పారిశ్రామికాభివృద్ధిలో మానవీయకోణం

Fri, 3 Sep 2010, IST    vv
సిఐఐ చర్చాగోష్టిలో వక్తల ఆకాంక్ష
అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందాలి : నారాయణ

హైదరాబాద్‌(వి.వి): రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కావలసిన అవసరం ఉందని, ఇందులో మానవీయ కోణం మాత్రం చాలా ముఖ్యమని పలువురు వక్తలు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆశించిన స్థాయిలో పరిశ్రమల ఏర్పాటు జరగడం లేదని, దీనికి పాలకుల వైఫల్యాలే కారణమని అభిప్రాయపడ్డారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ (సిఐఐ) ఆంధ్రప్రదేశ్‌ శాఖ ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం చర్చాగోష్ఠి జరిగింది. ''ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి సానుకూల వాతావరణం'' అనే అంశంపై ఏర్పాటైన చర్చాగోష్టిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రగతికి తమ పార్టీ ఏ మాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీి అందాల్సిన అవసరం వుందని, మానవాళి వికాసానికి దోహదం చేయని అభివృద్ధికి అర్థం లేదని, అది నిజమైన అభివృద్ధి కానేకాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు 111కు చేరాయని, వీటి ఏర్పాటుకు పచ్చని పంటపొలాలు, వ్యవసాయ యోగ్యమైన భూములు తీసుకోవడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన భూమి ఎంత, అందులో లభించే ఉద్యోగాలెన్ని, ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులు, పేదల నుంచి తక్కువ ధరకు భూములు తీసుకున్న కొన్ని కంపెనీలు కోటి రూపాయలకు ఎకరం చొప్పున అమ్ముకుంటూ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తున్నాయని నారాయణ విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటు ద్వారా సమాజానికి లాభం చేకూరాలే తప్ప, కొంతమంది త్యాగం మరికొందరికి మేలు చేసేదిగా ఉండరాదని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తే భవిష్యత్‌ తరాలకు ప్రయోజనకరంగా ఉండగలదో అధికార యంత్రాంగం ఆలోచన చేస్తే బాగుంటుందన్నారు.

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధికి తమ పార్టీ అనుకూలమని స్పష్టం చేశారు. అభివృద్ధి అనేది అసమానతలను రూపుమాపేదిగా ఉండాలే తప్ప పెంచేది కాకూడదని చెప్పారు. పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎన్‌.తులసీరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలు, నాయకులు వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజారాజ్యం సీనియర్‌ నాయకులు కోటగిరి విద్యాధరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని, ఇందుకు పాలకులు, రాజకీయపక్షాలు, పారిశ్రామికవేత్తలు కారణమని చెప్పారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పేదలు, బడుగు వర్గాల ఉన్నతికి, దేశాభివృద్ధికి మనమంతా కలిసికట్టుగా కృషి చేయాల్సి వుందన్నారు. లోక్‌సత్తా అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌.జయప్రకాష్‌నారాయణ్‌, టిఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యులు జి.వినోద్‌రావు, హరిశ్చంద్రప్రసాద్‌, ఎంఐఎంకు చెందిన శాసనమండలి సభ్యులు సయ్యద్‌ అమీన్‌జాఫ్రీ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రగతి కారణంగా పర్యావరణానికి ముప్పువాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత పాలకులు, రాజకీయ పక్షాలు, సిఐఐపై వుందన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు