కేసు వాదించేందుకు 'సత్యం' ఉద్యోగికి అనుమతి

Fri, 3 Sep 2010, IST    vv
బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ పిటిషన్‌ కొట్టివేత
కంప్యూటర్‌ ఇచ్చేందుకు తిరస్కృతి

హైదరాబాద్‌ : కోట్లాది రూపాయల కుంభకోణానికి దారితీసిన 'సత్యం' కంప్యూటర్స్‌ అవినీతి ఆరోపణల కేసులో నిందితుడిగా ఉన్న ఆ కంపెనీ ఉద్యోగికి తన కేసును తానే వాదించుకునేందుకు కోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. సత్యం కంప్యూటర్స్‌లో ఫైనాన్స్‌ విభాగంలో వైస్‌ప్రెసిడెంట్‌గా విధులు నిర్వ హించిన జి. రామకృష్ణ అనే ఉద్యోగి చేసుకున్న పిటిషన్‌ను కోర్టు శుక్రవారం పరిశీలించింది. ఈ కేసులో తన పక్షాన తానే వాదించుకు నేందుకు 21వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటిన్‌ మెజిస్ట్రేట్‌ (ఎసిసి ఎమ్‌) కోర్టు అనుమతించింది. తనపై అభియోగాలు ఆపాదించ డానికి ముందు సిబిఐ చేసిన ఆరోప ణలపై తన వాదనను వినిపిం చేందుకు రామకృష్ణ కోర్టు అనుమతి కోరారు. రామకృష్ణ చేసుకున్న దరఖాస్తును మెజిస్ట్రేట్‌ బివిఎల్‌ఎన్‌ చక్రవర్తి అనుమతించారు. అయితే కోర్టు నిబంధనలను, మర్యాదను గౌరవిస్తానని, ఎట్టి పరిస్ధితుల్లో వాటికి భంగం కలిగించనని వాగ్ధానం చేస్తూ ఒక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రామకృష్ణను మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. సత్యం కేసుకు సంబంధించి తదుపరి విచారణను సెప్టెంబరు 6న కోర్టు చేపట్టనున్నది. ఇదిలాఉండగా సత్యం కంప్యూటర్స్‌ నిధుల మళ్ళింపుపై సిబిఐ విచారణ కొనసాగుతున్న దృష్ట్యా నిలిపివేయబడిన తమ బ్యాంకు ఖాతాలను తిరిగి పునరుద్ధరించవలసిందిగా కోరుతూ ప్రధాన నిందితుడు రామలింగరాజు కుమారులు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. బ్యాంకు ఖాతాల పునరుద్ధరణను కోరుతూ రామలింగరాజు కుమారులు గత ఏడాది కూడా పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. అప్పుడు కూడా కోర్టు పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. తిరిగి ఇప్పుడు చేసుకున్న దరఖాస్తును కూడా కోర్టు డిస్మిస్‌ చేసింది. కాగా తన లాప్‌ట్యాప్‌ను, రెండు పెన్‌డ్రైవ్‌లను, డివిడిని ఇప్పించాలని కోరుతూ రామరాజు చేసుకున్న దరఖాస్తును మెజిస్ట్రేట్‌ పాక్షికంగా ఆమోదించారు. అందుకుగాను రు.50,000 వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని కోరారు. కోర్టు ఎప్పుడు కోరితే అప్పుడు వాటిని సమర్పిస్తానని ఆయన చెప్పారు. అయితే ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబరేటరీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కంప్యూటర్‌ను ఆయనకు ఇచ్చేందుకు తిరస్కరించింది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు