒక నాయకురాలు అన్ని తానే అయి ఇష్టానుసారంగా నడిపిస్తున్నారంటూ ఎంపి వర్గానికి చెందిన కార్యకర్తలు ఆరోపణలు చేయడంతో ఘర్షణ మొదలైంది. జిల్లాలో ఇప్పటికే నష్టపోయిన పార్టీని చక్కదిద్దాల్సిన బాద్యత తీసుకోవాల్సిన నాయకులే ఈ విధంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం వలన పార్టీ మనుగడకే ప్రమాదమని పలువురు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉప ఎన్నికల తర్వాత జిల్లాలో అనేక మంది నాయకులు, వైసిపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దే అంశాన్ని పరిశీలించాల్సిన నాయకులు కీలక సమావేశంలో ఇలా వ్యక్తిగత విమర్శలకు తావ్విడంతో కార్యకర్తలు సైతం వారిపై పెదవివిరిచారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
